మహిళాగర్జనకు కార్యకర్తలు కరువు
దేవినేని ఉమాపై చంద్రబాబు సీరియస్
ప్రసంగంపై స్పందించని కార్యకర్తలు
సాక్షి, విజయవాడ : తెలుగుదేశం అధినేత చంద్రబాబు గురువారం విజయవాడలో నిర్వహించిన ‘మహిళా గర్జన’కు కార్యకర్తల నుంచి స్పందన కరువైంది. మధ్యాహ్నం 2.30 గంటలకు డీవీ మానర్ నుంచి ర్యాలీ ప్రారంభమై 5.30 గంటలకు సభ ప్రారంభమవుతుందని నిర్వాహకులు తొలుత ప్రకటించారు. అయితే ఐదున్నర ప్రాంతంలో సభాస్థలి వద్ద ఐదారొందల మందికి మించి జనం లేకపోవడం, కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమివ్వడంతో చంద్రబాబు ఎక్కువ సమయం హోటల్ రూమ్‌లోనే గడిపారు.
చివరకు ర్యాలీగా బయల్దేరి రాత్రి ఏడు గంటలకు ఆయన సభాస్థలికి చేరుకున్నారు. నేతల ప్రసంగాల అనంతరం 8 గంటలకు చంద్రబాబు ప్రసంగం ప్రారంభించారు. ఆయన మాటలకు ప్రజల నుంచి స్పందన కానరాలేదు. ప్రజలను ఉత్సాహపరచడానికి ఎన్టీఆర్ జపం చేయాల్సి వచ్చింది. పలువురు మహిళా కార్యకర్తలు ఆయన ప్రసంగం వినకుండానే వెనుదిరిగారు.
చానళ్లలో లైవ్ కోసం...
గురువారం వైజాగ్‌లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సభ నిర్వహించారు. చంద్రబాబు వేదిక వద్దకు చేరుకునేసరికి వైజాగ్‌లో జనసేన సభ జరుగుతూ ఉండటంతో చాన్సల్ అన్నీ ఆ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. ఈ సమాచారం తెలుసుకున్న చంద్రబాబు తన ప్రసంగాన్ని 8 గంటల తరువాత ప్రారంభించడంతో ప్రత్యక్ష ప్రసారం కోసం ప్రసంగం సమయం వెనక్కి జరిపారంటూ మీడియా గ్యాలరీలో ప్రచారం జరిగింది. తొమ్మిది గంటలు దాటినా ఆయన ప్రసంగం కొనసాగడంతో పర్మిషన్ గడువు ముగిసిందంటూ పోలీసులు హడావుడి చేశారు.
ఉమాపై ఆగ్రహం...
సాయంత్రం ఐదున్నర గంటలకు సభాస్థలిలో జనాలు లేకపోవడంతో హోటల్లో, ర్యాలీలో కూడా పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమాపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. నాయకులకు సీట్లు ఇవ్వమంటూ సిఫార్సులు చేయడం కాదు.. సభలను నిర్వహించడం నేర్చుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మహిళా గర్జన ఎందుకు విజయవంతం చేయలేకపోయారని నిలదీసినట్లు సమాచారం.
రోత పుట్టించిన వేణుమాధవ్...
సినీ హాస్యనటుడు వేణుమాధవ్ ప్రసంగం అభ్యంతరకరంగా సాగింది. మీ (మహిళల) భర్తలు టీడీపీకి ఓటు వేయకపోతే ‘అన్నం పెట్టొద్దు.. ఇంట్లోకి రానీయొద్దు.. ఆ.. టైంలో అసలు దగ్గరకు రానీయొద్దు’ అంటూ వెకిలి కామెడీ చేశారు. దీంతో వేదికపై ఉన్న మహిళలు అసహనానికి గురికాగా, వేదిక కింద ఉన్న మహిళలు ఏవగించుకున్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, దిగ్విజయ్ ఎవరిపైనైనా పోటీ చేయగలనంటూ పిట్టలదొరలా మాట్లాడారు. జనం నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో పది నిమిషాల్లోనే ప్రసంగం ముగించారు. అనంతరం ఆయన కూర్చునేందుకు సీటు కూడా దొరక్కపోవడంతో కాగిత వెంకట్రావ్ పక్కనే కొద్దిసేపు సర్దుకుని కూర్చుని తరువాత వేదిక దిగి వెళ్లిపోయారు.
అదుపులేని హామీలు.. విస్తుపోయిన జనం
కార్పొరేషన్ : టీడీపీ అధికారంలోకి వస్తే గుంటూరు - విజయవాడలను కలిపి హైదరాబాద్ కంటే మహా నగరంగా తీర్చిదిద్దుతానని చంద్రబాబు అన్నారు. మహిళా గర్జనలో ఆయన హద్దూ అదుపూ లేని హామీలను గుప్పించారు. హనుమాన్‌జంక్షన్, నందిగామ, చిలకలూరిపేట ప్రాంతాలను కలుపుతూ కృష్ణా రివర్‌కు రింగ్‌రోడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. పులిచింతల పనులు పూర్తి కాకుండానే కాంగ్రెస్ నాయకులు హడావిడిగా ప్రారంభోత్సవం చేశారని, తాను అధికారంలోకి వచ్చాక మరోమారు ప్రారంభోత్సవం చేస్తానని, పోలవరం పనులు పూర్తి చేస్తానన్నారు. కృష్ణాజిల్లా మహా పురుషులకు జన్మనిచ్చిందని, తన అత్తగారి జిల్లా కాబట్టి మర్చిపోయే ప్రసక్తే లేదన్నారు. చిత్తూరు కంటే ఈ జిల్లానే అభివృద్ధి చేస్తానని చెప్పుకొచ్చారు.