unexploded bombs
-
ఊహించని విషాదం.. పేలని బాంబును తన్నడంతో..
సింగ పెరుమాళ్: తమిళనాడులోని సింగపెరుమాళ్ కోయిల్ సమీపంలో రక్షణ రంగ నిషేధిత ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ట్రెక్కింగ్‌కు వెళ్లిన విద్యార్థుల బృందం అక్కడ ఉన్న ఒక పేలని షెల్‌ను కదిలించడంతో అది ఒక్కసారిగా పేలింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి మరణించగా.. మరో నలుగురు గాయపడ్డారు. మరణించిన విద్యార్థిని బెంగళూరుకు చెందిన హిమాన్షు యాదవ్ (21)గా గుర్తించారు. ఈ విద్యార్థి ఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఇతని తండ్రి రమేష్ సింగ్ బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ క్వార్టర్స్‌లో ఉద్యోగి.ఏప్రిల్ 13న (సోమవారం) సాయంత్రం సుమారు 5:30 గంటల సమయంలో ఆరుగురు విద్యార్థుల బృందం అనుమతి లేకుండా హనుమంతపురం ఫైరింగ్ రేంజ్ సమీపంలోని కొండపైకి ఎక్కారు. కొండపైకి చేరుకున్నాక వారికి ఒక లోహపు వస్తువు కనిపించింది. అది పేలని బాంబు అని తెలియక ఒక విద్యార్థి దానిని తన్నడంతో అది రాయికి తగిలి ఒక్కసారిగా పేలిపోయింది.దీంతో హిమాన్షు యాదవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. క్షతగాత్రులను వెంటనే పోతేరిలోని ఎస్ఆర్ఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని క్రమం తప్పకుండా ఫైరింగ్ ప్రాక్టీస్ కోసం ఉపయోగిస్తాయని.. ఆ సమయంలో పేలని షెల్ ఏదైనా అక్కడ ఉండిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సింగపెరుమాళ్ కోయిల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ పేలుడు పదార్థం అక్కడ ఎలా ఉండిపోయిందనే కోణంలో ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. -
అంత పెద్ద క్షిపణీ... చిన్నబోయిన వేళ!
ఈ ఫొటో చూస్తే ఏమనిపిస్తోంది. ఆ చిన్నారి బాలుని గుండె ధైర్యం ముందు అంత పెద్ద క్షిపణి కూడా చిన్నబోయి నేలచూపులు చూస్తున్నట్టుగా ఉంది కదూ! ఇది పేలని క్షిపణి. ఇజ్రాయెల్–అమెరికాపై యుద్ధంలో భాగంగా బుధవారం ఇరాన్ ప్రయోగించగా తూర్పు సిరియాలోని ఖమిష్లీ శివార్లలో ఇలా బహిరంగ ప్రదేశంలో పడిపోయింది. పశువుల కాపరి అయిన ఆ బాలుడు ఒక చేత్తో టోపీని నింపాదిగా సర్దుకుంటూ, మరో చేతిలో కర్రతో ఆ క్షిపణి పక్కనుంచే ఇదుగో, ఇలా నిబ్బరంగా నడుచుకుంటూ వెళ్లిపోతున్నాడు.తగ్గుతున్న అమెరికా క్షిపణి నిల్వలువాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా వద్ద క్షిపణి నిల్వలు శరవేగంగా తగ్గుతున్నట్టు సమాచారం. ఇంటర్సెప్టర్లు, గైడెడ్ మిసైళ్ల సంఖ్య బాగా తగ్గుతున్నట్టు పెంటగాన్ ఆందోళన వెలిబుచి్చంది. ఇరాన్‌పై దాడులు ఇంకో వారం పది రోజులు కొనసాగితే క్షిపణి నిల్వలు మరీ క్షీణించవచ్చని పేర్కొంటూ అది రూపొందించిన తాజా నివేదిక ఒకటి లీకైంది. అమెరికా వద్ద అపారమైన ఆయుధ నిల్వలున్నట్టు అధ్యక్షుడు ట్రంప్ రెండు రోజుల క్రితమే ప్రకటించడం తెలిసిందే. అత్యాధునిక క్షిపణులతో పాటు ఇతర ఆయుధాలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. -
రెండో ప్రపంచయుద్ధం నాటి బాంబు వెలికితీత
లండన్: రెండో ప్రపంచయుద్దంకాలంలో బ్రిటన్‌పై శత్రుదేశం జారవిడిచిన 500 కేజీల బరువైన పేలని బాంబును అధికారులు తాజాగా కనుగొన్నారు. ఇప్పటికీ అది పేలే సామర్థ్యం కల్గిఉండటం విశేషం. దీంతో హుటాహుటిన ఏకంగా 10,000కుపైగా స్థానికులను అక్కడి నుంచి ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. యుద్ధంకాకుండా శాంతికాలంలో బ్రిటన్‌లో ఇలా పౌరులను తరలించడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. నైరుతి బ్రిటన్‌లోని ప్లైమౌత్ తీరపట్టణంలో ఈ ఘటన జరిగింది. పట్టణంలోని ఒక ఇంటి పెరట్లో నేలలో మంగళవారం ఈ భారీ బాంబును కనుగొన్నారు. అందర్నీ వేరే చోటుకు తరలించాక దీనినీ దగ్గర్లోని సముద్రజలాల్లోకి తీసుకెళ్లి పేల్చేశామని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. -
ఆ నగరం కింద.. లక్షలాది బాంబులు!
మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ నగరం మొత్తం ఇప్పుడు పేలిపోయేందుకు సిద్ధంగా ఉంది. 1999 నాటి కార్గిల్ యుద్ధం సమయంలో పేలని, తిరస్కరించిన వేలాది బాంబులను అక్కడున్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఖమారియా (ఓఎఫ్‌కే)లో భూగర్భంలో పాతిపెట్టారు. అదంతా భారీగా జన సమ్మర్ధం ఉండే ప్రాంతం. అవి పేలితే అక్కడ భూకంపం సంభవించి, నగరవాసులకు భారీ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. గత కొన్నేళ్లుగా ఇక్కడ వరుసపెట్టి పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా శుక్రవారం రాత్రి కూడా చిన్నపాటి పేలుడు సంభవించి, ఇద్దరు ఉద్యోగులు గాయపడ్డారు. ఓఎఫ్‌కే ప్రాంతంలో లక్షకు పైగా 84 ఎంఎం మోర్టార్లు, ఎల్70, బీఎంపీ2 షెల్స్ ఉన్నాయని అంచనా. కార్గిల్ యుద్ధం నాటి పేలుడు పదార్థాలను దాచి ఉంచిన మ్యాగజైన్ ఎఫ్12 అనే ప్రాంతం అయితే మరింత ప్రమాదకరమని చెబుతున్నారు. తాము ఈ అంశాన్ని పలుసందర్భాల్లో అధికారుల దృష్టికి తెచ్చామని, కానీ ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇక్కడి బాంబులు, ఇతర పేలుడు పదార్థాలు.. ఏ దేశంతోనైనా యుద్ధం చేయడానికి సరిపడగా ఉన్నాయని జాయింట్ కన్సల్టేషన్ మిషనరీ సభ్యుడు అరుణ్ దూబే తెలిపారు. ఇవి మాత్రమే కాదు.. రష్యన్ ఆయుధాల ఎగుమతి సంస్థ మెసర్స్ 'రోసోబోరోన్ ఎక్స్పోర్ట్' 2013లో సరఫరా చేసిన దాదాపు 4వేల కిలోల ఆర్డీఎక్స్ కూడా జబల్పూర్ నగరం కిందే నిక్షిప్తమై ఉంది. నాణ్యతా పరీక్షలలో ఇది విఫలం కావడంతో దాన్ని ఉపయోగించలేదని, 2014లో పాత ఆర్డీఎక్స్ను తీసుకోకుండానే కొత్త స్టాకును రష్యన్ సంస్థ సరఫరా చేసిందని ఓఎఫ్‌కే ఉద్యోగి ఒకరు తెలిపారు. ఇలా పలు రకాల పేలుడు సామగ్రి మొత్తం ఆ నగరంలో భూమి కింద ఉంది. అత్యంత రద్దీగా ఉండే ఈ నగరం ఎప్పుడు ఏమవుతుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి.


