breaking news
West Godavari leaders
-
'కోడి పందేలపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై ఏదీ'
జిల్లాలోని ప్రజా ప్రతినిధులకు మాజీ ఎంపీ జోగయ్య లేఖాస్త్రం పాలకొల్లు : ‘హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో కోడిపందేలు జరగనివ్వం. పందేలను ప్రోత్సహిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని పోలీస్ ఉన్నతాధికారులు హెచ్చరికలు చేశారు. తెరచాటున అనుమతులిచ్చి కోడిపందేలు ఆడించడం చాలా దారుణం’ అని మాజీ ఎంపీ చేగొండి వెంకట హరరామజోగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులపై సంధించిన లేఖాస్త్రాన్ని మంగళవారం పత్రికలకు విడుదల చేశారు. కోడి పందేల విషయంలో పోలీస్ ఉన్నతాధికారుల చేతులు కట్టేయడానికి చినబాబు (లోకేష్) కారణమని కొందరు, లక్షలాది రూపాయలు చేతులు మారడం వల్లేనని మరికొందరు గుసగుసలాడుకోవడాన్ని గమనిస్తే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ స్థాయికి దిగజారిపోయిందో, అవినీతి ఎంత పెరిగిపోయిందో అవగతం అవుతోందని జోగయ్య తాను రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులకు కోడిపందేలపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోయాక జిల్లాలోని ప్రజాప్రతి నిధులు చెప్పుకోదగిన అభివృద్ధి కార్యక్రమం గాని, సంక్షేమ పథకాన్ని గాని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒప్పించి తీసుకువచ్చిన జాడలేదని పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు, మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాత్రం తన సొంత పలుకుబడితో కేంద్రాన్ని ఒప్పించి నిట్ విద్యాసంస్థను తీసుకురాగలిగారని, జిల్లాలో ఆ ఒక్కటి తప్ప చెప్పుకోదగిన అభివృద్ధి కార్యక్రమం ఏమీ లేదని అభిప్రాయపడ్డారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత చేస్తున్న అభివృద్ధి అంతా చంద్రబాబునాయుడు సామాజిక వర్గం అధికంగా ఉన్న గుంటూరు జిల్లాకు మాత్రమే పరిమితమైందని చెప్పక తప్పడం లేదన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరిలో నిల్వ ఉన్న కొద్దిపాటి నీటిని కృష్ణా, గుంటూరు జిల్లాలకు తరలించి ఉభయ గోదావరి జిల్లాల రైతులకు సాగునీరు లేకుండా చేసిన ఘనత చంద్రబాబునాయుడుదేనన్నారు. టీడీపీ, బీజేపీ అభ్యర్థులను గెలిపించి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడటానికి ‘పశ్చిమ’ ప్రజలే కారకులయ్యారని, అటువంటి జిల్లాలో కనీస అభివృద్ధి కార్యక్రమాలైనా చేపట్టకపోవడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు. డెల్టా ప్రాంత ప్రజలు రక్షిత మంచి నీరు అందక రోగాల పాలవుతున్నారని చెప్పారు. డెల్టాప్రాంత ప్రజలకు పంట కాలువల ద్వారా మంచినీరు అందించడానికి ప్రస్తుతం అనుసరిస్తున్న విధానం కాకుండా.. ప్రత్యేక పైపులైన్ ఏర్పాటు చేయడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేసిన ప్రతిపాదనలను కార్యరూపంలోకి తీసుకురావాలని కోరారు. దీనికి సుమారు రూ.1,500 కోట్లు వ్యయం అవుతుందని ఇంజినీరింగ్ అధికారులు అంచనా వేశారన్నారు. జిల్లాలో పేద ప్రజలకు ప్రభుత్వపరంగా ఆధునిక వైద్యం లభించడం లేదని, ప్రతిచిన్న వైద్యానికి హైదరాబాద్ పరుగెత్తాల్సిన దుస్థితి ఉందన్నారు. జిల్లాలో నిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాల్సిన అవసరం ఉందని లేఖలో జోగయ్య పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర ఉద్యోగాలు అమరావతి రాజధాని ప్రాంతమైన కృష్ణా, గుంటూరు జిల్లాల వారికే పరిమితమయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు. రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్‌గా ప్రకటిస్తే తప్ప రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వారికి ఉద్యోగ అవకాశాలు ఉండవన్నారు. గోదావరి పుష్కరాలకు రూ.1,500 కోట్లు, రాజధాని శంకుస్థాపనకు రూ.400 కోట్లు, ప్రతిరోజు చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరగడానికి కోట్లాది రూపాయలు వెచ్చించగలిగే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పశ్చిమగోదావరి జిల్లాను అభివృద్ధి చేయడానికి అయ్యే ఖర్చు పెద్ద సమస్య కాదన్నారు. కోడిపందేలను ప్రోత్సహించడంలో ప్రజాప్రతినిధులు చూపిన చొరవను జిల్లాలోని సమస్యల పరిష్కారం, అభివృద్ధిపైనా చూపాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా కోడిపందేల వంటి చిల్లర చేష్టలతో పబ్బం గడిపే ప్రజాప్రతినిధులకు ఏవిధంగా బుద్ధి చెప్పాలో ప్రజలే నిర్ణయించుకోవాలని జోగయ్య ఆ లేఖలో సూచించారు. -
అసలు పేరు కంటే కొసరు పేరే ముద్దు
అసలు పేరు ఎంతున్నా.. కొందరు ముద్దుపేర్లతోనే పాపులర్ అవుతుంటారు. ఇలాంటి వారిలో రాజకీయ నాయకులే ఎక్కువ. గోదావరి జిల్లాల్లో.. అది కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో మరీ ఎక్కువ. ఇక్కడ పలువురు నాయకుల అసలు పేర్లు చాలామందికి తెలియవు. వాళ్లంతా ముద్దుపేర్లతోనే ప్రాచుర్యం పొందారు. అలాంటివాళ్లలో కొందరి వివరాలు చూద్దాం.. ఏలూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆళ్ల నాని అసలు పేరు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్. ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు పూర్తి పేరు మాగంటి వెంకటేశ్వరరావు. తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని పూర్తి పేరు ఈలి వెంకట మధుసూదనరావు. రాజ్యసభ మాజీ సభ్యుడు యర్రా నారాయణస్వామిని బెనర్జీగా పిలుస్తుంటారు. మాజీ మంత్రి కలిదిండి రామచంద్రరాజును అబ్బాయిరాజుగా పిలిచేవారు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావును కృష్ణబాబుగా పిలుస్తారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు జీఎస్ రావు అసలు పేరు గెడ్డం సుర్యారావు. డీసీసీ మాజీ అధ్యక్షుడు గోకరాజు రామరాజును రామం అంటారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే పీవీఎల్ నరసింహరాజును యండగండి నరసింహరాజుగా పిలుస్తారు. డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం అసలు పేరు వెంకటేశ్వరరావు. రత్నం అంటే తప్ప ఎవరికీ తెలియదు. అత్తిలి మాజీ ఎమ్మెల్యే వీకేడీవీ సత్యనారాయణరాజును పాందువ్వ కనకరాజుగా పిలుస్తుంటారు. ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు అంటే ఎవరికీ తెలియదు. కలవపూడి శివ అంటేనే తెలుస్తుంది. పెనుగొండ మాజీ ఎమ్మెల్యే కూనపరెడ్డి రాఘవేంద్రరావును చినబాబు అంటారు. -
విజయమ్మకు ‘పశ్చిమ’ నేతల సంఘీభావం
సాక్షి, గుంటూరు: సమన్యాయం చేయకుండా రాష్ట్రాన్ని విడగొట్టే అధికారాన్ని, హక్కుల్ని తన చేతుల్లోకి తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరు వేదికగా చేపట్టిన సమరదీక్షకు పశ్చిమగోదావరి జిల్లా పార్టీ నేతలు సంఘీభావం ప్రకటించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామకృష్ణంరాజు నేతృత్వంలో గుంటూరుకు గురువారం తరలివచ్చి విజయమ్మ దీక్షకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా దీక్షా వేదికపై నుంచి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని సోనియాగాంధీ కాళ్ల వద్ద పరిచిన రెండు కళ్ల సిద్ధాంతిని ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రం ఈ దుస్థితికి చేరడానికి కారకులెవరో అందరికీ తెలుసునని చెప్పారు. ఈ విపత్తును ముందుగా పసిగట్టి రాజీనామాలు చేసింది వైఎస్సార్ సీపీ ప్రజాప్రతి నిధులేనని అన్నారు. రాష్ట్రానికి గోడలు కట్టే హక్కు, అధికారం కాంగ్రెస్ పెద్దలకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను యూటీలా కాకుండా ఢిల్లీ తరహా పాలన చేసేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ నేతల్ని ప్రజలు క్షమించరన్నారు. షర్మిల పాదయాత్రకు ‘వస్తున్నాయ్ రథచక్రాలు’ అనే పాట రాయించిన పాలకొల్లుకు చెందిన వైఎస్సార్ సీపీ నేత ఆకెన వీరాస్వామి నాయుడు (అబ్బు)ను పార్టీ ముఖ్య నేత వైవీ సుబ్బారెడ్డి షర్మిలకు పరిచయం చేశారు. మాజీ ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, పాతపాటి సర్రాజు, తాడేపల్లిగూడెం, తణుకు, ఆచంట నియోజకవర్గాల సమన్వయకర్తలు తోట గోపి, చీర్ల రాధయ్య, మల్లుల లక్ష్మీనారాయణ, కండెబోయిన శ్రీను తదితరులు వైఎస్ విజయమ్మ, షర్మిలను కలిసి సంఘీభావం తెలిపారు.