breaking news
vanam - manam
-
బౌద్ధక్షేత్రంలో మొక్కలు నాటిన విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం : విశాఖ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో శనివారం తొట్లకొండ బౌద్ధక్షేత్రంలో 'వనం-మనం' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి బౌద్ధ కేంద్రాన్ని శుభ్రపరచి, మొక్కలు నాటారు. అంతకుముందు విశాఖ బీచ్ రోడ్లో ఉన్న మాజీ సీఎం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలు వేసి నివాలులర్పించారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను నెరవేర్చడమే మా లక్ష్యమని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మోపిదేవి వెంకటరమణ, అవంతి శ్రీనివాస్, విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, విప్ బూడిద ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాధ్, కరణం ధర్మశ్రీ, భాగ్యలక్మి, గొల్ల బాబురావు, ఉమాశంకర్ గణేశ్, విఎంఆర్డిఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కన్నీరే.. గోదారై
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రెండో శనివారం.. పాఠశాలలకు సెలవు రోజు.. విద్యార్థులు ఇంటి వద్ద ఆడుతూ పాడుతూ ఆనందంగా గడపాల్సిన సమయం. కానీ, ‘వనం–మనం’ కార్యక్రమంలో తప్పనిస రిగా పాల్గొనాలంటూ సెలవును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం ఆ చిన్నారుల పాలిట మృత్యుపాశంగా మారింది. ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని నాటు పడవలో ఇంటికి తిరిగి వస్తూ గోదావరి నదీ పాయలో ప్రమాదానికి గురయ్యారు. ఆరుగురు విద్యార్థినులు, ఒక మహిళ నీటిలో గల్లంతయ్యారు. అక్కడికి సమీపంలోనే సముద్రం ఉండడంతో వారి ఆచూకీపై ఆందోళన నెలకొంది. తూర్పు గోదావరి జిల్లాలో శనివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలో కేవలం 8 నెలల వ్యవధిలో 4 ఘోర పడవ ప్రమాదాలు జరగడం గమనార్హం. అమాయకులు బలైపోతున్నా ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడం లేదు. పదో తరగతి లోపు విద్యార్థినులే.. గోదావరి నదిలో మే 15వ తేదీన లాంచీ బోల్తా పడి 19 మంది గిరిజనులు జలసమాధి అయిన ఘటన మరువక ముందే.. తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద శనివారం గోదావరి పాయ అయిన వృద్ధ గౌతమిలో నాటు పడవ ప్రమాదానికి గురైంది. పశువుల్లంక నుంచి సలాదివారిపాలెం లంకకు దాదాపు 30 మందితో బయల్దేరిన నాటు పడవ మొండిల్లంక రేవు వద్ద నిర్మాణంలో ఉన్న వంతెన పిల్లర్‌ను ఢీకొట్టి ఓ పక్కకు ఒరిగిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు గల్లంతయ్యారు. వీరిలో ఆరుగురు విద్యార్థినులే. వారంతా పదో తరగతి లోపు చదువుతున్న వారే. మిగిలిన 23 మందిని స్థానికులు కాపాడారు. ఆచూకీ దొరికేనా? ప్రమాదం గురించి తెలిసిన వెంటనే స్థానిక అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, బాధితుల ఆచూకీ ఇంకా తెలియరాలేదు. రాత్రి కావడంతో గాలింపు చర్యలను నిలిపివేశారు. సముద్రానికి దగ్గరగా ఉండే వృద్ధ గౌతమి పాయ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి వస్తున్న గోదావరి వరద నీరు ఈ పాయ గుండానే సముద్రంలో కలుస్తోంది. దీంతో గల్లంతైన వారి ఆచూకీ అంత సులువుగా దొరికే పరిస్థితి కనిపించడం లేదు. ప్రమాదం జరిగిందిలా.. పశువుల్లంక నుంచి సలాదివారిపాలెం లంక, శేరి లంక, కొత్త లంక గ్రామాలకు వెళ్లేందుకు మొండిల్లంక రేవు వద్ద 30 మంది నాటు పడవ ఎక్కారు. పడవ డ్రైవర్ సాయంత్రం 4.05 గంటలకు ఇంజిన్ స్టార్ట్ చేశారు. కాసేపు మొరాయించిన ఇంజిన్ కొద్దిసేపటికి పనిచేయడం ప్రారంభించింది. ఒడ్డు నుంచి 150 మీటర్ల దూరం వెళ్లాక మళ్లీ ఆగిపోయింది. సరిగ్గా అదే ప్రదేశంలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో పడవ అదుపు తప్పింది. పక్కనే నిర్మాణంలో ఉన్న వంతెన మూడో పిల్లర్‌ను ఢీకొని ఒక్కసారిగా ఒరిగిపోయింది. తీవ్ర ఆందోళనకు గురైన ప్రయాణికులు ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయత్నించారు. వెంటనే పిల్లర్ బేస్‌పైకి ఏడుగురు ఎక్కారు. మిగిలినవారు కూడా పిల్లర్ బేస్ పైకి ఎక్కేందుకు ప్రయత్నించగా పడవ మరింత కిందికి ఒరిగిపోయింది. దీంతో 17 మంది నదిలో పడిపోయారు. మరో ఆరుగురు పడవలోనే ఉండిపోయారు. సరిగ్గా అదే సమయానికి వంతెన నిర్మాణ పనుల సూపర్వైజర్ మధుబాబు నదిలోని ఓ పంటుపై ఉన్నారు. ప్రమాదాన్ని ప్రత్యక్షంగా గమనించిన ఆయన తక్షణమే ఆవలి ఒడ్డుకు వెళ్లి తమ కంపెనీకి చెందిన ఇంజిన్ బోటులో పడవ మునిగిన చోటుకు వచ్చి కొందరిని రక్షించారు. అప్పటికే వీపున స్కూల్ బ్యాగులతో ఉన్న విద్యార్థినులు నీటిలో మునిగిపోతూ చేతులు ఊపుతున్నారు. మధుబాబు వారి చేతులు పట్టుకుని పైకి లాగారు. అలా దాదాపు పది మందిని రక్షించారు. నదిలో బోటు ఒరిగిపోవడాన్ని గమనించిన శేరిలంక వాసి కొండేపూడి సంజీవ్ మరో పడవలో వెళ్లి ఆరుగురిని రక్షించారు. ప్రమాదానికి గురైన పడవను నడుపుతున్న డ్రైవర్ సలాది వెంకటేశ్వరరావు సురక్షితంగా తప్పించుకున్నాడు. నీటిలో ఒరిగిన పడవ నదీ ప్రవాహ వేగానికి కిలోమీటర్ మేర కొట్టుకుపోయి శేరిలంక వైపు ఆగింది. వాస్తవానికి ఈ పడవ కేవలం 15 మంది ప్రయాణించడానికే సరిపోతుంది. కానీ, రెట్టింపు సంఖ్యలో ప్రయాణికులతోపాటు మరో ఎనిమిది మోటార్ సైకిళ్లను ఎక్కించారు. బాధితులకు తక్షణమే సహాయం అందించాలి పడవ ప్రమాదంపై ప్రభుత్వానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విజ్ఞప్తి సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి జిల్లాలో పడవ ప్రమాదంపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణమే సహాయం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఘటనా స్థలానికి వెళ్లి బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సిందిగా జిల్లా పార్టీ నాయకులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు వైఎస్సార్ సీపీ నేతల పరామర్శ మండపేట: అనపర్తి నియోజకవర్గం గొల్లలమామిడాడలో పాదయాత్రలో ఉన్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు పడవ ప్రమాదం ఘటన సమాచారం అందడంతో తక్షణమే అక్కడకు వెళ్లాలని పార్టీ నాయకులను ఆదేశించారు. ఎమ్మెల్సీ, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గం జిల్లా అధ్యక్షుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ముమ్మిడివరం, రామచంద్రపురం నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు పొన్నాడ సతీష్, చెల్లుబోయిన శ్రీనివాస్, నాయకులు కర్రి పాపారాయుడులు ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. సముద్రంలో కూడా గాలించాలి పడవ ప్రమాదం నదీ ముఖ ద్వారం వద్ద జరిగిన నేపథ్యంలో గల్లంతైన వారికోసం గోదావరి నదిలోనే కాకుండా సముద్రంలో కూడా కోస్ట్‌గార్డ్, హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టాలని పిల్లి సుభాష్‌చంద్రబోస్ సూచించారు. ఘటనా స్థలం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవుల నిర్వహణపై పర్యవేక్షణ కొరవడిందని, నిబంధనలు మేరకు వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పవన్, రఘువీరా దిగ్భ్రాంతి సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి జిల్లా పశువుల్లంక దగ్గర గోదావరి నదిలో చోటు చేసుకున్న పడవ ప్రమాద ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పడవ ప్రమాదాలు జరగకుండా నియంత్రణ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. పుస్తకాల బ్యాగే ప్రాణాలు కాపాడింది.. పశువుల్లంక జెడ్పీ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాను. స్కూల్ ముగించుకుని అందరితోపాటు ఇంటికి చేరుకునేందుకు పడవ ఎక్కాను. కొంత దూరం వెళ్లేసరికి ప్రమాదం జరిగింది. పడవ ఒరిగిపోవడంతో గోదావరిలో పడిపోయాను. నా భుజానికి తగిలించుకున్న స్కూల్ బ్యాగ్ నన్ను నీటిలో తేలేలా చేసింది. దీంతో బ్యాగ్‌ను వదలకుండా పట్టుకుని ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేయగా ఇంతలో నన్ను ఎవరో రక్షించారు. – జ్ఞానకుమార్ గల్లంతైనవారు వీరే.. పడవ ప్రమాదంలో గల్లంతైన వారిలో ఐ.పోలవరం మండలం సలాదివారిపాలేనికి చెందిన సుంకర శ్రీజ (పదో తరగతి), కె.గంగవరం మండలం శేరిలంకకు చెందిన కొండేపూడి రమ్య (పదో తరగతి), పోలిశెట్టి వీరమనీషా (పదో తరగతి), తిరుకోటి ప్రియ (ఎనిమిదో తరగతి), పోలిశెట్టి అనూష (తొమ్మిదో తరగతి), పోలిశెట్టి సుచిత్ర (ఆరో తరగతి)తోపాటు వివాహిత గెల్లా నాగమణి (30) ఉన్నారు. ప్రమాద సమయంలో బోటులో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది గల్లంతయ్యారన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గల్లంతైన వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే తప్ప వాస్తవ సంఖ్య ఎంత అన్నది చెప్పలేమని అధికారులు అంటున్నారు. నా బిడ్డ ఏమైపోయిందో.. కళ్ల ముందు మహలక్ష్మిలా తిరిగే మనవరాలు ఒక్కసారిగా కనిపించక ఓ అమ్మమ్మ ఆవేదన. స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఇంటి పనుల్లో చేదోడు వాదోడుగా ఉండే కుమార్తె ఏమైందో తెలియక ఓ తల్లి బాధ. చదువే ప్రాణంగా భావించే కుమార్తెలు కానరాక ఓ తండ్రి కలవరం. ఇవీ ప్రమాదం ప్రాంతంలో కనిపించిన విషాద దృశ్యాలు. పడవ ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకీ కానరాక ఆవేదనతో బంధువుల చేస్తున్న ఆక్రందనలు అక్కడి వారందరినీ కదిలించివేస్తున్నాయి. ఉన్నత చదువులు చదివి తమను కష్టాల నుంచి గట్టెక్కిస్తారని భావించిన తల్లిదండ్రులు.. తమ పిల్లలు ఇప్పుడు కానరావడంలేదని, తాము ఏం చేయాలని ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. చదువుల కోసం విద్యార్థులైనా, సరుకుల కోసం పెద్దలైనా, ఉపాధి పనులు కోసం కూలీలైనా నిత్యం గోదారి దాటి వెళ్లాల్సిందేనని, నాటు పడవల్లో గోదావరి దాటడం దినదిన గండమేనని వారు చెబుతున్నారు. నా మనవరాలు ఎలా ఉందయ్యా.. నా మనవరాలు ఎలా ఉందో చెప్పండయ్యా అంటూ బోటు ప్రమాదంలో గల్లంతైన సుంకర శ్రీజ అమ్మమ్మ సిగిరెడ్డి సత్యవతి విలపించిన తీరు అక్కడి వారందరినీ కంట తడి పెట్టించింది. ప్రమాదం విషయం తెలుసుకున్న సత్యవతితో పాటు ఇతర కుటుంబ సభ్యులు గోదావరి ఒడ్డుకు చేరుకుని విలపించారు. శ్రీజ ఎక్కడుందో తెలపండంటూ కనిపించిన వారిని సత్యవతి అడగడం కలిచివేసింది. – సిగిరెడ్డి సత్యవతి, గల్లంతైన సుంకర శ్రీజ అమ్మమ్మ ఆరుగురిని రక్షించాను.. స్కూల్‌కు వెళ్లిన నా కుమారుడు వెంకటరుషి ఇంటికి తీసుకువెళ్లేందుకు గోదావరి ఒడ్డుకు వెళ్లాను. ఇంతలో ఒక పడవ ఆ ఒడ్డు నుంచి వస్తూ కనిపించింది. ఇందులో నా కొడుకు ఉన్నాడని ఎదురు చూస్తుండగా వచ్చే పడవ ఒక్కసారిగా ప్రమాదానికి గురయింది. ఏం జరిగిందో తెలిసేలోపే కొంత మంది గోదావరిలో పడిపోవడం కనిపించింది. కొందరు పిల్లర్ ఎక్కడం గమనించిన నేను వెంటనే గోదావరిలోకి దూకి ప్రమాద స్థలానికి చేరుకుని ఆరుగురిని రక్షించాను. – కొండేపూడి సంజీవ్, ప్రత్యక్ష సాక్షి, శేరిలంక. యథావిధిగా స్కూల్‌కు సెలవిచ్చి ఉంటే.. ప్రతీ రెండో శనివారం స్కూల్‌కు సెలవిచ్చేవారు. ఏదో వన మహోత్సవమట.. మొక్కలు నాటాలనీ ఈ శనివారం పిల్లల్ని స్కూల్‌కు రమ్మన్నారు. సెలవు ఇచ్చి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. నా ఇద్దరు పిల్లలు గల్లంతయ్యేవారు కాదు. నా ముగ్గురు కుమార్తెల్లో అనూష, సుచిత్రలకు చదువంటే ప్రాణం. ఇద్దరు పిల్లలు ఇంటికి రాకపోవడంతో ఏం చేయాలో పాలుపోవడంలేదు. – గల్లంతైన అనూష, సుచిత్ర తండ్రి పోలిశెట్టి మాచర్రావు పరిమితికి మించి జనాన్ని ఎక్కించుకున్నారు.. పడవలో పరిమితికి మించి జనాన్ని ఎక్కించుకున్నందువల్లే ప్రమాదం జరిగింది. ఇదే పరిస్థితి రోజూ ఉంటుంది. మనుషులనే కాకుండా వాహనాలను, గేదెలను పడవలో ఎక్కిస్తారు. నది ఉధృతంగా ప్రవహిస్తున్నప్పుడు కూడా కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. ప్రమాదంలో నా మరదలు గెల్లా నాగమణి, అన్నయ్య కూతురు రమ్య గల్లంతయ్యారు. రమ్య పాఠశాలకు, మరదలు నాగమణి కిరాణా సరుకులు కోసం వెళ్లారు. – బాధితుడు కొండేపూడి చంటిబాబు మృత్యుంజయులు.. పశువుల్లంక మొండి రేవులో జరిగిన పడవ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యుంజయులుగా బయటపడ్డారు. కె.గంగవరం మండలం శేరిల్లంకకు చెందిన గుర్రాల ఫణికుమార్ భార్య సుగుణ, రెండేళ్ల కుమార్తె సిరితో కలిసి స్వగ్రామానికి వెళ్లేందుకు పడవ ఎక్కారు. పడవ ఒక్కసారిగా ప్రమాదానికి గురికావడంతో సుగుణ తాను వేసుకున్న జర్కిన్‌లో రెండేళ్ల పిల్లను పెట్టుకుని ప్రాణాపాయ స్థితిలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంది. అయితే సిరి తీవ్ర అస్వస్థతకు గురయింది. చిన్నారిని ముమ్మిడివరం ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స అనంతరం కోలుకుంటోంది. -
పర్యావరణ పరిరక్షణ బాధ్యత
–ఎస్పీ విశాల్‌గున్నీ నెల్లూరు (క్రైమ్) : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఎస్పీ విశాల్‌గున్నీ వెల్లడించారు. వనం–మనం కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక పోలీసు పరేడ్ గ్రౌండ్లో మొక్కలు నాటారు. ఎస్పీ విశాల్‌గున్నీ, ఏఎస్పీలు బి. శరత్‌బాబు, కె. సూరిబాబు వివిధ రకాల మొక్కలను నాటారు. ఎస్పీ మాట్లాడుతూ వర్షపు నీరు సంరక్షణ భూగర్భ జలాల పెంపునకు జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లలో ఇంకుడుగుంతల కార్యక్రమం నిర్వహించామన్నారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం కోసం పోలీసు శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి ఇప్పటికే పలు పోలీసుస్టేషన్లలో మొక్కలు నాటడం, స్టేషన్లను శుభ్రపరచి ఆహ్లాదకర వాతావరణం కల్పించామన్నారు. ప్రతి పోలీసుస్టేషను, క్వార్టర్స్‌ను హరిత వనం చేస్తామన్నారు. డీఎస్పీలు ఎన్.కోటారెడ్డి, చెంచురెడ్డి, ఆర్ఐలు శ్రీనివాసరావు, కేజేఎం చిరంజీవి, ఇన్స్పెక్టర్లు సి. మాణిక్యరావు, జి. రామారావు, ఆర్ఎస్ఐలు అంకమరావు, రమేష్, ఎస్బీ, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
హరిత అనంతే లక్ష్యం
→ నిరంతర ఉద్యమంలా మొక్కలపెంపకం → వైద్యఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ రాయదుర్గం : ఎడారి ఛాయలు కనిపిస్తున్న జిల్లాను హరిత ‘అనంతపురం’లా మారుస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. మొక్కల పెంపకం నిరంతర ఉద్యమంలా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయదుర్గం నియోజకవర్గంలోని రాయదుర్గం మండలం కెంచానపల్లి వద్ద గల మురిడప్ప కొండలో ‘కొండ పండుగ’, కణేకల్లు మండలం రచ్చుమర్రి గ్రామంలో ‘వనం– మనం’ కింద మొక్కల పెంపకం చేపట్టారు. మంత్రి కామినేనితోపాటు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కామినేని మాట్లాడుతూ ఎడారి నివారణకు పరిష్కారమార్గం మొక్కలు నాటడమేనని భావించి, నాందిపలికామన్నారు. మిషన్ హరితాంధ్రప్రదేశ్ లో భాగంగా కోటి మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ‘వనం మనం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 10,500 లక్షల మొక్కలు నాటి ‘హరిత అనంతపురం’గా మార్చడానికి కృషిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. పరిటాల సునీత మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షిస్తే భవిష్యత్తులో అవి మనల్ని రక్షిస్తాయని తెలిపారు. కెంచానపల్లి వద్ద మురిడప్పకొండలో నాటిన మొక్కల్లో రెండింటిని తన భర్త పరిటాల రవీంద్ర పేరుతో దత్తత తీసుకుని సంరక్షిస్తానని సభాముఖంగా ప్రకటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ మెట్టుగోవిందరెడ్డి, జిల్లాపరిషత్ చైర్మన్ చమన్ సాబ్, కలెక్టర్ కోనశశిధర్ తదితరులు పాల్గొన్నారు. గ్రానైట్ కొండలో మొక్కల పెంపకమా? రాయదుర్గం రూరల్ : కొండ పండుగ పేరిట మొక్కలు నాటిన మురిడిప్ప కొండలో 30 ఏళ్లుగా గ్రానైట్ తవ్వకాలు చేస్తున్నారు. అటువంటి ప్రదేశంలో మొక్కలు నాటడం వల్ల ఎటువంటి ఉపయోగమూ లేదని కొందరు అధికారులు, స్థానికులు విమర్శిస్తున్నారు. గ్రానైట్ కోసం తవ్వకాలు జరిపినపుడు మొక్కలు ధ్వంసమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. బోడి కొండలు అనేకం ఉన్నప్పటికీ మురిడప్ప కొండను ఎంపిక చేయడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని అంటున్నారు.