రైలు ఢీకొని యువకుడి దుర్మరణం
చీరాల అర్బన్, న్యూస్‌లైన్ : రైలు ఢీకొని ఓ యువకుడు దుర్మరణం పాలైన సంఘటన చీరాల రైల్వేస్టేషన్లో శనివారం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం... గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన గుర్రం ప్రేమ్‌కుమార్ (25) బ్యాండ్‌మేళం బృందంలో పనిచేస్తుంటాడు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం చీరాల వచ్చాడు. అక్కడ పని ముగించుకుని తిరిగి పెదవడ్లపూడి వెళ్లేందుకు మధ్యాహ్నం చీరాల రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. రెండో నంబర్ ప్లాట్‌ఫాం నుంచి మూడో నంబర్ ప్లాట్‌ఫాం మీదకు వెళ్లేందుకు ట్రాక్ దాటుతున్న సమయంలో కన్యాకుమారి నుంచి హెచ్.నిజాముద్దీన్ వెళ్తున్న సూపర్‌ఫాస్ట్ రైలు ఢీకొట్టింది. దీంతో ప్రేమ్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. అతని వద్ద లభించిన సెల్‌ఫోన్, ఓటర్ కార్డు ఆధారంగా జీఆర్పీ పోలీసులు వివరాలు తెలుసుకుని బంధువులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ మస్తాన్‌షరీఫ్ తెలిపారు.