కాళోజీ అడుగుజాడల్లో ఎన్నీల ముచ్చట్లు
కరీంనగర్ కల్చరల్, న్యూస్‌లైన్ : వరంగల్‌లో కాళోజీ మిత్రమండలి ఆధ్వర్యంలో జరిగిన విధంగా ప్రతీ పౌర్ణమి వెన్నెల రోజు ఎన్నీల ముచ్చట్లు జరుపుకోవాలని రచయిత బండారి అంకయ్య అన్నారు. బుధవారం కరీంనగర్లో రచయిత అన్నవరం దేవేందర్ ఇంట్లో ఎన్నీల ముచ్చట్ల పేరిట సాహితీవేత్తల మాటా ముచ్చట్లు జరిగాయి. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న అంకయ్య ముచ్చటిస్తూ ప్రతీ పౌర్ణమి రోజు సాహితీవేత్త ఇంటి ఆరుబయట వెన్నెల్లో కవులు, రచయితలు సాహితీవేత్తలు ఒక చోట చేరి మాటామంతీ, మంచీచెడ్డ బాగోగులు ముచ్చటించుకోవాలన్నారు.
అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు నలిమెల భాస్కర్ మాట్లాడుతూ కవులందరూ ఒక చోట చేరి ముచ్చటించుకుంటే రచనల్లో సృజనాత్మకత పెరుగుతుందన్నారు. అన్నవరం దేవేందర్ మాట్లాడుతూ వెన్నెల హాయి ప్రకృతిని మరచిపోతున్న తరుణంలో ఆ ప్రకృతి వెన్నెల్లో లీనమై ఆ వెన్నెలను ఆస్వాదిస్తూ ముచ్చటిస్తే ఎన్నో కొత్త విషయాలు ఆవిష్కృతమవుతాయని చెప్పారు. ముచ్చట్లలో తేరావే జిల్లా అధ్యక్షుడు గాజోజు నాగభూషణం, కేఎస్ అనంతాచార్య, అన్నవరం శ్రీనివాస్, తిరుపతి, రమేశ్, అడువాల సుజాత, అన్నవరం సుజాత, మహిపాల్, పల్లం రమేశ్‌తోపాటు కవులు, రచయితలు పాల్గొన్నారు.