breaking news
visakhapatnam MP
-
'రెండు రోజుల్లో దుబాయ్ టు వైజాగ్'
విశాఖపట్నం: దుబాయ్ నుంచి వైజాగ్‌కు త్వరలో నౌకాయాన మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఎంపీ డాక్టర్ కంభంపాటి హరిబాబు చెప్పారు. విశాఖ-పారాదీప్ వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం రెండు రోజుల్లోనే ఈ సముద్ర మార్గం ద్వారా దుబాయ్ చేరుకోవచ్చన్నారు. ఈ మార్గాన్ని అభివృద్ధి చేస్తే రానున్న రోజుల్లో విశాఖ సమీపంలోని పలు ప్రాంతాల్లో ఉన్న పోర్టులన్నీ అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు. పోర్టుల అభివృద్ధి ద్వారానే రవాణా పెరిగి ఆదాయం ఆర్జించే అవకాశాలుంటాయని చెప్పారు. దుబాయ్ నుంచి నౌకలు విశాఖ, పారాదీప్, గంగవరం, కాకినాడ వంటి పోర్టులకు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. కాగా, పారాదీప్ పోర్టుకు నడుపుతున్నట్టుగానే మార్మ గోవా పోర్టుకు కూడా ప్రత్యేక రైళ్లను నడిపితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాన ఓడరేవుల మధ్య విశాఖ-పారాదీప్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు నడపడం అభినందనీయమన్నారు. మార్మగోవా పోర్టుకు కూడా ప్రత్యేక రైళ్లను విశాఖ నుంచి నడిపితే తూర్పు, పశ్చిమ భారత్‌లలో వాణిజ్య రవాణా అభివృద్ధి అవుతుందన్నారు. రానున్న రోజుల్లో లాజిస్టిక్ హబ్‌గా విశాఖను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అందుకు అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖలో ఉండడం మరింత మంచి అవకాశమన్నారు. పారాదీప్ వెళ్లే రైలులో చేపల వేటకు వెళ్లే వారంతా అక్కడికి వెళ్లి అక్కడి నుంచి వేటకు వెళ్లేందుకు బాగుంటుందని చెప్పారు. ఇటీవల ప్రారంభమైన విశాఖ-చెన్నై, విశాఖ-గుణుపూర్, విశాఖ-సికింద్రాబాద్ రైళ్లను విశాఖ నుంచి ప్రారంభించక పోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ కార్యక్రమంలో దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, డీఆర్ఎం అనిల్‌కుమార్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎం. ఎల్వేందర్ యాదవ్ పాల్గొన్నారు. -
సీమాంధ్ర కాల్వల ద్వారా చెన్నైకి సరకు రవాణా !
విశాఖపట్నం: కాకినాడ, ఏలూరు, విజయవాడ, బకింగ్హోమ్ కాల్వల ద్వారా చెన్నై, పాండిచ్చేరిలకు సరకు రావాణ చేసేందుకు ఇన్‌ల్యాండ్ వాటర్ వేస్ అథారటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ రూపకల్పన చేస్తున్నట్లు విశాఖపట్నం ఎంపీ కె.హరిబాబు వెల్లడించారు. అందులోభాగంగా జాతీయ జలరవాణపై ఆదివారం విజయవాడలో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శనివారం విశాఖపట్నంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాల్వల ద్వారా సరకు రవాణ వ్యవస్థ కోసం రూపొందిస్తున్న పథకానికి రూ. 2400 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు హరిబాబు తెలిపారు. ఈ సమావేశానికి కోస్తా జిల్లాలకు చెందిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారని చెప్పారు. -
'పోలవరం త్వరితగతిన పూర్తి చేయండి'
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని విశాఖపట్నం లోక్‌సభ సభ్యుడు కె.హరిబాబు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం విశాఖపట్నంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... కేంద్ర జలసంఘం ఆమోదించిన డిజైన్ మేరకే నిర్మాణం జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. పోలవరం డిజైన్‌పై ఎవరికైనా అనుమానాలుంటే కేంద్ర జల సంఘం దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటికే రూ. 5200 కోట్లు ఖర్చు చేశారని ఆయన గుర్తు చేశారు. ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరారు.