United Democratic Front
-
కేరళ సీఎం రేసులో లేను
న్యూఢిల్లీ: కేరళలో అసెంబ్లీ ఎన్నికల సమరం మొదలయ్యింది. పార్టీలు గెలుపు వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్), సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) మధ్య ప్రధాన పోటీ సాగుతోంది. ఈ ఎన్నికల్లో యూడీఎఫ్ విజయం సాధిస్తే ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ పేరు తెరపైకి వచ్చింది. అయితే, ముఖ్యమంత్రి రేసులో తాను లేనని ఆయన తేలి్చచెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, అలాంటప్పుడు సీఎంగా ఎన్నికయ్యే అవకాశమే లేదని స్పష్టంచేశారు. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో ఒకరిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం సంప్రదాయంగా వస్తోందని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన నాయకుడే సీఎంగా బాధ్యతలు చేపడితే బాగుంటుందని సూచించారు. శశి థరూర్ తాజాగా పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేయడం లేదు కాబట్టి ఏదో ఒక నియోజకవర్గంపైనే దృష్టి పెట్టాల్సిన అవసరం లేకుండాపోయిందన్నారు. కేరళ ఎన్నికల్లో తన పాత్ర మిక్స్డ్ బ్యాగ్ లాంటిదని చెప్పారు. రాష్ట్రమంతటా తిరుగుతూ తమ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తానని సంకేతాలిచ్చారు. యూడీఎఫ్ విజయమే లక్ష్యంగా పని చేస్తానని ఉద్ఘాటించారు. ఎల్డీఎఫ్పై గూగ్లీలు విసురుతున్నాం రాష్ట్రంలో కూటమి నేతలంతా కలిసికట్టుగా పని చేయాలంటూ తమ నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల ఆదేశించారని శశి థరూర్ వివరించారు. క్షేత్రస్థాయిలో రాహుల్ ఆదేశాలను పాటిస్తున్నామని, సమన్వయంతో కలిసి పని చేస్తున్నామని పేర్కొన్నారు. కేరళ అసెంబ్లీలో మొత్తం 140 స్థానాలుండగా, ఎన్నికల్లో యూడీఎఫ్‌కు 85 నుంచి 100 స్థానాలు లభిస్తే చాలా సంతోషిస్తానని థరూర్ వ్యాఖ్యానించారు. తమకు స్పష్టమైన మెజార్టీ లభిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఎల్డీఎఫ్పై గూగ్లీలు విసురుతున్నామంటూ క్రికెట్ పరిభాషలో చెప్పారు. వామపక్ష కూటమిని కచ్చితంగా ఇంటికి పంపిస్తామన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నికల కంటే ముందు ప్రకటించే విధానాన్ని వ్యక్తిగతం తాను సమర్థిస్తానని చెప్పారు. కేరళలో మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రకటించకుండానే గెలిచే సత్తా కాంగ్రెస్‌కు ఉందని వ్యాఖ్యానించారు. పార్టీ పేరు, అజెండా, లోగోతోనే గెలుస్తామని అన్నారు. సీఎం అభ్యరి్థని ప్రకటించకపోయినా విజయావకాశాలపై ఎలాటి ప్రభావం ఉండదని వెల్లడించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత తమ అధిష్టానం ఎమ్మెల్యేలతో మాట్లాడి సీఎం అభ్యరి్థని ఎంపిక చేస్తుందన్నారు. అస్సాంలో ఆ నిర్ణయమే కరెక్టు దేశంలో ఎన్నికల పరిణామ క్రమాన్ని చాలా ఏళ్లుగా దగ్గరగా గమనిస్తున్నానని థరూర్ తెలిపారు. మనకు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నప్పటికీ రాజకీయా పార్టీలు అధ్యక్ష తరహా విధానాన్ని పాటిస్తున్నాయని చెప్పారు. ఎన్నికలు కూడా అదే తరహాలో జరుగుతున్నాయని పేర్నొన్నారు. ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి పదవుల కోసం పార్టీలు తమ అభ్యర్థులను ముందే ప్రకటించి ఎన్నికలకు వెళ్తున్నాయని గుర్తుచేశారు. కేరళలో యూడీఎఫ్‌కు సీఎం అభ్యర్థి లేకపోవడం అందరికీ వింతగా కనిపిస్తోందని వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉందన్నారు.ప్రతి గ్రామం, ప్రతి వార్డులో కాంగ్రెస్‌కు ఓటర్లు ఉన్నారని చెప్పారు. సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల్లో గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. అయితే, ఇదే సూత్రం అన్నిచోట్లా పని చేయదని అభిప్రాయపడ్డారు. అస్సాంలో గౌరవ్ గొగోయ్‌ని సీఎం అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. అక్కడ అలాంటి నిర్ణయమే సముచితమని స్పష్టంచేశారు. ఇతర రాష్ట్రాల్లోనూ సీఎం అభ్యర్థులను ముందే ప్రకటించాల్సిన అవసరం రావొచ్చన్నారు. కేరళలో పదేళ్ల ఎల్డీఎఫ్ పాలన పట్ల ప్రజలు విసుగెత్తిపోయారని శశి థరూర్ చెప్పారు. ఈసారి మార్పు కోరుకుంటున్నారని, యూడీఎఫ్‌కు పట్టం గట్టడం తథ్యమని పేర్కొన్నారు. ఆర్భాటాలు సహాయపడవుఇరాన్ యుద్ధంపై ప్రభుత్వ వైఖరికి శశి థరూర్ మద్దతుకాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మరోసారి తన పార్టీతో విభేదించారు. అమెరికా–ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధంపై మోదీ ప్రభుత్వ వైఖరిని సమరి్థంచారు. ప్రభుత్వ మౌనం బాధ్యతాయుతమైన రాజనీతిజ్ఞతని అభివర్ణించారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఈ సంఘర్షణను సమర్థించలేమని, సార్వ¿ౌమాధికారం, అహింస వంటి భారతదేశం ఎప్పటినుంచో పాటిస్తున్న సూత్రాలను ఇది ఉల్లంఘిస్తోందని థరూర్ అంగీకరించారు. అయినప్పటికీ, ప్రభుత్వ సంయమనం వ్యూహాత్మక తెలివిని ప్రతిబింబిస్తుందన్నారు. ‘ఈ సందర్భంలో మౌనం పిరికితనం కాదు. ఇది మన జాతీయ ప్రయోజనాలకు, ఈ ప్రాంత వాస్తవాలకు మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని గంభీరంగా గుర్తించడమే’నని వ్యాఖ్యానించారు. ఖమేనీ హత్యపై ఆలస్యంగా సంతాపం తెలిపి దేశం తన స్పందనలో తడబడిందని థరూర్ పేర్కొన్నారు. అయితే, మౌనాన్ని ఎంచుకున్నందుకు ప్రభుత్వాన్ని తప్పుపట్టకూడదని ఆయన వాదించారు. విదేశాంగ విధానం ఒక విద్యా సదస్సు కాదని, పరిణామాలను పట్టించుకోకుండా ఖండించాలని పట్టుబట్టడం సరికాదని పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాల విషయంలో నెహ్రూ, గాంధీ సూత్రాలను స్వీకరించి, అమలు చేయాలని థరూర్ వాదించారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో రష్యాతో భారతదేశానికి ఉన్న సంబంధాలను ఆయన ప్రస్తావించారు. అదే తర్కం ఈ రోజు కూడా వర్తిస్తుందని, ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధానికి, ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ దాడికి కూడా ఇది వర్తిస్తుందని ఆయన జోడించారు. చంచల స్వభావి అయిన ట్రంప్ నాయకత్వంలో వ్యతిరేకత ఎదురైతే విరుచుకుపడే స్వభావం ఉన్న అమెరికా, మనదేశానికి నమ్మకమైన మిత్రదేశం కాదని హెచ్చరించారు. రక్షణ సంబంధాలు, సాంకేతిక భాగస్వామ్యాలు, చైనాకు ప్రతిఘటనగా నిలవడానికి భారత్‌కు అమెరికాతో స్థిరమైన సంబంధాలు అవసరమని ఆయన నొక్కిచెప్పారు. అన్ని పక్షాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే సంయమనం పాటించడంతో దేశం తన ప్రయోజనాలను కాపాడుకోగలదని ఆయన వాదించారు. ఆయన వైఖరి తన పార్టీ వైఖరికి విరుద్ధంగా ఉంది. కీలకమైన అంశాలపై థరూర్ ప్రభుత్వంతో ఏకీభవించడం ఇది మొదటిసారి కాదు. గతంలో ప్రధాని మోదీ ఉగ్రవాద వ్యతిరేక అజెండానూ ప్రశంసించారు. ఆయన తాజా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి ఆగ్రహం తెప్పించడంతో పాటు, పార్టీ అధినేతలతో ఆయన సంబంధాలనూ మరింత దెబ్బతీసే అవకాశం ఉంది. -
కేరళలో 16 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ
తిరువనంతపురం: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేరళలో విపక్షాల యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) కూటమి తరఫున అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బరిలో దిగనుంది. కేరళలో 20 లోక్‌సభ స్థానాలు ఉండగా మా పార్టీ 16 చోట్ల పోటీ సిద్ధమవుతోందని కాంగ్రెస్ పార్టీ బుధవారం ప్రకటించింది. యూడీఎఫ్ కూటమి పారీ్టల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఒక కొలిక్కి వచి్చంది. సీట్లపంపకాల వివరాలను కాంగ్రెస్ కేరళ చీఫ్ కె.సుధాకరన్, యూడీఎఫ్ చైర్మన్ వీడీ సతీశన్ మీడియాకు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ 16 చోట్ల, యూడీఎఫ్ కూటమి పార్టీ అయిన యునియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) రెండు చోట్ల, కేరళ కాంగ్రెస్(జాకబ్) పార్టీ, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ చెరో ఒక స్థానంలో పోటీకి నిలుస్తాయని కేరళ అసెంబ్లీలో విపక్ష నేత సతీషన్ చెప్పారు. కూటమి తరఫున ఎక్కువ స్థానాల్లో పోటీచేస్తున్నందుకు బదులుగా కేరళలో వచ్చే దఫాలో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానం నుంచి ఐయూఎంఎల్‌కు కాంగ్రెస్ మద్దతు పలకనుంది. రాష్ట్రంలోని అన్ని సీట్లను గెలవడమే లక్ష్యంగా విపక్షాల ‘ఇండియా’ కూటమికి మద్దతివ్వాలని యూడీఎఫ్ నిర్ణయించుకుంది. -
కాంగ్రెస్ విషాదయోగం
‘అదృష్టం అందలమెక్కిస్తానంటే... బుద్ధి బురదలోకి లాగింద’ని సామెత. కేరళలో కాంగ్రెస్ పరిస్థితి అలాగేవుంది. అది ముఠా పోరుతో సతమతమవుతోంది. మరో 25 రోజుల్లో... అంటే వచ్చే నెల 6న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. గత నాలుగు దశాబ్దాలుగా అక్కడ అధికారంలో వున్న పార్టీ వరసగా రెండోసారి గెలిచిన ఆనవాయితీ లేదు గనుక... ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని ఐక్య ప్రజా తంత్ర కూటమి (యూడీఎఫ్)కి అవకాశం వుండొచ్చని కొందరు చెబుతున్నారు. మరోపక్క అధికార వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్డీఎఫ్) వరసగా రెండోసారి అధికారంలోకి రావటం ఖాయమని సర్వేలంటున్నాయి. ఎవరి అంచనాలెలావున్నా ఎన్నికల సమరాంగణానికి వెళ్లే పార్టీకి విజయసాధనే ప్రధాన లక్ష్యంగా వుంటుంది. కానీ అదేం ప్రారబ్ధమో...ఎన్నికల వేళ కాంగ్రెస్ ఆ కర్తవ్యాన్ని విడనాడి, తనకలవాటైన అంతర్గత పోరుతో సతమతమవుతోంది. సారధ్యం వహించాల్సిన పార్టీయే ఈ దుస్థితిలో పడటం చూసి యూడీఎఫ్‌లోని ఇతర పార్టీలు సహజంగానే నీరుగారుతున్నాయి. జాతీయ స్థాయిలో పార్టీ అధ్యక్ష పదవికి ఎవరినో ఒకరిని నియమించమని, అంతర్గత ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని నిరుడు సెప్టెంబర్‌లో కోరిన 23మంది సీనియర్ నేతల అభీష్టం ఇంకా నెరవేరలేదు. వీలు కుదిరినప్పుడల్లా వారిని అవమానించటానికీ, పక్కకు నెట్టేయటానికీ పార్టీ అధిష్టానం చేయని ప్రయత్నమంటూ లేదు. వీరంతా సోనియాగాంధీకి వీర విధేయులు. అధినేత మెప్పు పొందటానికి వీరిలో ఎవరికెవరూ తీసిపోరు. కానీ నానాటికీ పార్టీ ప్రాభవం అడుగంటుతుంటే...సమీప భవి ష్యత్తులో అది జవసత్వాలు పొందే అవకాశాలు కనబడకపోవటంతో బెంబేలెత్తి ఆ లేఖ రాశారు. ఎని మిది నెలలు కావస్తున్నా వారికి జవాబూ లేదు సరిగదా... వారి పదవులు వరసబెట్టి ఊడబెరకటం మాత్రం రివాజైంది. ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయద’టారు. కేరళ పీసీసీలో జరుగుతున్నది అదే. ఈ అంతర్గత పోరుతో విసిగిన సీనియర్ నేత పీసీ చాకో పార్టీకి ఓ దణ్ణం పెట్టి నిష్క్రమించారు. ఆయన చిన్న స్థాయి నాయకుడేమీ కాదు. రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్రాలకు పార్టీ ఇన్చార్జిగా పనిచేసిన వ్యక్తి. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీకి ఆయన చైర్మన్‌గా వ్యవహరించారు. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, సీనియర్ నేత రాహుల్ గాంధీలకు సన్నిహితుడు. కానీ చాకోను సైతం ఆ 23మంది నేతల ఖాతాలో వేశారు. ఎందుకంటే ఆయన కూడా కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం అడుగంటిందంటున్నారు. కేరళలో పార్టీ రెండు వర్గాలుగా చీలి పదవుల కోసం కీచులాడుకుంటుండగా, సరిచేయాల్సిన పార్టీ నిర్లిప్తంగా వున్నదంటున్నారు. ఫలితంగా కేరళలో ఓటమి ఖాయమని వాపోతున్నారు. 140 అసెంబ్లీ స్థానాలున్న అసెంబ్లీలో యూడీఎఫ్ ప్రధాన భాగస్వామిగా కాంగ్రెస్ 91 నుంచి 95 వరకూ స్థానాలు తీసుకునే అవకాశంవుంది. మిత్రపక్షాల్లో ప్రధానమైన ఐయూఎంఎల్‌కు 27, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్)కు 10 ఇవ్వాల్సివుంటుంది. అవి తమ వాటాను పెంచమని అడిగే ఛాన్సుంది కూడా. ఇవిగాక చిన్నా చితకా పార్టీలు మరో అయిదు వున్నాయి. ఇంతక్రితం యూడీఎఫ్‌లో భాగస్వామిగా వున్న కేరళ కాంగ్రెస్(మణి) వర్గం ఈసారి ఎల్డీఎఫ్ వైపు వెళ్లిపోయింది. గతంలో ఆ పార్టీకి రివాజుగా ఇచ్చే 11 స్థానాల్లో ఎవరెవరికి ఏయే స్థానాలివ్వాలో తేల్చాలి. ఇవన్నీ ఇంకా కొలిక్కి రాలేదు. భాగస్వామ్య పక్షాల సంఖ్య తగ్గినా, తమ అభ్యర్థులెవరో ఇంకా ప్రకటించలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ వుంటే...ఎల్డీఎఫ్ మాత్రం చురుగ్గా కదులుతోంది. ప్రధాన భాగస్వామ్య పక్షం సీపీఎం తమకు కేటాయించిన 85 స్థానాల్లో 83 స్థానాలకు అభ్యర్థుల్ని కూడా ప్రకటించి, చాలా ముందుగానే ప్రచారం మొదలుపెట్టింది. ఫ్రంట్‌లోని ఇతర పార్టీలను కూడా తొందరపెడుతోంది. ‘మెట్రో మ్యాన్’ శ్రీధరన్‌ను సీఎం అభ్యర్థిగా ఘనంగా ప్రకటించిన బీజేపీ... అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయలేదు. ఈ రెండు ప్రధాన కూటముల జాబితాలూ ఖరారై, అటునుంచి ఎవరైనా వస్తారేమో చూశాకే ఆ పని చేసే అవకాశం వుంది. కాంగ్రెస్‌కు సంబంధించినంతవరకూ కేరళకు ప్రత్యేక స్థానముంది. స్వస్థలంలో ఓడిపోయిన పార్టీ సీనియర్ నేత రాహుల్‌గాంధీ ఆ రాష్ట్రంనుంచే ఎంపీగా నెగ్గారు. కనీసం అందుకోసమైనా ఈసారి కేరళలో అధికారం దక్కకపోతే పరువుపోతుందని ఆయన భావిస్తున్నట్టు లేరు. అవినీతి ఆరోపణలపై తొలి రెండు సంవత్సరాల్లోనే ముగ్గురు ఎల్డీఎఫ్ మంత్రులు తప్పుకోవాల్సిరావటం, లాకప్ మరణాలు, బంగారం స్మగ్లింగ్ స్కాం వంటి ఆరోపణల విషయంలో నిలదీసి ఎల్డీఎఫ్ను ఇరకాటంలో పెట్టాలని యూడీఎఫ్ చూస్తోంది. శబరిమల వివాదం విషయంలో సీపీఎం తన మౌలిక సిద్ధాంతాలకు భిన్నంగా వ్యవహరించిందని యూడీఎఫ్కానీ, బీజేపీకానీ ఎటూ విమర్శించే అవకాశం లేదు. అలా చేస్తే అది ఎల్డీఎఫ్కు మేలు చేయటమే అవుతుంది. వీటి సంగతలావుంచి సీట్ల ఖరారు కోసం యూడీఎఫ్ ప్రధాన నేతలంతా ఇంకా ఢిల్లీలోనే ప్రదక్షిణాలు చేస్తున్నారు. బీజేపీ సైతం తన ప్రచార భేరి మోగించిన తరుణంలో చాకో రాజీనామా వార్త యూడీఎఫ్‌ను కుంగదీసిందనటంలో సందేహం లేదు. అధికారంలోకి రావటానికి అంతో ఇంతో అవకాశముందనుకున్నచోట పార్టీ మసకబారుతుంటే తలకలవాటైన రీతిలో కాంగ్రెస్ అధిష్టానం చోద్యం చూస్తున్న వైనం ఆ పార్టీ నిర్వా్యపకత్వానికీ, నిస్తేజానికీ అద్దం పడుతోంది. -
కేరళలో సంపూర్ణ మద్య నిషేధం
బార్ల మూసివేత... ఆదివారాల్లో మద్యం అమ్మకాలు బంద్ తిరువనంతపురం: కేరళలో దశల వారీగా సంపూర్ణ మద్య నిషేధం విధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ నేతృత్వంలో జరిగిన యూనెటైడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ యూడీఎఫ్ భేటీ అనంతరం ఉమెన్ చాందీ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఫైవ్‌స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం అమ్మకాలు సాగుతాయని, పదేళ్లలో మొత్తం రాష్ట్రంలో మద్యం నిషేదిస్తామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మూతపడిన 418 బార్లు మళ్లీ తెరుచుకునే అవకాశం లేదని,అన్నారు. ఆదివారాల్లో మద్యం అమ్మకాలు జరపకూడదని కూడా నిర్ణయం తీసుకున్నామన్నారు. ఏటా పది శాతం మద్యం దుకాణాలు మూసివేస్తామని, ఇలా పదేళ్లలో సంపూర్ణ మద్య నిషేధం సాధిస్తామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన బెవరేజెస్ కార్పొరేషన్‌కు సంబంధించిన దుకాణాల్లో పనిచేసే వారికి ప్రత్యామ్నాయాలు చూపుతామని తెలిపారు. ఈ అంశం కేరళ కేబినెట్ ముందుకు వెళుతుందని, ఆ తర్వాత అధికారిక నిర్ణయం వెలువడుతుందని యూడీఎఫ్ కన్వీనర్ పీపీ టంకచ్చన్ తెలిపారు.


