VietJet Air
-
వియత్నాం విమానయాన సంస్థ కీలక ఒప్పందాలు
హైదరాబాద్: భారత్, వియత్నాం దేశాల మధ్య విమానయాన మౌలిక సదుపాయాలు, సాంకేతికత, అనుసంధానాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో వియత్నాంకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ వియెట్జెట్ (Vietjet), భారతీయ దిగ్గజ సంస్థలైన జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ (GMR), బర్డ్ గ్రూప్‌లతో వ్యూహాత్మక ఒప్పందాలను కుదుర్చుకుంది. వియత్నాం అధ్యక్షుడు తో లామ్ భారత పర్యటనలో భాగంగా నిర్వహించిన 'ఇండియా – వియత్నాం బిజినెస్ ఫోరమ్'లో ఈ ఒప్పందాలు జరిగాయి.ఈ సహకారం ద్వారా వియెట్జెట్, జీఎంఆర్ సంస్థలు విమానాశ్రయాల అభివృద్ధి, లాజిస్టిక్స్, స్మార్ట్ ఎయిర్పోర్ట్ టెక్నాలజీ రంగాల్లో కలిసి పనిచేయనున్నాయి. అలాగే, బర్డ్ గ్రూప్‌తో కుదుర్చుకున్న ఒప్పందం గ్రౌండ్ హ్యాండ్లింగ్ సేవలు, శిక్షణ, విమానయాన సాంకేతికతను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తుంది. ఈ భాగస్వామ్యాలు రెండు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య, పర్యాటక సంబంధాలను మరింత పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని వియెట్జెట్ ఫస్ట్ వైస్ ఛైర్మన్ దిన్ వియెట్ పువాంగ్ పేర్కొన్నారు.ప్రస్తుతం వియెట్జెట్ సంస్థ ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాల నుండి వియత్నాంకు వారానికి సుమారు 80 విమానాలను నడుపుతోంది. ఇప్పటివరకు 2.5 మిలియన్ల మంది ప్రయాణికులను చేరవేసిన ఈ సంస్థ, తన నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ స్థాయి భద్రతా ప్రమాణాలు కలిగిన వియెట్జెట్, ఈ కొత్త ఒప్పందాల ద్వారా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో తన ప్రాధాన్యతను మరింత పెంచుకోనుంది. -
అక్టోబర్ నుంచి హైదరాబాద్–వియత్నాం ఫ్లయిట్ సర్వీసులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది అక్టోబర్ నుంచి హైదరాబాద్‌తో పాటు భారత్‌లోని మరో రెండు నగరాల నుంచి వియత్నాంకు నేరుగా ఫ్లయిట్ సర్వీసులు ప్రారంభించనున్నట్లు విమానయాన సంస్థ వియత్జెట్ డైరెక్టర్ జయ్ ఎల్ లింగేశ్వర తెలిపారు. ఒకో ప్రాంతం నుంచి వియత్నాంలోని హనోయ్, హో చి మిన్హ్ తదితర ప్రాంతాలకు వారానికి మూడు–నాలుగు సర్వీసులు ఉంటాయని గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో చెప్పారు. ప్రస్తుతం న్యూఢిల్లీ, ముంబై నుంచి వియత్నాంలోని ప్రధాన నగరాలకు వారానికి 20 వరకూ సర్వీసులు నడుపుతున్నామని పేర్కొన్నారు. తమ కార్యకలాపాలు ప్రారంభమయ్యాక భారత్ నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య 60 శాతం మేర పెరిగిందని లింగేశ్వర చెప్పారు. ప్రయాణికులను ఆకర్షించడానికి రూ. 26 బేస్ రేటుకే టికెట్లు వంటి ఆఫర్లు రూపొందిస్తున్నామని వివరించారు. మరోవైపు సమర్ధమంతమైన వ్యయ నియంత్రణ చర్యల ద్వారా అధిక ఇంధన ధరల భారాన్ని ఎదుర్కొంటున్నామని ఆయన చెప్పారు. ఇంధన ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతుండటం పరిశ్రమకు సానుకూలాంశమని పేర్కొన్నారు. -
‘బికినీ’ ఎయిర్‌లైన్స్ బంపర్ ఆఫర్ రూ.9 కే టికెట్
సాక్షి, న్యూఢిల్లీ : వియత్నాంకు చెందిన వియత్ జెట్ విమానయాన సంస్థ భారతదేశంలోకి ఎంట్రీ ఇస్తోంది. బికినీ ఎయిర్‌లైన్స్‌గా పేరొందిన ఈ విమాన సేవలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇండియా-వియత్నాం మధ్య డిసెంబరు నుంచి ప్రత్యక్ష విమాన సేవలను ప్రారంభించనున్నట్లు వియత్ జెట్ మంగళవారం తెలిపింది. డిసెంబర్ 6న ప్రారంభమయ్యే న్యూఢిల్లీ-హోచి మిన్ సిటీ మార్గంలో వారానికి నాలుగు రిటర్న్ విమానాలను నడుపుతామని తెలిపింది. హనోయి-ఢిల్లీ మార్గం డిసెంబర్ 7 నుంచి వారానికి మూడు రిటర్న్ విమానాలను నడుపుతామని సంస్థ వెల్లడించింది. టికెట్ల ప్రారంభ ధర రూ. 9 అంతేకాదు మరో బంపర్ ఆఫర్ కూడా ఉంది. త్రి గోల్డెన్ డేస్ పేరుతో స్పెషల్ ప్రమోషన్ సేల్ నిర్వహిస్తోంది. ఆగస్టు 20-22వరకు రూ. 9 ప్రారంభ ధరతో "సూపర్-సేవింగ్ టిక్కెట్లను" అందిస్తోంది. విస్తరిస్తున్న నెట్‌వర్క్‌లో భారతదేశం తమ ప్రాధాన్యత మార్కెట్లలో ఒకటిగా ఉందని వియత్జెట్ ఉపాధ్యక్షుడు న్యూమెన్ తన్ సన్ తెలిపారు. కాగా వియత్జెట్ డిసెంబర్ 2011 లో పనిచేయడం ప్రారంభించింది. ఈ సంస్థకు చెందిన కొన్ని విమానాలలో సిబ్బంది బికినీలు ధరించి ఉంటారు. అంతేకాదు, ఏటా విమానయాన సంస్థ విడుదలచేసే క్యాలెండర్లో కూడా విమానంలో పనిచేసే అమ్మాయిలు బికినీల్లో ఉన్న ఫొటోలే దర్శనమిస్తాయి. మరోవైపు చైనాలో జరిగిన ఆసియా కప్‌పోటీలకు వియత్నాం అండర్ -23 ఫుట్‌బాల్ జట్టు ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానంలో 'బికినీలు ధరించిన మోడల్స్' ఉన్న కారణంగా సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ వియత్నాం (సిఎవి) జనవరి 2018 లో వియత్ జెట్‌కు జరిమానా కూడా విధించింది.


