breaking news
Way2Online
-
వీడియోలు, ఓటీటీ కంటెంట్.. 70 శాతం మంది ఆ వయసు వారే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ దైనందిన జీవితంలో భాగమైంది. ఖాళీ సమయాల్లో 63.36 శాతం మంది యువత మొబైల్ ఫోన్లతో గడుపుతున్నారని ఇన్ఫోటైన్మెంట్ యాప్ వే2న్యూస్ సర్వేలో తేలింది. ఇందులో 51 శాతం మంది వీడియోలు, 29 శాతం ఓటీటీ కంటెంట్ చూస్తున్నారు. మిగతావారు మ్యూజిక్ వింటున్నారు. ప్రజల ప్రాధాన్యతలు తెలుసుకునేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చేపట్టిన ఈ సర్వేలో 3,50,000 మందికిపైగా పాల్గొన్నారు. ఇందులో 88 శాతం మంది పురుషులు 12 శాతం స్త్రీలు ఉన్నారు. అభిప్రాయాలు వెల్లడించిన వారిలో 70 శాతం మంది 21–30 సంవత్సరాల లోపువారే. మొత్తంగా తెలంగాణ నుంచి 53 శాతం మంది ఉండగా మిగిలిన వారు ఏపీకి చెందినవారు. షాపింగ్ తీరుతెన్నులు ఇలా.. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో షాపింగ్ చేస్తున్నట్లు 31 శాతం మంది చెప్పారు. వస్తువులను ఆఫ్‌లైన్ స్టోర్లలో భౌతికంగా చూసి, బట్టలను ట్రయల్ చేసి, ఎలక్ట్రానిక్స్ చెక్ చేసిన తర్వాతే కొనేందుకు మొగ్గు చూపుతున్నామని 29.5 శాతం మంది తెలిపారు. కోవిడ్ 19 ఆంక్షలు, లాక్ డౌన్, ప్రజల్లోని భయాలతో విక్రయాలు తగ్గి ఇటీవలి సంవత్సరాల్లో తీవ్ర నష్టాలు చూసిన ఔట్లెట్లకు ఇప్పుడిప్పుడే వాక్–ఇన్స్ పెరుగుతుండటం ఉపశమనం కలిగించే అంశం. సొంత వాహనాల్లో.. ప్రస్తుతం దేశంలో కోవిడ్ ఆంక్షలు లేవు. దీంతో అందరూ తిరిగి ప్రయాణాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. 50.71 శాతం ప్రజలు తమ సొంత వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారు. చాలాకాలం పాటు దేశ ప్రజల ప్రయాణ ప్రాధాన్య క్రమంలో ఉన్న రైళ్ల వైపు ఇప్పుడు కేవలం 26 శాతం మంది మళ్లుతుండగా బస్సులను మరింత తక్కువగా 14 శాతం ఎంచుకుంటున్నారు. కోవిడ్ ప్రభావం గురించి ప్రజలకు అవగాహన పెరగడంతో జాగ్రత్తగా ప్రయాణాలు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు దీన్నిబట్టి అర్థమవుతోంది. కాగా, తెలంగాణలో అధికంగా మహబూబ్ నగర్ నుంచి 39,073 మంది, నల్లగొండ 32,403, ఏపీలో వైజాగ్ 21,872, శ్రీకాకుళం నుంచి 20,921 మంది సర్వేలో పాలు పంచుకున్నారు. -
రూ.1000 నోటు కావాలనుకుంటున్నారు...
సాక్షి, ముంబై : కేంద్రప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసి, ఎనిమిది నెలలు కావొస్తోంది. 1000, 500 రూపాయి నోట్లను రద్దు చేసిన అనంతరం కొత్త కొత్త నోట్లు మార్కెట్లోకి వస్తున్నాయి. అంతేకాక రద్దు చేసిన 500 రూపాయి నోటును ప్రభుత్వం తిగిరి మార్కెట్లోకి తీసుకొచ్చింది. కానీ 1000 రూపాయి నోటును మాత్రమే ప్రభుత్వం ప్రవేశపెట్టలేదు. అసలు 1000 రూపాయి నోటును ప్రజలు కావాలనుకుంటున్నారో? లేదో? తెలుసుకోవడం కోసం ఓ అధ్యయనం చేపట్టారు. ఈ అధ్యయనంలో దాదాపు 70 శాతం మంది ప్రజలు తిరిగి 1000 రూపాయి నోటును మార్కెట్లోకి రావాలని కోరుకుంటున్నారని తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన స్థానిక భాష షార్ట్ న్యూస్ యాప్ వే2ఆన్లైన్ చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 1000 రూపాయి నోట్లు కావాలంటూ ప్రజలు తన స్పందన తెలియజేశారు. 62 శాతం మంది ప్రజలు నోట్ బ్యాన్ నుంచి వచ్చిన మార్పులతో సమస్యలు ఎదుర్కొనట్టు చెప్పారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ మార్పులతో తమకెలాంటి సమస్యలేదని 38 శాతం ప్రజలు తెలిపారు. నవంబర్ 8న ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. చలామణిలో ఉన్న 86 శాతం నోట్లు ఆ రద్దుతో నిరూపయోగంగా మారాయి. ఇటీవల ఆర్బీఐ వెలువరించిన డేటాలో రద్దయిన 99 శాతం నోట్లు తిరిగి బ్యాంకింగ్ సిస్టమ్‌లోకి వచ్చినట్టు తెలిసింది. నోట్ల రద్దు తర్వాత కొత్త రూ.2000, రూ.500 నోట్లను ఎక్కువగా విడుదల చేయడంతో మార్కెట్లో చిల్లర కొరత ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించడానికి రూ.200 బ్యాంకు నోట్లను కూడా ఆర్బీఐ ప్రవేశపెట్టింది.