breaking news
vartha tupan
-
అలల కల్లోలం
జిల్లాకు తప్పిన తుపాను ముప్పు డెల్టాసహా పలుచోట్ల ఈదురు గాలులు, జల్లులు కొనసాగుతున్న వర్షసూచన మరో రెండు రోజులు అప్రమత్తం సముద్రంలో మోటార్ బోటు గల్లంతు సాక్షి ప్రతినిధి, ఏలూరు : కోరలు చాచిన తుపాను సోమవారం చెన్నై వద్ద తీరం దాటడంతో జిల్లాకు ముప్పు తప్పింది. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. భారీ వర్ష సూచన కొనసాగుతున్నప్పటికీ పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చని యంత్రాంగం అంచనా వేస్తోంది. సోమవారం ఉదయానికి వాతావరణంలో మార్పు రావడంతో రైతులు భయపడ్డారు. గాలులు వీచినప్పటికీ డెల్టా సహా పలుచోట్ల జల్లులు మాత్రమే పడటంతో పెద్దగా ఇబ్బందులు రాలేదు. చలిగాలుల ఎక్కువ కావడంతో ప్రజలు ఇంటినుంచి బయటకు అడుగుపెట్టేందుకు సాహసించలేదు. సముద్రంలో మాత్రం కల్లోల పరిస్థితులు కనిపించాయి. అలలు పెద్దఎత్తున విరుచుకుపడటంతో తీర గ్రామాల ప్రజలు, మత్స్యకారులు ఆందోళనకు గురయ్యారు. నరసాపురం మండలం చినమైనవానిలంక, పెదమైనవాని లంక గ్రామాల్లో భారీ కెరటాలు తీరాన్ని తాకాయి. చినమైనవానిలంకలో అలలు పాత తుపాను షెల్టర్‌ను తాకాయి. పెదమైనవానిలంకలో తీరం కోతకు గురైంది. అలల ధాటికి కొబ్బరి, తాడిచెట్లు కొట్టుకుపోయాయి. బోటు గల్లంతు తుపాను ప్రభావంతో నరసాపురం మండలం చినమైనవానిలంక వద్ద సముద్రంలో సోమవారం ఉదయం మోటారు బోటు చిక్కుకుంది. కాకినాడ కోస్టుగార్డుకు సమాచారం అందడంతో వారు బోటు ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రాత్రి వరకూ ఆచూకీ తెలియరాలేదు. పొలాల్లోనే రైతులు రైతులు గత మూడురరోజులుగా పొలాల్లోనే ఉండి పంటను ఒబ్బిడిచేసుకునే పనిలో పడ్డారు. ధాన్యాన్ని ఇళ్లకు తరలించే అవకాశం లేకపోవడంతో సోమవారం పొలాల్లోనే బరకాలు కప్పి కాపాడుకునే ప్రయత్నాలు చేశారు. తుపాను ప్రభావం ఎక్కువగా లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. పెరవలి మండలంలోని గోదావరి తీరగ్రామాల్లో ఈదురు గాలుల ప్రభావం ఎక్కువగా ఉండటంతో అరటి తోటలు విరిగిపోయాయి. తీపర్రు, కాకరపర్రు, ముక్కామల, ఖండవల్లి, అన్నవరప్పాడు, బొక్కావారిపాలెం, లంకమాలపల్లి, ముత్యాలవారిపాలెం గ్రామాల్లో అరటి తోటలకు నష్టం వాటిల్లింది. జిల్లాలో చాలాచోట్ల ఇప్పటికే మాసూళ్లు పూర్తయ్యాయి. కాగా కొంత మేర ధాన్యం అమ్మకాలు సాగించారు. అక్కడక్కడా చేలలో వరికుప్పలు ఉన్నాయి. దీంతో పాటు, పశుగ్రాసానికి సంబందించి వరిగడ్డిని రైతులు ఒబ్బిడి చేసుకొనే పనిలో పడ్డారు. గ్రామాలలో ధాన్యం బస్తాలు పాడవుతాయని వాటిపై బరకాలు కప్పి ఉంచారు. మెట్ట ప్రాంతమైన గోపాలపురం నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 16 వేల హెక్టార్లలో రైతులు వరి వేశారు. కోతలు కోయడంతో పంట పనలపై ఉంది. కొన్నిచోట్ల నూర్పిళ్లు చేస్తున్నారు. మరికొందరు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో వరికోత యంత్రాలను సైతం పొలాల్లోకి దింపలేదు. తుపాను ప్రభావం లేనప్పటికీ మరో రెండురోజుల పాటు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. -
తరుముకొస్తున్న వార్దా
పెరిగిన గాలుల ఉధృతి పొంచి ఉన్న భారీవర్షాలు రైతుల ఆందోళన అధికారులు అప్రమత్తం ఏలూరు (మెట్రో) : తుపాను ప్రభావం వల్ల జిల్లాలో భారీవర్షాలు కురుస్తాయనే హెచ్చరికతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఖరీఫ్ మాసూళ్ల పనుల్లో నిమగ్నమైన రైతులు ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఆదివారం రాత్రికి మచిలీపట్నానికి 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తుపాను సోమవారం మధ్యాహ్నానికి నెల్లూరు, సూల్లురుపేటల మధ్య తీరం దాటనుందని, దీనిప్రభావం వల్ల జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని, గాలుల ఉధృతి ఎక్కువగా ఉంటుందని, గంటకు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే గాలుల తాకిడి పెరిగింది. ప్రస్తుతం జిల్లాలో రెండులక్షల ఎకరాల్లోని వరి పంట మాసూళ్ల దశలో ఉంది. లక్ష ఎకరాల్లో ఆక్వా చెరువులు ఉన్నాయి. భారీవర్షాలు కురిస్తే ఆక్వా, వరి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. గాలులకు కోతకొచ్చిన చేలు వాలిపోయే ముప్పు పొంచి ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గత రెండురోజులుగా త్వరగా మాసూళ్లు పూర్తిచేసుకోవాలని, పంటను ఇంటికి చేర్చుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. లోతట్లు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్ భాస్కర్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అన్ని శాఖల అధికారులకు ఇప్పటికే సెలవులు రద్దు చేశారు. వరుస సెలవుల వల్ల అధికారులెవరూ దూరప్రాంతాలకు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. వ్యవసాయశాఖాధికారులు ఆదివారం కూడా జిల్లాలోని రైతులను అప్రమత్తం చేసే పనిలో నిమగ్నమయ్యారు. 19సెంటీమీటర్ల వర్షానికి అవకాశం తుపాను ప్రభావం వల్ల 19 సెంటీమీటర్ల వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. శీతాకాలం కావడంతో ఈదురుగాలుల వల్ల చలితీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఇతర జిల్లాలకు మన పోలీసులు ఇప్పటికే తుపాను తీవ్రత ఎక్కువగా ఉండే జిల్లాలను వాతావరణ శాఖ గుర్తించింది. దీంతో ఆ జిల్లాలపై ప్రభుత్వం దృష్టిసారించింది. తీవ్రత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు మన జిల్లా పోలీసులను పంపేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అవసరాన్ని బట్టి సహాయక చర్యలకు ఇతర శాఖల అధికారులనూ పంపనున్నట్టు సమాచారం.