ఓటమితో మొదలు | India disappointed in Billie Jean King Cup tournament | Sakshi
Sakshi News home page

ఓటమితో మొదలు

Apr 9 2025 3:52 AM | Updated on Apr 9 2025 3:52 AM

India disappointed in Billie Jean King Cup tournament

బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ టోర్నీలో భారత్‌కు నిరాశ

తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో పరాజయం

శుభారంభం అందించిన రష్మిక 

సహజ, అంకిత–ప్రార్థన జోడీ ఓటమి 

పుణే: సొంతగడ్డపై జరుగుతున్న ప్రతిష్టాత్మక బిల్లీ జీన్‌ కింగ్‌ కప్‌ ఆసియా ఓసియానియా గ్రూప్‌–1 మహిళల టీమ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు శుభారంభం లభించలేదు. మంగళవారం మొదలైన ఈ టోర్నీలో భారత్‌ తమ తొలి లీగ్‌ మ్యాచ్‌లో పరాజయం పాలైంది. న్యూజిలాండ్‌ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 1–2తో ఓటమి చవిచూసింది. న్యూజిలాండ్‌ జట్టులో ప్రపంచ 245వ ర్యాంకర్‌ లులు సన్‌ సింగిల్స్‌ మ్యాచ్‌తోపాటు డబుల్స్‌లోనూ బరిలోకి దిగి తమ జట్టును విజయతీరాలకు చేర్చింది. 

తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ అమ్మాయి, ప్రపంచ 345వ ర్యాంకర్‌ భమిడిపాటి శ్రీవల్లి రష్మిక 6–1, 6–1తో ఐశి దాస్‌ (న్యూజిలాండ్‌)పై అలవోకగా గెలిచింది. దాంతో భారత్‌ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కేవలం 57 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రష్మిక కేవలం రెండు గేమ్‌లు కోల్పోయింది. ఆరు ఏస్‌లు సంధించిన రష్మిక నాలుగు డబుల్‌ ఫాల్ట్‌లు కూడా చేసింది. తొలి సర్వ్‌లో 20 పాయింట్లు నెగ్గిన రష్మిక రెండో సర్వ్‌లో తొమ్మిది పాయింట్లు సాధించింది. తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా చేజార్చుకోని రష్మిక ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేయడం విశేషం.  

రెండో మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌ 2–0తో విజయాన్ని ఖాయం చేసుకునేది. కానీ న్యూజిలాండ్‌ స్టార్‌ ప్లేయర్‌ లులు సన్‌ 6–3, 6–3తో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్‌ అమ్మాయి సహజ యామలపల్లిని ఓడించింది. దాంతో స్కోరు 1–1తో సమమైంది. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సహజ తన సర్వీస్‌ను మూడుసార్లు చేజార్చుకుంది. ఆరు ఏస్‌లు సంధించిన లులు సన్‌ రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. స్కోరు 1–1తో సమం కావడంతో చివరిదైన డబుల్స్‌ మ్యాచ్‌ కీలకంగా మారింది. 

సింగిల్స్‌లో భారత నంబర్‌వన్‌ అంకిత రైనా, డబుల్స్‌లో భారత నంబర్‌వన్‌ ప్రార్థన తొంబారే జత కట్టి ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగారు. అయినప్పటికీ భారత్‌కు ఓటమి తప్పలేదు. 83 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అంకిత–ప్రార్థన ద్వయం 3–6, 4–6తో లులు సన్‌–మోనిక్యూ బ్యారీ జోడీ చేతిలో ఓడిపోవడంతో న్యూజిలాండ్‌ 2–1తో విజయాన్ని అందుకుంది. నేడు జరిగే రెండో లీగ్‌ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌తో భారత్‌ ఆడుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement