breaking news
vizag land scam
-
సిట్ విచారణతో ప్రయోజనం లేదు
విశాఖపట్నం: విశాఖ భూకబ్జాలపై ప్రభుత్వం జరిపిస్తున్న సిట్ విచారణతో ఎలాంటి ప్రయోజనం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి స్టాలిన్ అన్నారు. గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'సేవ్ విశాఖ' మహాధర్నాలో పాల్గొన్న ఆయన విశాఖ భూ కబ్జాలపై మండిపడ్డారు. మూడేళ్లుగా తెలుగుదేశం పార్టీ నేతలు భూములు కొల్లగొడుతున్నారని స్టాలిన్ ఆరోపించారు. ప్రైవేటు, ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించారని.. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిగితేనే వాస్తవాలు బయటకు వస్తాయని అన్నారు. -
మంత్రి పదవిని వదులుకుంటా..
►నవ నిర్మాణ దీక్ష సభలో మంత్రి అయ్యన్న కీలక వాఖ్యలు ►నిజాన్ని చెప్పడంలో దేనికైనా సిద్ధమంటున్న మంత్రి ►రాష్ట్ర అభివృద్ధిలో అధికారులు సహకరించాలని వినతి నర్సీపట్నం : తాను నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో మంత్రి పదవినైనా వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో శనివారం జరిగిన నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న మంత్రి అయ్యన్న విశాఖ నగరంలో జరిగిన భూ కుంభకోణంపై స్పందించారు. తాను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానని, దీనిపై తనకు ఎటువంటి నష్టం జరిగినా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు. భూ దోపిడిదారులను విశాఖ ప్రజలు తరిమి తరిమి తన్నేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అదేవిధంగా ఏజెన్సీలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ప్రభుత్వం నుంచి అధికంగా జీతాలు తీసుకుంటున్నా, వీరింతా విధులకు ఎగనామం పెట్టి నర్సీపట్నంలో వడ్డీ వ్యాపారం చేసుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. అన్ని విధాలుగా అభివృద్ధికి సహకరించాల్సిన అధికారులే ఈ విధంగా వ్యవహరిస్తే రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా సాధ్యమవుతుందని మంత్రి ప్రశ్నించారు. విభజన జరిగిన తరువాత రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా అభివృద్ధికి ఎటువంటి ఆటంకం లేకుండా సీఎం చంద్రబాబు నిధులు కేటాయింపులు చేస్తున్నారన్నారు. పంచాయతీ రాజ్ శాఖ నుంచి గడచిన రెండేళ్లలో 11,500 కిలోమీటర్ల సీసీ రోడ్లను నిర్మాణం చేశామని ఆయన పేర్కొన్నారు. దేశంలో మిగిలిన 28 రాష్ట్రాల్లో ఇంతటి అభివృద్ధి ఎక్కడా జరగలేదన్నారు. దీనికి కేంద్రం ప్రత్యేకంగా అభినందించినట్టు ఆయన చెప్పారు. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న 4,500 అంగన్వాడీ భవనాలను పూర్తిచేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. రాష్ట్రంలో 10లక్షల గృహాలను నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. పోలవరం ప్రాజెక్టు 2018 నాటికి పూర్తి చేసి విశాఖకు పోలవరం జలాలను తీసుకువస్తామన్నారు. పోలవరం జలాలు రావడంతో జిల్లా కొత్తగా 70 పరిశ్రమలు వస్తున్నాయన్నారు. ఈ పరిశ్రమలతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ఇలాంటి ప్రభుత్వ కార్యాక్రమాలన్నీ సజావుగా సాగాలంటే అధికారుల సహకారం తప్పనిసరిగా ఉండాలని ఆయన కోరారు. నర్సీపట్నం మెయిన్ రోడ్డును వంద అడుగుల మేర విస్తరిస్తామన్నారు. పది మంది తిట్టుకున్నా...,90 శాతం మంది ప్రయోజనార్ధం రోడ్డు విస్తరణ చేసి తీరుతానన్నారు.