టీడీపీకి ఓటేయలేదని గ్రామ బహిష్కరణ
లింగసముద్రం: టీడీపీకి ఓటేయలేదని ఒక్కో కుటుంబానికి రూ.లక్ష జరిమానా, ఆ సొమ్ము చెల్లించకుంటే పదేళ్లపాటు గ్రామ బహిష్కరణ విధిస్తూ గ్రామపెద్దలు తీర్పు చెప్పారు. ప్రకాశం జిల్లా లింగసముద్రం పంచాయతీలోని వడ్డెపాలెంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని గ్రామంలోని 190 ఓట్లను రూ.2.5 లక్షలకు గ్రామపెద్దల వద్ద టీడీపీ బేరంపెట్టింది.
అయితే శనివారం రాత్రి గ్రామంలోని రెండు కుటుంబాలపై గ్రామ పెద్దలు కన్నెర్ర చేశారు. ‘మా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీకి ఓట్లు వేస్తారా...?’ అంటూ పంచాయతీ పెట్టారు. బాధిత కుటుంబాల సమాధానం ఏమాత్రం పట్టించుకోకుండానే పదేళ్లపాటు గ్రామ బహిష్కరణ చేస్తూ తీర్పిచ్చారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున చెల్లిస్తే బహిష్కరణ ఉండదని పేర్కొన్నారు.
పదేళ్లు బహిష్కరించారు...
గ్రామంలో ఓట్లను ఇద్దరు పెద్దల సమక్షంలో గుత్తగా ప్రతి ఎన్నికలకు టీడీపీ నాయకులు కొనుగోలు చేస్తున్నారు. నేను టీడీపీకి ఓటేయలేదనే అనుమానంతో శనివారం రాత్రి సమావేశం ఏర్పాటు చేసి పదేళ్లపాటు గ్రామం నుంచి బహిష్కరించారు. లేదా రూ.లక్ష రూపాయలు జరిమానా కట్టాలని నిబంధన పెట్టారు. నేను ఎప్పుడూ ఓటుకు డబ్బు తీసుకోలేదు. గ్రామ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని చెప్పినా వినకుండా నాపై నిందవేసి గ్రామం నుంచి పం పాలని గ్రామ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. లక్ష రూపాయల జరిమానా కట్టలేను.. ఊరు విడిచి వెళ్లలేను.
- తన్నీరు వెంకయ్య, మాజీ ఉపసర్పంచ్, వడ్డెపాలెం