breaking news
Trujet flight
-
తిరుపతి, కడపలకు ట్రూజెట్ సర్వీసులు
గన్నవరం (కృష్ణా జిల్లా) : ట్రూజెట్ విమాన సంస్థ తిరుపతి-విజయవాడ, కడప-విజయవాడల మధ్య మంగళవారం నుంచి విమాన సర్వీసులను ప్రారంభించింది. వారానికి మూడు రోజులపాటు ఈ సర్వీసులు నడవనున్నాయి. ఈ సందర్భంగా విజయవాడలోని ఓ అనాథ ఆశ్రమానికి చెందిన 15 మంది పిల్లలకు విజయవాడ-కడప మధ్య ఉచితంగా ప్రయాణించేందుకు ట్రూజెట్ అవకాశం కల్పించింది. వీరందరినీ గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి కడపకు తీసుకువెళ్ళి, మళ్లీ విజయవాడ తీసుకువచ్చారు. -
విజయవాడ నుంచి ట్రూజెట్ సర్వీసులు ప్రారంభం
విజయవాడ (లబ్బీపేట): సినీనటుడు రామ్‌చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ట్రూజెట్ విమాన సర్వీసులు ఆదివారం కృష్ణాజిల్లా విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి గన్నవరం చేరుకున్న ట్రూజెట్ విమానం..హైదరాబాద్‌కు విజయవంతంగా తిరుగు ప్రయాణమైనట్లు ఆ సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ వంకాయలపాటి ఉమేశ్ చెప్పారు. ఆదివారం విజయవాడలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ సంస్థకు ప్రస్తుతం రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయన్నారు. ప్రాంతీయ అనుమతులతో తిరుపతి, కొచ్చిన్, ఔరంగాబాద్‌లకు సర్వీసులను నడుపుతున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 5 విమానాశ్రయాలకు త్వరలోనే సర్వీసులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. టెంపుల్ టూరిజంపై తాము ప్రత్యేకంగా దృష్టి సారించామని, రానుపోను టికెట్లు కొనుగోలు చేసినవారికి ఔరంగాబాద్ నుంచి షిరిడీకి, కొచ్చిన్ నుంచి శబరిమలకు ఉచితంగా వోల్వో బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే విజయవాడ నుంచి విశాఖపట్నం సర్వీసును ప్రారంభిస్తామని ఉమేశ్ తెలిపారు.