breaking news
Western distarbenses
-
మండే ఎండల్లో ముంచెత్తే వానలు?
దేశవ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్న వేళ ఉత్తరభారత ప్రజలకు సూర్యప్రతాపం నుంచి భారీ ఉపశమనం కల్పించేందుకు అనూహ్యంగా ఉత్తరభారతంపై భారీ వర్షాలు కురిపించేందుకు పాశ్చాత్య భంగం(వెస్టర్న్ డిస్టబెన్సెస్) సంసిద్ధమవుతోందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు గురువారం పాశ్చాత్య భంగం తాలూకు గాలుల తాజా ఉపగ్రహ చిత్రాలను వాతావరణ శాఖ విడుదలచేసింది. వడగాల్పులు, ఉక్కపోతతో ఉత్తరభారత ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్న సమయంలో చలికాలంలో మంచు, వర్షాలకు కారణమయ్యే పాశ్చాత్య భంగం తాలూకు గాలులు హఠాత్తుగా భారత్ దిశగా వస్తుండటంతో ఎండాకాల వేడిమి జనాలకు ఊరట లభించనుంది. మే 21వ తేదీన ఇన్శాట్–3డీఎస్ ఉపగ్రహం ద్వారా తీసిన చిత్రాల్లో పాశ్చాత్య భంగం సంబంధిత గాలులతో మేఘాలు, తుపానుకు ముందు కన్పించే వాతావరణం అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, వాయవ్య భారత గగనతలాలపై అలుముకున్నట్లు కన్పించింది. తెల్లని దట్టమైన మేఘాలు హిమాలయ పర్వతాల వైపు, ఉత్తరభారత మైదానాల దిశగా పయనం మొదలెట్టినట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా తెలుస్తోంది. అరేబియా సముద్రం మీద సైతం తేమతో కూడిన మేఘాలు ఏర్పడ్డాయి. ఈశాన్య భారతం మీద, బంగాళాఖాతం మీద సైతం మేఘావృతమైన వాతావరణ పరిస్థితులు స్పష్టంగా కన్పిస్తున్నాయి. పాశ్చాత్య భంగం లేదా పశ్చిమ విక్షోభం అనేది భారత్‌ను చుట్టుముడితే మరింతగా తేమను మోసుకొచ్చి ఉత్తరభారతంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వాన, ఈదురుగాలులతోపాటు పిడుగులు పడే ప్రమాదముందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ఉత్తర పాకిస్తాన్, జమ్మూకశ్మీర్‌లపై ఆకాశం అతిగా మేఘావృతం కావడంతో ఇక్కడి వాతావరణం హఠాత్తుగా మారుతూ అస్థిర పరిస్థితులను తీసుకురావచ్చు. ఈశాన్యభారతం మీదా మేఘాలు అతిగా కన్పిస్తుండటంతో వర్షాకాలం ప్రారంభంకాకమునుపే మెరుపులతో కూడిన వర్షాలు పడే ఆస్కారముందని నిపుణులు అభప్రాయపడ్డారు. పాశ్చాత్య భంగం ఇలాగే ఉధృతమై ముందుకు సాగితే ఉత్తరభారతంలో ముఖ్యంగా జమ్మూకశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతాల్లో వచ్చే కొద్దిరోజుల్లో వర్షాలు మొదలయ్యే వీలుంది. ధూళి తుపాన్లు, వడగండ్ల వానలు పడినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు వ్యాఖ్యానించారు. పాశ్చాత్య భంగం మోసుకొచ్చి తేమ కారణంగా పడే వర్షాలు యావవత్ భారతదేశంలో ఎండ బాధలను పూర్తిగా తగ్గించకపోయినా ఉష్ణోగ్రతలు కాస్తంత తగ్గడానికి ఖచ్చితంగా దోహదపడతాయని నిపుణులు భరోసా ఇచ్చారు. అరేబియా సముద్రం, బంగాళాఖాతం దక్షిణప్రాంతాల్లో పెరిగిన మేఘాల సంచారం నెమ్మదిగా వర్షాకాల వాతావరణాన్ని సృష్టిస్తోంది. పాశ్చాత్య భంగం వేగంగా భారత్‌ను చుట్టుముడితే కనీసం ఉత్తర భారత ప్రజలకైనా ఈ ఉక్కపోత రాత్రుల నుంచి ఉపశమనం కల్గుతుంది. వడదెబ్బల భయం తగ్గుతుంది. అయితే విచ్చలవిడిగా పెరుగుతున్న కాలుష్యం, శిలాజ ఇంధనాల అతి వినియోగం, క్లోరోఫ్లోరో కార్భన్లు భారీ స్థాయిలో వెలువడటం వంటివి భారత్‌లో వడగాల్పులు వచ్చే అవకాశాలు ప్రతిఏటా మరింత పెంచేస్తాయని నిపుణులు హెచ్చరించారు. ఏమిటీ పాశ్చాత్య భంగం? మధ్యధరా సముద్ర ప్రాంతం, కాస్పియన్ సముద్రం, నల్ల సముద్రం ప్రాంతాల నుంచి మొదలై తూర్పు దిశగా పయనిస్తూ భారత్‌లోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో శీతాకాలంలో వర్షాలను కురిపించే అల్పపీడన వాయు ప్రసరణ వ్యవస్థను పాశ్చాత్యభంగం లేదా పశ్చిమ విక్షోభం అని పిలుస్తారు. పశ్చిమ విక్షోభ గాలులు తేమను మోసుకొస్తూ ఉత్తరభారతంలో మరీ ముఖ్యంగా హిమాలయాల్లో శీతాకాలంలో భారీగా మంచుకురవడానికి కారణమవుతాయి. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్‌లోనూ వర్షాలకు ఈ పాశ్చాత్య భంగమే కారణం. భారత్‌లో గోధుమపంట దిగుబడినీ పశ్చిమ విక్షోభం నిర్ణయిస్తుంది. సరైన సమయంలో చుట్టుముట్టే పశ్చిమ విక్షోభంతో పంజాబ్, హరియాణా, యూపీ, రాజస్థాన్‌లో గోధుమ దిగుబడి పెరుగుతుంది. శీతాకాలంలో మేఘాలు, వర్షం, హిమపాతం తెచ్చే పాశ్చాత్యభంగం ఒకరకంగా ఉత్తరభారతానికి మరో వర్షాకాలం వంటిది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నగరం భగభగ
ఇప్పట్లో వానలు లేనట్టేనంటున్న వాతావరణ శాఖ ఎండ ... ఈ పేరు వింటేనే నగరవాసుల గుండె దడదడలాడుతోంది. నగరంలో శుక్రవారం ఏకంగా 47.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఉదయం నుంచే వడగాలులు వీచాయి. దీంతో ఇంటి నుంచి బయటికొచ్చినవారి బాధలు వర్ణనాతీతంగా మారాయి. మరోవైపు విద్యుత్ సరఫరాలో కోత కారణంగా ఇళ్లకే పరిమితమైన వారు సైతం ఉక్కపోతతో విలవిలలాడారు. సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని నగరం అగ్ని గుండాన్ని తలపిస్తోంది. ఉత్తర భారత్‌లో కొనసాగుతోన్న హీట్ వేవ్ ప్రభావంతో శుక్రవారం పాలం ప్రాంతంలో 47.2 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పశ్చిమ రాజస్థాన్ నుంచి వీస్తున్న వేడిగాలుల కారణంగా రాజధానిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయంటున్నారు. ఈ ఉష్ణతాపం మరికొన్ని రోజులపాటు కొనసాగవచ్చని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు. మరో వారంరోజులపాటు ఉష్ణోగ్రతలు తీవ్రంగానే ఉంటాయని వాతావరణ విభాగం అంటోంది. వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ చురుగ్గా లేనందువల్ల నగరంలో ఇప్పట్ల్లో వానపడే అవకాశం లేదని చెబుతోంది. శుక్రవారం కనీస ఉష్ణోగ్రత కూడా 30 డిగ్రీల సెల్సియస్‌కు పైనే ఉంది. తఉదయం నుంచే ఢిల్లీ ఎన్సీఆర్లో వేడిగాలులు, ఎండ తీవ్రరూపం దాల్చాయి. దీంతో ఇళ్ల నుంచి బయటపడినవారు భానుడి తీవ్రత నుంచి తప్పించుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. పాదచారులు, బస్సులతోపాటు ద్విచక్రవాహనాలపై ప్రయాణించేవారు ఎం డ ధాటికి విలవిలలాడారు. పాదచారులు గొడుగుల కింద నడుస్తూ, ముఖానికి స్కార్ఫ్ చుట్టుకుని నడుస్తూ దర్శనమిచ్చారు. ఎండ తీవ్రత తమను బాగా ఇబ్బందులకు గురిచేస్తున్నప్పటికీ తమ వ్యాపారం బాగా జరుగుతోందంటూ రహదారుల వెంబడి తాగునీరు, బేల్ షర్బత్, లస్సీ, ఐస్‌క్రీం, శీతల పానీయాల విక్రేతలు ఆనందం వ్యక్తం చేశా రు. ఎండ తీవ్రత కారణంగా మధ్యాహ్నం మార్కె ట్లు బోసిపోయి కనిపించాయి. ఎండవేడి తట్టుకోలేక షాపర్లు మార్కెట్లకు రావడానికి బదులు మాల్స్‌కు వెళ్లడానికి ఇష్టపడుతున్నారని దుకాణదారులు చెప్పారు. వారాంతంలో కూడా ఎండ తీవ్రత ఇలాగే కొనసాగితే సరుకు అలాగే మిగిలిపోతుందని సరోజినీనగర్ మార్కెట్ సమీపంలో రోడ్డుపక్కన దుస్తులు విక్రయించే ఓ వ్యాపారి చెప్పాడు. ఒకవైపు ఎండ తీవ్రత, మరోవైపు విద్యుత్ సరఫరాలో కోతతో నగరవాసులు నానాయాతనలకు గురయ్యారు.


