breaking news
vardhanna pet
-
వర్ధన్నపేటను సిద్ధిపేటలా చేస్తా.. తన్నీరు హరీష్‌రావు
సాక్షి, వరంగల్ రూరల్/వర్ధన్నపేట: ఎన్నికల్లో వర్ధన్నపేట టీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్‌కు రాష్ట్రంలోనే నంబర్ వన్ మెజార్టీ ఇస్తే దత్తత తీసుకుని, వర్ధన్నపేటను సిద్ధిపేట మాదిరిగా అభివృద్ధి చేసి చూపిస్తా అని రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. ఈ సభకు వచ్చిన ప్రజలను చూస్తే గత నా మెజార్టీ దాటిపోయేలా ఉందన్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలోనే తనకు నంబర్ వన్ మెజార్టీ వస్తే.. రెండో మెజార్టీ రమేశ్‌కు వచ్చిందన్నారు. వర్ధన్నపేటలోని ఇల్లందలో ప్రజాఅశ్వీరాద సభ టీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్ అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో రమేశ్ ఏం అభివృద్ధి చేయకముందే 87 వేల మెజార్టీని ఇచ్చారని, రూ.కోట్లాది నిధులను తీసుకొచ్చి వర్ధన్నపేటను అభివృద్ధి చేసిన అరూరి రమేశ్‌కు ఈ సారి లక్ష ఓట్ల మెజార్టీ దాటుందని నమ్మకం ఉందన్నారు. వర్ధన్నపేటకు కాళేశ్వరం నీళ్లు తెచ్చి కాళ్లు కడిగి రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. రెండు పంటలకు నీరందేలా కృషి చేస్తాన్నారు. ఆకేరు వాగు వెనక ప్రాంతానికి సైతం సాగు నీటిని అందిస్తాన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గర్భిణులు కాన్పుకు పోతే రూ.40 వేల నుంచి రూ.50 వేలు ఖర్చయ్యేవని, అదే కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు అందించి ఉచితంగా కాన్పు చేసి కేసీఆర్ కిట్‌తోపాటు రూ.12 వేలు ఇచ్చి వ్యాన్‌లో ఇంటికి సురక్షితంగా పంపిస్తున్నారన్నారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం తెలంగాణను తెచ్చుకున్నామని, పరాయి పాలనలో అబివృద్ధి కుంటుపడుతుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలు మర్చిపోలేరన్నారు. లక్ష మెజార్టీతో గెలిపించాలి.. కడియం శ్రీహరి ఈ ఎన్నికల్లో నియోజకవర్గ అభివృద్ధి కోసం అరూరి రమేష్‌కు లక్ష ఓట్ల మెజార్టీ అందించాలని ఆపద్ధర్మ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. రమేష్ ఎవరో తెలియనినాడు, ఆయన పనితనం తెలియనినాడు 87 వేల ఓట్లతో గెలిపించారని నాలుగున్నర ఏళ్లలో ఆయన చేసిన సేవలు ప్రజలు మరువరని అందుకే రాష్ట్రంలో గత ఎన్నికల్లో నంబర్ టూ మెజార్టీ సాధించిన అరూరికి హరీష్‌కు పోటీగా నంబర్ వన్ మెజార్టీ ఇవ్వాలన్నారు. సస్యశ్యామలం చేయడమే లక్ష్యం : అరూరి రమేష్ నియోజకవర్గంలో తాను నాలుగున్నర ఏళ్లు చేసిన పాలనలో ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం జరిగిందని రమేష్ అన్నారు. తనను అత్యధిక మెజారిటీతో గెలిపించి వర్ధన్నపేట నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నేతలు రాజయ్య యాదవ్, ఎల్లావుల లలితా యాదవ్, ఎంపీపీ మార్నేని రవీందర్రావు, జెడ్పీటీసీ పాలకుర్తి సారంగపాణి, కార్పొరేటర్ చింతల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. v -
లారీని ఢీకొన్న బొలేరో, ముగ్గురు మృతి
వరంగల్ : ఖమ్మం జాతీయ రహదారి మరోసారి నెత్తురోడింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్ర శివారు వద్ద జాతీయ రహదారిపై నిలిచి ఉన్న లారీని .. వరంగల్ వెళ్తున్న బొలేరో వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఒకరు మెట్రో రైలు కాంట్రాక్టర్ సోమేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు. -
'కేసీఆర్‌కు ఇప్పుడు విశ్రాంతే శరణ్యం'
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చామని, అందుకే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు బ్రహ్మరథం పట్టారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమని పొన్నాల శనివారమిక్కడ ధీమా వ్యక్తం చేశారు. అయితే గెలుపు టీఆర్‌ఎస్‌దేనంటూ కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. గెలిపిస్తే సేవ... లేకుంటే విశ్రాంతన్న కేసీఆర్‌కు ఇప్పుడిక విశ్రాంతే శరణ్యమని పొన్నాల ఎద్దేవా చేశారు. కొన్ని సెగ్మెంట్లలో కాంగ్రెస్ నేతలు కొందరు పార్టీకి సహకరించలేదన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూలంకషంగా పరిశీలిస్తామన్నారు. ఒత్తిడిని తట్టుకోలేక మాజీ ఎమ్మెల్యే, వర్థన్నపేట కాంగ్రెస్ అభ్యర్థి కొండేటి శ్రీధర్ అస్వస్థతకు గురయ్యారన్నారు. ఆయన ఆత్మహత్యాయత్నం చేయలేదని పొన్నాల తెలిపారు. -
చెట్టును ఢీకొన్న ఆటో: 10 మందికి తీవ్రగాయాలు
పొదలకూరు మండలం నావూరు క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం ఉదయం ఆటో చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలోని 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అతివేగంగా ఆటో నడపడంతోనే ఆ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. అయితే వరంగల్ జిల్లాలోని వర్థన్నపేట మండలం పున్నేల్లో జిల్లా నారాయణ అనే వ్యక్తిపై అతని సమీప బంధువులు శుక్రవారం గొడ్డలితో దాడి చేశారు. దాంతో నారాయణ పరిస్థితి విషమంగా మారింది. కుటుంబసభ్యులు వెంటనే స్పందించి వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఆ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలతోనే బంధువులు నారాయణపై దాడి చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.