breaking news
Womens conductor
-
ఏంటికి పనికొస్తావు.. కలెక్షన్ ఇంతేనా?
* మహిళా కండక్టర్‌తో దురుసుగా మాట్లాడిన ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ * ఆర్టీసీ బస్టాండ్‌లో కార్మికుల ధర్నా ధర్మవరం అర్బన్: బస్సు చెడి పోయిందని చెబితే ఎలా?.. 216 కిలో మీటర్లు తిరిగి కేవలం రూ. 1960 కలెక్షన్ తెస్తే సరిపోతుందా? నువ్వు ఏంటికి పనికొస్తావు? చెప్పు అంటూ మహిళా కండక్టర్ సుకన్యతో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పెద్దన్న అసభ్యంగా మాట్లాడారు. ధర్మవరం ఆర్టీసీ డిపోలో మంగళవారం రాత్రి 10గంటల సమయంలో ఆర్టీసీ మహిళా కండక్టర్ సుకన్యతోపాటు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ధర్నా చేశారు. ధర్మవరం డిపో నుంచి తాడిమర్రి మండలం నార్సింపల్లికి నడిచే బస్సుకు మహిళా కండక్టర్ సుకన్య డ్యూటీపై వెళ్లారు. బస్సు మరమ్మతుకు గురి కాగా.. రిపేరీ చేసుకుని బత్తలపల్లి వరకూ వచ్చారు. అక్కడ మరోసారి బస్సు మొరాయించింది. దీంతో ఇబ్బంది పడి మరమ్మతు చేసుకుని, బస్సును డిపోకు చేర్చారు. బస్సు చెడిపోయిందని కండక్టర్ సుకన్య ఆర్టీసీ డీఎం రామసుబ్బయ్యకు తెలిపగా పక్కనే ఉన్న ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పెద్దన్న జోక్యం చేసుకుని ‘నీవు ఏంటికి పనికొస్తావు.. చెప్పు ’అంటూ అసభ్యంగా మాట్లాడారని మహిళా కండక్టర్ కన్నీటపర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న తోటి కండక్టర్లు, డ్రైవర్లు ఆర్టీసీ డిపోలోనే బస్సులను బయటకు పంపకుండా ధర్నా చేశారు. రెండు గంటల పాటు కార్మికులు ధర్నాకు చేశారు. ఆర్టీసీ డిపోలోని మహిళా కండక్టర్లతో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పెద్దన్న ఎప్పుడూ దురుసుగా ప్రవర్తిస్తారని, ప్రతిఒక్క కండక్టర్నూ పట్ల ఇదేతీరుతో వ్యవహరిస్తారని కార్మికులు వాపోయారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో టీఐపై ఫిర్యాదు చేస్తామని కార్మికులు తెలిపారు. -
కండక్టర్‌పై చేయి చేసుకున్న ప్రయాణికురాలు
మలక్‌పేట: టికెట్ చిల్లర విషయంలో మహిళా కండక్టర్‌పై ఓ ప్రయాణికురాలు చేయిచేసుకున్న సంఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... కూకట్పల్లి డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు ఎల్బీనగర్ నుంచి యూసుఫ్‌గూడకు వెళ్తోంది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో దిల్సుఖ్నగర్ ప్రాంతంలో ఓ మహిళ బస్సెక్కింది. టికెట్‌కు సరిపడా చిల్లర ఇవ్వాలని కండక్టర్ అడగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రయాణికురాలు కండక్టర్‌పై చేయిచేసుకుంది. దీంతో బస్సును మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి ఆ ప్రయాణికురాలిని పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. ప్రయాణికురాలు పుట్‌పాత్‌పై నివాసం ఉండే మహిళగా పోలీసులు గుర్తించారు. మూడు రోజుల పసికందును కలిగి ఉన్న మహిళ మత్తులో ఉండడం గమనార్హం.