womens tennis tournment
-
ఓటమితో మొదలు
పుణే: సొంతగడ్డపై జరుగుతున్న ప్రతిష్టాత్మక బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 మహిళల టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత్‌కు శుభారంభం లభించలేదు. మంగళవారం మొదలైన ఈ టోర్నీలో భారత్ తమ తొలి లీగ్ మ్యాచ్‌లో పరాజయం పాలైంది. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 1–2తో ఓటమి చవిచూసింది. న్యూజిలాండ్ జట్టులో ప్రపంచ 245వ ర్యాంకర్ లులు సన్ సింగిల్స్ మ్యాచ్‌తోపాటు డబుల్స్‌లోనూ బరిలోకి దిగి తమ జట్టును విజయతీరాలకు చేర్చింది. తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ అమ్మాయి, ప్రపంచ 345వ ర్యాంకర్ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక 6–1, 6–1తో ఐశి దాస్ (న్యూజిలాండ్)పై అలవోకగా గెలిచింది. దాంతో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కేవలం 57 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రష్మిక కేవలం రెండు గేమ్‌లు కోల్పోయింది. ఆరు ఏస్‌లు సంధించిన రష్మిక నాలుగు డబుల్ ఫాల్ట్‌లు కూడా చేసింది. తొలి సర్వ్‌లో 20 పాయింట్లు నెగ్గిన రష్మిక రెండో సర్వ్‌లో తొమ్మిది పాయింట్లు సాధించింది. తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా చేజార్చుకోని రష్మిక ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేయడం విశేషం. రెండో మ్యాచ్‌లో గెలిస్తే భారత్ 2–0తో విజయాన్ని ఖాయం చేసుకునేది. కానీ న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ లులు సన్ 6–3, 6–3తో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ అమ్మాయి సహజ యామలపల్లిని ఓడించింది. దాంతో స్కోరు 1–1తో సమమైంది. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ తన సర్వీస్‌ను మూడుసార్లు చేజార్చుకుంది. ఆరు ఏస్‌లు సంధించిన లులు సన్ రెండు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. స్కోరు 1–1తో సమం కావడంతో చివరిదైన డబుల్స్ మ్యాచ్ కీలకంగా మారింది. సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ అంకిత రైనా, డబుల్స్‌లో భారత నంబర్‌వన్ ప్రార్థన తొంబారే జత కట్టి ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగారు. అయినప్పటికీ భారత్‌కు ఓటమి తప్పలేదు. 83 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అంకిత–ప్రార్థన ద్వయం 3–6, 4–6తో లులు సన్–మోనిక్యూ బ్యారీ జోడీ చేతిలో ఓడిపోవడంతో న్యూజిలాండ్ 2–1తో విజయాన్ని అందుకుంది. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో భారత్ ఆడుతుంది. -
మెయిన్ ‘డ్రా’కు రష్మిక, నిధి, సాత్విక
పుణే: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారిణులు శ్రీవల్లి రష్మిక, నిధి చిలుముల, సామ సాత్విక... ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శ్రేయ తటవర్తి మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్‌ల్లో రష్మిక 6–1, 6–4తో హుమేరా బహార్మస్ (భారత్)పై, నిధి 4–6, 6–4, 10–6తో జెన్నిఫర్ ల్యుఖమ్ (భారత్)పై, సాత్విక 6–0, 6–1తో సౌమ్య (భారత్)పై, శ్రేయ 6–1, 6–2తో ఎలీనా (డెన్మార్క్)పై గెలిచారు. -
రన్నరప్ సింధు జోడీ
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మహిళల టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి సింధు జనగాం మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. బెంగళూరులో జరిగిన ఈ టోర్నీలో తన భాగస్వామి శరణ్య శెట్టితో కలిసి డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో సింధు (తెలంగాణ)– శరణ్య (మహారాష్ట్ర) జంట 4–6, 6–1, 6–10తో అవిష్క గుప్తా (జార్ఖండ్)–ఎం. ఆర్తి (తమిళనాడు) జోడీ చేతిలో సూపర్ టైబ్రేక్‌లో పరాజయం పాలైంది. -
డబుల్స్ విజేత రిషిక జోడి
సింగిల్స్‌లో ఫైనల్‌కు ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టెన్నిస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి రిషిక సుంకర సత్తా చాటుతోంది. సింగిల్స్‌లో ఫైనల్‌కు చేరడంతోపాటు డబుల్స్‌లో షర్మదా బాలుతో కలిసి విజేతగా నిలిచింది. మొయినాబాద్‌లోని సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ (ఎస్ఎంటీఏ)లో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన డబుల్స్ ఫైనల్లో రిషిక-షర్మద జోడి 6-1, 7-5 తేడాతో ప్రార్థనా తొంబరే-శ్వేతా రాణా ద్వయంపై విజయం సాధించింది. ఇక సింగిల్స్ సెమీఫైనల్లో రిషిక 6-1, 6-0 తేడాతో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన నిధి చిలుములపై గెలుపొందింది. మరో సెమీఫైనల్లో ప్రార్థనా తొంబరే 7-6(5), 7-5 తేడాతో నటాషా ఫల్హాను ఓడించి తుదిపోరుకు చేరింది. రిషిక, నటాషాల మధ్య శనివారం టైటిల్ పోరు జరగనుంది. -
మూడో రౌండ్లో భువన, నిధి
ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు కాల్వ భువన, నిధి చిలుముల వరుస విజయాలతో సత్తా చాటారు. మొయినాబాద్‌లోని సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ (ఎస్‌ఎమ్‌టీఏ)లో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన రెండో రౌండ్లో భువన 6-4, 7-5తో మాన్య నాగ్పాల్పై చెమటోడ్చి నెగ్గగా, నిధి 6-0, 6-0తో తతాచార్పై అలవోక విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో ప్రార్థన తొంబరే 6-7 (4/7), 6-3, 6-0తో దామిని శర్మపై గెలుపొందగా, అమృత ముఖర్జీ 0-6, 6-4, 6-2తో శర్మదా బాలును కంగుతినిపించింది. నటాషా పల్హా 6-1, 6-4తో సంచన షరాన్ పాల్‌పై నెగ్గగా, ఇతీ మెహతా 6-0, 6-2తో రిషిక రవీంద్రన్‌పై సునాయాస విజయం సాధించింది. రిషిక సుంకర 6-0, 6-1తో రేష్మ గణపతిపై, శ్వేతా రాణా 6-2, 6-3తో ఆర్తి మునియన్పై గెలుపొందారు. -
ఉస్మానియాకు టెన్నిస్ టైటిల్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: సెంట్రల్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ మహిళల టెన్నిస్ టోర్నమెంట్ టీమ్ టైటిల్‌ను ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) జట్టు చేజిక్కించుకుంది. బిలాస్పూర్ యూనివర్సిటీలో జరిగిన ఫైనల్లో ఉస్మానియా 2-0 స్కోరుతో జేఎన్టీయూ (హైదరాబాద్) జట్టుపై విజయం సాధించింది. తొలి సింగిల్స్‌లో అనుష్క భార్గవ (ఓయూ) 6-3, 6-2 స్కోరుతో మౌలిక రామ్ (జేఎన్టీయూ)పై విజయం సాధించింది. రెండో సింగిల్స్‌లో కాల్వ భువన (ఓయూ) 6-0, 6-0తో వై.సింధూర (జేఎన్టీయూ)పై గెలిచింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో ఓయూ జట్టు 2-0తో అలహాబాద్ యూనివర్సిటీపై గెలిచింది. సింగిల్స్ జాతీయ స్కూల్ టెన్నిస్ మాజీ చాంపియన్ శాంభవి దీక్షిత్ (ఓయూ) 6-0, 6-0తో ఆయూషీ యాదవ్‌పై, అమ్రీన్ నాజ్ (ఓయూ) 6-0, 6-0తో షేక్ నాజ్‌పై గెలిచారు. రెండో సెమీస్‌లో జేఎన్టీయూ 2-1తో బిలాస్పూర్ జట్టుపై గెలిచింది. సింగిల్స్‌లో మౌలిక రామ్ 6-2, 6-3తో ముక్తాపై గెలిచింది. రెండో సింగిల్స్‌లో వై.సింధూర (జేఎన్టీయూ) 3-6, 4-6తో నేహా చేతిలో ఓడిపోయింది. డబుల్స్‌లో మౌలిక రామ్, వై.సింధూర జోడి 6-1, 6-2తో నేహా, ముక్తా జోడిపై నెగ్గింది.