కర్నూలు తహశీల్దార్‌పై దాడి
కర్నూలు(రూరల్): ఇసుక ట్రాక్టర్ యజమానులు కర్నూలు తహశీల్దార్ బాలగణేశయ్యపై దాడి చేశారు. తుంగభద్ర నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకునేందుకు మంగళవారం ఉదయం తహశీల్దార్ బాలగణేశయ్య మునగాలపాడు దగ్గర మాటు వేశారు. ఓ ట్రాక్టర్‌ను పట్టుకొని తాలూకా ఆఫీస్ ప్రాంగణానికి తరలించాలని గ్రామ రెవెన్యూ సహాయకుడు బి.కృష్ణయ్యను తహశీల్దార్ ఆదేశించారు. వీఆర్ఏ ట్రాక్టర్‌ను డ్రైవ్ చేస్తుండగా మామిదాలపాడు వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కనే బోల్తా పడింది.
ఈ సంఘటనలో ట్రాక్టర్ దెబ్బతినడంతో ఆగ్రహించిన ట్రాక్టర్ల యజమానులు తహశీల్దార్ వైఖరికి నిరసనగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రెండు గంటలు పాటు ఇరువురు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుపుకున్న కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ సంఘటన స్థలానికి చేరుకొని వాహన యజమానులు, తహశీల్దార్‌కు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. పలువురు ట్రాక్టర్ల యజమానులు మాట్లాడుతూ ఉపాధి లేకపోవడంతో అధిక వడ్డీలకు వాహనాలను కొని ఇసుక తరలించుకుంటూ బతుకుతున్నామన్నారు.
వాహనాల తనిఖీ సమయంలో పట్టుబడితే డబ్బులు తీసుకొని వదిలేస్తున్నారని, డబ్బులు ఇవ్వని వారి ట్రాక్టర్లను సీజ్ చేస్తున్నారంటూ ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. మండల మెజిస్ట్రేట్ అయిన తహశీల్దార్ నోటికొచ్చినట్లు తిడుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపించారు. లక్షలాది రూపాయలు అప్పు తెచ్చి కొన్న ట్రాక్టర్‌ను డ్రైవింగ్ రాని వ్యక్తితో నడిపించి బోల్తా కొట్టించారని, వాహనం దెబ్బ తిన్నదానికి ఖచ్చితంగా పరిహారం చెల్లించాలని పట్టుపట్టారు. ఈ లోపు తాలూకా పోలీసులు వచ్చి ట్రాక్టర్ల యజమానులను అక్కడి నుంచి పంపించారు. గాయపడిన వీఆర్ఏకు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సలు నిర్వహించారు.