breaking news
Venkatesh and Madhu
-
8 కిలోల నగల రికవరీ
సాక్షి, సిటీబ్యూరో: వారం క్రితం ఏపీ డీజీపీ కార్యాలయం ఎదురుగా ముంబై వర్తకుల నుంచి తస్కరించిన ఎనిమిది కిలోల బంగారు ఆభరణాలను నగర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులమంటూ చోరీకి పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. దోపిడీ జరిగింది ఇలా.... ముంబైలోని ఎంవీఎస్ జ్యుయలర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సేల్స్మన్లు జతిన్ ప్రతాప్సిన్ కపాడియా, దేవేంద్ర త్రివేది, హితేష్, సచిన్‌లు బంగారు ఆభరణాలు విక్రయించడానికి ఈనెల 8న హైదరాబాద్‌కు వచ్చారు. లక్డీకపూల్‌లోని ఓ లాడ్జీలో బస చేశారు. వీరు మూడు రోజుల నగరంలో ఉండి, అనంతరం బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. ఆదివారం రాత్రి లక్డీకపూల్‌లోని హెచ్‌కేబీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో జతిన్ ప్రతాప్సిన్ కపాడియా నగల బ్యాగ్ పట్టుకుని రోడ్డుపై నిలబడ్డాడు. ముగ్గురు వ్యక్తులు వచ్చి పోలీసులమని చెప్పి బ్యాగును లాక్కున్నారు. వెంటనే అక్కడే బైక్‌పై ఉన్న వ్యక్తి బ్యాగ్‌తో పారిపోయాడు. ఈ ముగ్గురు కూడా మెల్లగా జారుకున్నారు. నగల షాపు ఉద్యోగే సూత్రధారి.. ఖైరతాబాద్‌కు చెందిన దాసరి రాహుల్ (22) అబిడ్స్‌లోని సూరజ్‌భాను జ్యుయలరీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. నగల దుకాణానికి వచ్చిన సేల్స్మన్లను పసిగట్టి, అతడి స్నేహితులు జగద్గీరిగుట్టకు చెందిన స్టేట్ హ్యుమన్ రైట్స్ ఆర్గనైజేషన్ కన్వినర్ మహ్మద్ అజహర్ మోహినుద్దీన్ (27), ఘట్కేసర్కు చెందిన బీటెక్ విద్యార్థి రాథోడ్ ప్రతాప్ సింగ్ (22), కూకట్‌పల్లికి చెందిన పెయింటర్ కట్ట సాయి కిరణ్ (21), మూసాపేట్‌కు చెందిన షేక్ ఫెరోజ్ (23)లతో కలిసి పథకం రచించాడు. వీరు రెండు ద్విచక్రవాహనాలపై వర్తకుల కదలికలపై మూడు రోజులు రెక్కీ నిర్వహించారు. ఆదివారం రాత్రి అవకాశం లభించడంతో నగల బ్యాగ్‌ను తస్కరించారు. పట్టించిన సీసీ కెమెరా.. సైఫాబాద్ ఏసీపీ పి.నారాయణ, టాస్క్‌ఫోర్స్ డీసీపీ బి.లింబారెడ్డిలు ఈ కేసు ఛాలెంజ్‌గా తీసుకున్నారు. బ్యాగ్ లాక్కుని పోతున్న దృశ్యాలు ఘటనాస్థలానికి సమీపంలోని పెట్రోల్‌బంక్‌లో ఉన్న రెండు సీసీ కెమెరాల ఫుటేజ్‌ల్లో లభించాయి. వీటి ఆధారంగా నిందితులను గుర్తించారు. సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు ఎ.భాస్కర్, ఏపీ ఆనంద్‌కుమార్ తమ సిబ్బందితో రంగంలోకి దిగి పరారీలో ఉన్న నిందితులను మూడు రోజుల పాటు గాలించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు నేరాన్ని అంగీకరించారు. ఎనిమిది కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో అదనపు పోలీసు కమిషనర్ అంజనీకుమార్, జాయింట్ పోలీసు కమిషనర్ బి.మల్లారెడ్డి, సెంట్రల్‌జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి, అదనపు డీసీపీ రామ్మోహన్రావు, టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి, ఏసీపీ పి.నారాయణ పాల్గొన్నారు. -
ఓయూలో ‘మెస్’ లొల్లి
విద్యార్థుల దాడి ఎమ్మెస్సీ ఇంటర్నల్ పరీక్షల బహిష్కరణ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయం ధ్వంసం ఆత్మహత్యకు యత్నించిన పీహెచ్డీ స్కాలర్ ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ హాస్టల్ మెస్ బిల్లుల విషయమై తలెత్తిన వివాదం ఆరుగురు పరిశోధన విద్యార్థులపై దాడికి, మరో పీహెచ్డీ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి దారి తీసింది. క్యాంపస్ న్యూ పీజీ హాస్టల్ పరిశోధన విద్యార్థులకు కొన్ని నెలలుగా మెస్ బిల్లు అధికంగా వస్తోంది. ఈ విషయమై శుక్రవారం రాత్రి వెంకటేష్, మధు అనే పరిశోధన విద్యార్థుల మధ్య చర్చ జరిగింది. నాన్ బోర్డర్స్ వల్లే బిల్లులు అధికంగా వస్తున్నాయని, వారిని నియంత్రించాలని వెంకటేష్ అనగా.. నియంత్రించడం నీ వల్ల కాదని మధు అన్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. దీన్ని అవమానంగా భావించిన మధు తన స్నేహితులు 20 మందితో కలిసి న్యూ పీజీ హాస్టల్లోకి చొరపడి అందులో ఉన్న ఆరుగురు విద్యార్థులను చితక బాదారు. శనివారం ఉదయం న్యూపీజీ పరిశోధన విద్యార్థులు సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ సుదర్శన్‌ను కలసి జరిగిన విషయాన్ని వివరించారు. దాడికి పాల్పడిన మధు అతడి పర్యవేక్షణలో పీహెచ్డీ చేస్తున్నందున చర్య తీసుకోవాలని కోరారు. ప్రిన్సిపాల్ స్పందించక పోవడంతో ఆగ్రహించిన సైన్స్ పీహెచ్డీ విద్యార్థులు ప్రిన్సిపాల్ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఓయూ ఇన్స్పెక్టర్ అశోక్‌రెడ్డి సిబ్బందితో అక్కడకు చేరుకుని విద్యార్థులను చెదర గొట్టారు. ఆవేశంతో ఉన్న పరిశోధన విద్యార్థులు జరుగుతున్న ఎమ్మెస్సీ ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షలను బహిష్కరించారు. అంతటితో ఆగకుండా నినాదాలు చేస్తూ ఆర్ట్స్ కళాశాల బస్టాప్ సమీపంలో రాస్తారోకో చేపట్టారు. తమ హాస్టల్‌పై తరుచూ ఎన్ఆర్ఎస్ హాస్టల్ విద్యార్థులు దాడి చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మనస్తాపం చెందిన కెమిస్ట్రీలో పీహెచ్డీ చేస్తున్న కుమార్ యాదవ్ ఒంటి పై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకోబోగా పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జరిగిన ఘటనపై ఇరువర్గాల విద్యార్థులు ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు. దాడి చేసిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి, సొంత పూచికత్తుపై రాత్రి విడిచిపెట్టారు. గత నెలలో హాస్టల్ గదుల దహనం, విద్యార్థి సంఘాల నాయకుల పరస్పర దాడులు మరవకముందే పరిశోధన విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కాగా పోలీసులు ముందు జాగ్రత్తగా రెండు హాస్టళ్ల వద్ద బలగాలను మోహరించారు.