ఊహించని విషాదం.. పేలని బాంబును తన్నడంతో.. | Student Kicks Unexploded Bomb During Trek In Tamil Nadu | Sakshi
Sakshi News home page

ఊహించని విషాదం.. పేలని బాంబును తన్నడంతో..

Apr 15 2026 6:41 PM | Updated on Apr 15 2026 6:52 PM

Student Kicks Unexploded Bomb During Trek In Tamil Nadu

సింగ పెరుమాళ్: తమిళనాడులోని సింగపెరుమాళ్ కోయిల్ సమీపంలో రక్షణ రంగ నిషేధిత ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ట్రెక్కింగ్‌కు వెళ్లిన విద్యార్థుల బృందం అక్కడ ఉన్న ఒక పేలని షెల్‌ను కదిలించడంతో అది ఒక్కసారిగా పేలింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి మరణించగా.. మరో నలుగురు గాయపడ్డారు. మరణించిన విద్యార్థిని బెంగళూరుకు చెందిన హిమాన్షు యాదవ్ (21)గా గుర్తించారు. ఈ విద్యార్థి ఎస్‌ఆర్‌ఎం ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఇతని తండ్రి రమేష్ సింగ్ బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ క్వార్టర్స్‌లో ఉద్యోగి.

ఏప్రిల్ 13న (సోమవారం) సాయంత్రం సుమారు 5:30 గంటల సమయంలో ఆరుగురు విద్యార్థుల బృందం అనుమతి లేకుండా హనుమంతపురం ఫైరింగ్ రేంజ్ సమీపంలోని కొండపైకి ఎక్కారు. కొండపైకి చేరుకున్నాక వారికి ఒక లోహపు వస్తువు కనిపించింది. అది పేలని బాంబు అని తెలియక ఒక విద్యార్థి దానిని తన్నడంతో అది రాయికి తగిలి ఒక్కసారిగా పేలిపోయింది.

దీంతో హిమాన్షు యాదవ్ అక్కడికక్కడే మృతి చెందాడు. క్షతగాత్రులను వెంటనే పోతేరిలోని ఎస్‌ఆర్‌ఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని క్రమం తప్పకుండా ఫైరింగ్ ప్రాక్టీస్ కోసం ఉపయోగిస్తాయని.. ఆ సమయంలో పేలని షెల్ ఏదైనా అక్కడ ఉండిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సింగపెరుమాళ్ కోయిల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ పేలుడు పదార్థం అక్కడ ఎలా ఉండిపోయిందనే కోణంలో ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement