breaking news
Two wheelers motorists
-
హెల్మెట్..హెల్మెట్..!
కరీంనగర్‌బిజినెస్: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మ్‌ట్ ధరించాలని గతంలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా జిల్లాలో కొంత కాలమే అమలయ్యింది. పోలీసులు సైతం పలు మార్లు హెల్మెట్ నిబంధనలు అమలు చేస్తున్నా.. వాహనదారులు పెద్దగా స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించేందుకు పోలీసులు హెల్మెట్ యాక్ట్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరిం చాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే హెల్మెట్ ధరించడంపై ప్రచారం చేపట్టారు. తల మీదే.. రక్షణ మీదే.. హెల్మెట్ ధరించడం వల్ల చాలా మేలు జరుగుతుంది. ప్రమాదాలు జరిగినప్పుడు వాహనదారులకు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా హెల్మెట్ ఉపయోగపడుతుంది. మెట్రో నగరాల్లో హెల్మెట్ వాడకం తప్పనిసరిగా ఉంటుంది. గతంలో కరీంనగర్లో పలుమార్లు అమలు చేసినా అది కొనసాగలేదు. కానీ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కచ్చితంగా హెల్మెట్ వాడాలని కరీంనగర్ పోలీసు అధికారులు సూచిస్తున్నారు. ‘తల మీదే... రక్షణ మీదే...’ నినాదంతో విస్తృతంగా అవగాహన, ప్రచార కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. హెల్మెట్లకు ఫుల్ గిరాకీ... పోలీసులు ఫిబ్రవరి 1నుంచి హెల్మెట్ వాడకం తప్పనిసరని సూచించడంతో హెల్మెట్ లేని వాహనదారులు కొనుగోలు చేసే పనిలో పడ్డారు. కొంతమంది ఆన్లైన్లో వివిధ రకాల మోడల్స్ వెతుకుతుండగా, మరికొంత మంది నగరంలోని షాపుల్లో సరికొత్త మోడల్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నగరంలోని కమాన్, కోతిరాంపూర్తో పాటు వివిధ ప్రాంతాల్లోని ఆటోస్టోర్స్ దుకాణాలు సహా బస్టాండ్, కమాన్, తెలంగాణచౌక్, ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్, కోర్టురోడ్డు, ఎస్సారార్ కాలేజీ రోడ్, ఆర్టీసీ వర్క్‌షాప్ ప్రాంతాల్లో హెల్మెట్లు అమ్ముతున్నారు. అలాగే కరీంనగర్ నుంచి హైదరాబాద్ రోడ్, సిరిసిల్ల రోడ్, జగిత్యాల రోడ్డు, గోదావరిఖని రోడ్లలో ప్రత్యేకంగా ఫుట్‌పాత్ దుకాణాలు వెలిశాయి. శుక్రవారం నుంచి హెల్మెట్ యాక్టు అమలు చేస్తుండడంతో గత వారం రోజులుగా హెల్మెట్లకు గిరాకీ పెరిగిందని దుకాణాదారులు తెలిపారు. మునుపెన్నడూ లేనివి«ధంగా భారీగా హెల్మెట్ల అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం. సరికొత్త రకాల హెల్మెట్లు... నగరంలోని దుకాణాలు, ఫుట్‌పాత్ షాపుల్లో సాధారణ హెల్మెట్లతో పాటు స్పోర్ట్స్, షార్ట్ హెల్మెట్, ఓపెన్ పేస్ హెల్మెట్, ఫుల్‌ఫేస్ హెల్మెట్, ఫ్లిప్ అప్ హెల్మెట్ వంటి వివిధ రకాల హెల్మెట్లు అందుబాటులో ఉన్నాయి. దాదాపు హెల్మెట్లు నాణ్యతను బట్టి రూ.350 నుంచి రూ.2000లకు పైగానే లభిస్తుందని వ్యాపారులు చెప్తున్నారు. ఐఎస్ఐ మార్క్‌తో పాటు నాణ్యమైన హెల్మెట్ వాడితేనే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. ఆన్లైన్లో కూడా కరీంనగర్ వాసులు చాలా మంది హెల్మెట్లను ఆర్డర్ చేస్తున్నారు. దాదాపు గత 15 రోజుల నుంచి సుమారు రూ.కోటి వరకు వ్యాపారం జరిగిందని అంచనా. ఈ నెల 1వ తేదీ నుంచి కరీంనగర్లో హెల్మెట్ యాక్టు అమలు చేస్తున్నాం. ప్రమాదానికి గురైనప్పుడు ద్విచక్ర వాహనదారులు కిందపడగా ముందుగా తలకే గాయాలవుతాయి. ఇలాంటి ప్రమాదాల నుంచి రక్షణ పొందేందుకు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. తల మనదే... రక్షణ మనదే అన్న సంగతి మరువరాదు. -
హెల్మెట్ ఉండాల్సిందే!
సైబరాబాద్ పరిధిలో ద్విచక్రవాహనదారులకు తప్పనిసరి సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని సైబరాబాద్ పరిధిలో రోడ్డెక్కాలంటే ద్విచక్ర వాహనదారులు ఇకపై తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందే. ఇంతకుముందు ఈ నిబంధన ఉన్నా ఎక్కడా సరిగా అమలు కాలేదు. కానీ, ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువ కావడం, నగర శివార్లటలోని కళాశాలలకు చెందిన విద్యార్థులు ఇలాంటి ఘటనలో ఎక్కువగా ప్రమాదాల బారినపడడంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ నిబంధనలు కఠినతరం చేసేందుకు సిద్ధమయ్యారు. మొదట వాహనదారుల్లో అవగాహన కల్పించి ఆ తర్వాత హెల్మెట్ నిబంధనను కఠినంగా అమలు పరచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నేటి(బుధవారం) నుంచి 12వ తేదీ వరకు సైబరాబాద్ ప్రాంతాల్లో రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా హెల్మెట్ ఆవశ్యకతపై ప్రచారం నిర్వహించనున్నారు. ట్రాఫిక్ డీసీపీ అవినాశ్ మహంతి, ట్రాఫిక్ ఏసీపీలు, 12 ఠాణాల ఇన్స్పెక్టర్లు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. వారోత్సవాల్లో భాగంగా శివార్లలోని కళాశాలల విద్యార్థులకు హెల్మెట్‌పై అవగాహన కల్పిస్తారు. ఇకపై కేసు నమోదు.. చలానాలు.. డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం వల్ల జంట పోలీసు కమిషనరేట్లలో ఈ ఏడాది రోడ్డు ప్రమాద మృతుల సంఖ్యను 300కు తగ్గించగలిగారు. ఇక హెల్మెట్లపై కూడా ఇదే రకమైన తనిఖీలు నిర్వహించి ఈసారి ప్రమాద మృతుల సంఖ్యను భారీగా తగ్గించాలని ట్రాఫిక్ పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకపక్క అవగాహన కల్పిస్తూనే మరో పక్క మోటారు వాహనాల చట్టం -1988 ప్రకారం చలానాలు విధించడానికి కూడా కసరత్తు చేస్తున్నారు. ఇన్నాళ్లు హెల్మెట్ లేకుండా వాహనం నడిపిస్తే కేసులు నమోదు చేసి, చలానా విధించేవారు. ఇప్పుడు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి మరింత కఠినంగా వ్యవహరించాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు. దీని వల్ల నగర రోడ్లపై ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని భావిస్తున్నారు. హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకోండి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారులో ప్రయాణించేవారు సీటు బెల్టు పెట్టుకోవడం వల్ల రోడ్డు ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. నాణ్యమైన హెల్మెట్లను మాత్రమే కొనుక్కోవాలి. ఇలా చేయడం ద్వారా హైదరాబాద్‌లో చాలా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు. - డీసీపీ మహంతి