breaking news
Tribal Thandas
-
గిరిజన తండాలో సినీనటి అమల సందడి
కుల్కచర్ల: ప్రముఖ సినీనటి, బ్లూక్రాస్ సొసైటీ నిర్వాహకురాలు అక్కినేని అమల గిరిజన తండాలో సందడి చేశారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం రాంరెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని అల్లాపూర్ తండాను ఆదివారం ఆమె సందర్శించారు. రాంరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ మాణెమ్మ ఇంటికి వెళ్లి ఆమె కుటుంబసభ్యులతో మాట్లాడారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా చిన్న కుటుంబాలే కనిపిస్తున్నాయని, ఇలాంటి సమయంలోనూ 36 మందితో ఉమ్మడి కుటుంబంగా జీవిస్తున్న మాణెమ్మ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. అక్కినేని నాగేశ్వర్రావు స్థాపించిన అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ ఫిలిమ్స్ మీడియా పాఠశాలకు అమల డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఇందులో పనిచేసే సిబ్బందికి గ్రామీణ ప్రాంతాలు, వారి జీవన స్థితిగతులు, వ్యవసాయం తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు తండాలను సందర్శించారు. -
పంచాయతీలుగా తండాలు
లంబాడాల భేరిలో మంత్రి ఉత్తమ్ హామీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తండాలను గ్రామ పంచాయతీలుగా చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. మంగళవారమిక్కడ నిజాం కళాశాల మైదానంలో లంబాడాల రాజ్యాధికార సమరభేరి జరిగింది. ఇందులో మంత్రి పాల్గొని మాట్లాడారు. తండాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రూ. 200 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. త్వరలో ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి మోడల్ కాలనీలుగా తీర్చిదిద్దుతుందన్నారు. గుడుంబా అమ్మకాలకు సంబంధించి అమాయక గిరిజనులపై మోపిన ఐదున్నర లక్షల కేసులను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు బీజేపీ కృషి చేస్తుందని ఆ పార్టీ నేత నాగం జనార్దన్‌రెడ్డి చెప్పారు. తండాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని మోడీని కోరతానన్నారు. ప్రజా గాయకుడు గద్దర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతంలో చెంచు జాతి పూర్తిగా అంతరించిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, రాబోయే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం దక్కేలా చూడాలని టీజీవోల చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ కోరారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు.. లంబాడీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతంలోని తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జనాభా నిష్పత్తి ప్రకారం గిరిజనుల రిజర్వేషన్లను 6 నుంచి 12 శాతానికి పెంచాలని కోరారు. మూడు లక్షల మంది గిరిజనులను నిర్వాసితులను చేస్తూ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు డిజైన్‌ను మార్చాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాలో రెండు శాసనసభ, ఒక లోక్‌సభ స్థానాన్ని అన్ని రాజకీయ పార్టీలు గిరిజనులకు కేటాయించాలని కోరారు. తమ సమస్యల పరిష్కార సాధన దిశగా త్వరలో జింఖానా గ్రౌండ్స్‌లో మరో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, అరుణోదయ సాంస్కృతిక కళాకారుల సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, లంబాడీ హక్కుల పోరాట సమితి గౌరవ అధ్యక్షుడు నాయక్, పలువురు నేతలు, సంఘాల నాయకులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన జనం పాల్గొన్నారు.