breaking news
udies
-
నిండా నిర్లక్ష్యం!
– ‘యూ డైస్’ పని చేయించుకున్నారు.. - రెమ్యూనరేషన్ ఇవ్వకుండా సతాయిస్తున్నారు – ‘ నిధులు మంజూరు చేయని ఎస్ఎస్ఏ – ఏడాదిగా ఎదురుచూస్తున్న ఉద్యోగులు అనంతపురం ఎడ్యుకేషన్: అవసరానికి వాడుకుని వదిలేయడమంటే ఇదేనేమో. సరిగ్గా ఏడాది కిందట 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించి యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టం (యూ డైస్) వివరాలను ఆన్లైన్లో నమోదు చేసిన ఉద్యోగులకు నేటికీ రెమ్యూనరేషన్ అందలేదు. పట్టించుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు సంబంధించి అసలు కథ ఇలా.. ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు, పని చేస్తున్న ఉపాధ్యాయులు, పాఠశాలల్లో ఉన్న మౌలిక వసతులు తదితర వివరాలను ఏటా యూడైస్‌లో ఆన్లైన్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాల ఆధారంగానే ప్రభుత్వం విద్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుంది. యూడైస్‌కు ఇంతటి ప్రాధాన్యత ఉంటుంది. వివరాల నమోదులో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా చేసినా పిల్లలకు అన్యాయం జరుగుతుంది. అందుకే జిల్లా అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఇంతవరకు బాగానే ఉంది. ఏడాది కిందట పని చేయించుకున్న సిబ్బందికి ఇప్పటిదాకా రెమ్యూనరేషన్ ఇవ్వలేదు. ఎమ్మార్సీల్లో పని చేస్తున్న ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు చాలా కష్టపడ్డారు. రేయంతా కాచుకుని నమోదు యూడైస్ నమోదు సమయంలో రాష్ట్రమంతా ఒకేమారు ఆన్లైన్ ఓపెన్ కావడంతో సర్వర్ డౌన్ అవుతుంది. దీంతో సిబ్బంది అర్ధరాత్రి, తెల్లవారుజామున వరకు మేలుకుని వివరాలు నమోదు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. జిల్లాలో 5,114 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల వివరాలను గతేడాది యూడైస్‌లో నమోదు చేశారు. ఆన్లైన్ చేసినందుకు ఒక్కో స్కూల్‌కు రూ.80 కేటాయించారు. ఈలెక్కన మొత్తం రూ.4,09,120 జిల్లాకు రావాల్సి ఉంది. బడ్జెట్ రిలీజ్ అయినా.. వాస్తవానికి యూడైస్ వివరాలు నమోదు చేసినందుకు ప్రభుత్వం బడ్జెట్ కూడా రిలీజ్ చేసింది. అయితే ఈ బడ్జెట్‌ను ఇతరవాటికి ఖర్చు చేసినట్లు తెలిసింది. బిల్లు డ్రా చేయకపోవడం వెనుక ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ఎస్ఎస్ఏలో పని చేస్తున్న ఓ ఉద్యోగి ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్ల పట్ల కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. ఇందులో భాగంగానే బడ్జెట్ అందుబాటులో ఉన్నా..సంబంధిత ఫైలు పెట్టకుండా ఆ ఉద్యోగి చక్రం తిప్పాడు. ఒకానొక సందర్భంలో ఫైలు కనిపించకుండా చేశాడు. రెమ్యూనరేషన్ కోసం ఉద్యోగులు పలుమార్లు అడిగినా...అదిగో ఇదిగో అంటూ అధికారులు దాట వేస్తూ వచ్చారు. అడిగి అడిగి చివరకు వదిలేశామని కొందరు కంప్యూటర్ ఆపరేటర్లు వాపోతున్నారు. సదరు ఉద్యోగి నిర్లక్ష్యం వల్లే తమకు రెమ్యూనరేషన్ రాకుండా అగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రెమ్యూనరేషన్ మంజూరయ్యేలా చూడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎస్ఎస్ఏ పీఓ సుబ్రహ్మణ్యం ఏమంటున్నారంటే... నేను కొత్తగా వచ్చాను. గత ఏడాది చేపట్టిన యూడైస్ కార్యక్రమానికి సంబంధించి నాకు తెలీదు. ఆ ఫైలు గురించి విచారించి చర్యలు తీసుకుంటా. -
యూ..‘డై’స్ !
- విద్యార్థి గణనపై అధికారుల మొద్దునిద్ర - ఆరు మండలాల్లో ‘0’ సంఖ్య నమోదు - ఆగస్టు 5తో ముగియనున్న గడువు జిల్లాలో విద్యార్థుల గణనపై అధికారులు మొద్దనిద్ర వీడలేదు. ఆరు మండలాల్లో సర్వే ఊసే లేదంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఊహించుకోవచ్చు. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టం (యూడైస్) జాబితాలో లేని విద్యార్థులను గుర్తించేందుకు చేపట్టిన ‘విద్యార్థి గణన’... విద్యాశాఖ నిర్లక్ష్యంతో నీరుగారిపోతోంది. అనంతపురం ఎడ్యుకేషన్: విద్యారంగంలో పాలనాపరమైన పారదర్శకత కోసం యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టం (యూడైస్)ను ప్రభుత్వం తీసుకువచ్చింది. 2012-13 విద్యాసంవత్సరంలో విద్యార్థుల గణనను పూర్రి చేశారు. అయితే ఇటీవల ప్రభుత్వం చేపట్టిన ప్రజాసాధికార సర్వే ఆధారంగా బడి ఈడు పిల్లల సంఖ్యకు యూడైస్‌లో నమోదైన పిల్లల సంఖ్యకు గణనీయమైన తేడాలు వచ్చాయి. ప్రజాసాధికారిక సర్వే లెక్కల ప్రకారం రాష్ట్రంలో 6 నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలు 6.61 లక్షల మంది తేలారు. యూడైస్ సర్వే ప్రకారం వీరిలో బడిలో చదువుతున్న పిల్లలు 5.73 లక్షల మంది మాత్రమే ఉన్నారు. తక్కిన 88 వేలమంది విద్యార్థుల వివరాలు ఏమయ్యాయో అర్థం కావడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం ‘విద్యార్థి గణన’కు మరోసారి శ్రీకారం చుట్టింది. అంతులేని నిర్లక్ష్యం ప్రజాసాధికారిక సర్వే ప్రకారం జిల్లాలో మొత్తం 6.61 లక్షల మంది 6 నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలున్నారు. వీరిలో యూడైస్ లెక్కల్లో 5.73 లక్షల మంది ఉన్నారు. తక్కిన 88,134 మంది పిల్లల లెక్కలు తేల్చాల్సి ఉంది. ఇందుకోసం ఎన్యూమరేటర్ల (సీఆర్పీ, డీఎల్ఎంటీలు) ద్వారా సర్వే చేయిస్తున్నారు. ఈ ప్రక్రియను పూర్తి చేయించాల్సిన బాధ్యత మండల విద్యాశాఖ అధికారులు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలపై ఉంది. ఆగస్టు 5తో గడువు ముగుస్తున్నా.. నేటికీ 13,673 మంది పిల్లల వివరాలు మాత్రమే ఆన్లైన్లో నమోదు చేశారు. అమడగూరు, బ్రహ్మసముద్రం, గోరంట్ల, గుంతకల్లు, కొత్తచెరువు, ఓడీ చెరువు మండలాల్లో ఇప్పటిదాకా ఒక్క పిల్లాడి వివరాలు కూడా నమోదు కాలేదు. అలాగే మరో 19 మండలాల్లో కేవలం రోజూ 10 మందిలోపు పిల్లల వివరాలను నమోదు చేస్తున్నారు. గడువులోగా పూర్తి చేయకపోతే చర్యలు విద్యార్థి గణన సర్వే ఆగస్టు 5లోపు పూర్తి చేయాలి. సర్వే పూర్తి చేయించాల్సిన బాధ్యత ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలదే. కార్యక్రమం పర్యవేక్షణకు సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ ఆఫీసర్లతో ప్రత్యేక బృందాలను నియమించాం. గడువులోగా సర్వే పూర్తి చేయని మండలాల అధికారులపై చర్యలుంటాయి. – సుబ్రహ్మణ్యం, ఎస్ఎస్ఏ పీఓ