breaking news
Tita burial
-
మృత్యు బావి!
పూడిక తీసేందుకు దిగి కూలీ.. అతన్ని కాపాడేందుకు యత్నించి యజమాని మృతి శ్రమకోర్చి మృతదేహాలను వెలికితీసిన రెస్క్యూ టీమ్ కొండూరులో విషాదం కొండూరు (నందిగామ రూరల్) : బావిలో పూడిక తీసేందుకు దిగి ఇద్దరు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కొండూరు గ్రామంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన సీలం శ్రీనివాసరావు ఇంటి ఆవరణలోని బావి ఒట్టిపోయింది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన బెల్లంకొండ సత్యానందం అనే కూలీ పూడిక తీత కోసం బావిలోకి దిగాడు. దాదాపు 40 అడుగుల లోతులో ఉన్న బావిలోకి దిగిన సత్యానందం నుంచి ఎంతకు ఎటువంటి సమాధానం లేకపోవడంతో శ్రీనివాసరావు చుట్టుపక్కల వారిని పిలిచాడు. వారిలో జక్రయ్య అనే వ్యక్తి తాడు సాయంతో బావిలోకి దిగాడు. 15 అడుగుల లోతులోకి వెళ్లిన వెంటనే ఊపిరి ఆడటం లేదంటూ జక్రయ్య కేకలు వేయడంతో అతన్ని పైకి లాగారు. అనంతరం యజమాని శ్రీని వాసరావు మోకు సాయంతో స్వయంగా బావిలోకి దిగాడు. 13 అడుగుల లోతుకు వెళ్లిన వెంటనే అతను ఊపిరి అందక బావిలోకి పడిపోయాడు. వారిద్దరినీ కాపాడేందుకు లక్ష్మీనారాయణ అనే మరో వ్యక్తి ప్రయత్నించినప్పటికీ, ఫలితం లేకపోయింది. అతను సైతం ఊపిరందక కేకలు వేయడంతో అతన్నీ పైకి లాగారు. దీంతో గ్రామస్తులు అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన రెవెన్యూ, పోలీసు, ఫైర్ శాఖల అధికారులు సాయంత్రం నాలుగు గంటల సమయంలో గ్రామానికి చేరుకున్నారు. ఫైర్ అధికారులు ముందుగా దీపాన్ని బావిలోకి దింపారు. కొంత లోతుకు వెళ్లే సరికి దీపం ఆరిపోవడంతో బావిలో ఆక్సిజన్ అందడం లేదని నిర్ధారణకు వచ్చారు. వెంటనే జాతీయ విపత్తుల నివారణ శాఖకు సమాచారం అందించారు. రాత్రి ఏడు గంటల సమయంలో వారు గ్రామానికి చేరుకున్నారు. బావి విస్తీర్ణం తక్కువగా ఉండటం, లోతు అధికంగా ఉండటంతో వారు సైతం తొలుత బావిలో దిగేందుకు సాహసించలేదు. చివరకు ఎన్డీఆర్ఎఫ్ బృందంలో ఒకరు బావిలోకి దిగేందుకు ముందుకువచ్చారు. ఎట్టకేలకు రాత్రి 9 గంటల సమయానికి ఇంటి యజమాని శ్రీనివాసరావు (43), కూలీ బెల్లంకొండ సత్యానందం (35) మృతదేహాలను అతి కష్టంమీద వెలికి తీశారు. తహసీల్దార్ వై.వి.ప్రసన్నలక్ష్మి, ఎస్హెచ్ఓ సత్యనారాయణ, ఫైర్ సిబ్బంది గ్రామంలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కన్నీటి పర్యంతమైన కుటుంబసభ్యులు పూడిక తీసేందుకు బావిలోకి దిగి శ్రీనివాసరావు, సత్యానందం మృతిచెందడంతో వారి కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఊహించని విధంగా వారు మృత్యువాత పడటం కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులను సైతం కలచివేసింది. నీటి కోసం తాము ప్రయత్నిస్తే, మృత్యువు తమ వారిని కబళించిందంటూ భోరున విలపిస్తున్నారు. ఈ హఠాత్పరిణామంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. -
పూడికతీతలో ‘తమ్ముళ్ల’ దోపిడీ
ఉపాధి పనుల పేరుతో మట్టి అమ్మకం చెరువు గట్టు పటిష్టానికి చర్యలు శూన్యం అచ్యుతాపురం: చెరువు పూడిక తీత పేరుతో టీడీపీకి చెందిన నాయకులు మట్టి అమ్మకాలు జరిపి లక్షలాది రూపాయలు స్వాహా చేస్తున్నారు. చీమలాపల్లి చెరువులో పూడికతీత పనుల నిమిత్తం రూ.40 లక్షల అంచనా వ్యయంతో పనులు మంజూరయ్యాయి. కూలీలు అందుబాటులో లేని కారణంగా యంత్రాల సహాయంతో పూడికలు తొలగించేందుకు చీమలాపల్లి పంచాయతీలో ఒక తెలుగు తమ్ముడు కలెక్టర్ యువరాజ్ నుంచి అనుమతి తీసుకువచ్చారు. ఇక్కడ తొలగించిన మట్టిని చెరువు గట్టుపటిష్టం చేసేందుకు వినియోగించాల్సి ఉన్నప్పటికీ, దీనికి విరుద్ధంగా మట్టిని యథేచ్చగా బయట విక్రయించుకుంటున్నారు. తన సొంత పొక్లయిన్, లారీలు, ట్రాక్టర్లను వినియోగించి పూడికలు తొలగిస్తున్నారు. తొలగించిన మట్టిని కొండకర్ల ఆవ, ఆవసోమవరం, ఆవరాజాం గ్రామాల పరిధిలో ఉన్న లే అవుట్లు కప్పేందుకు వినియోగిస్తున్నారు. చెరువులో మట్టిని తొలగించేందుకు ప్రభుత్వం నుంచి లక్షలాది రూపాయలతో పాటు ఈ మట్టి అమ్మకం చేపట్టడం వల్ల మరింత ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు. ప్రస్తుతం చేపడుతున్న పూడికతీతతో రైతులకు ఎటువంటి ప్రయోజనం చేకూరదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కలెక్టర్ యువరాజ్ అనుమతి ఉందని, పూడికతీత పనులు చేపట్టేది అధికార పార్టీ నాయకులు కావడంతో ఏ ఒక్క అధికారి ఇటువైపు కన్నెత్తై చూడడం లేదు. దీంతో లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని టీడీపీ నాయకుడు స్వాహా చేస్తున్నారు. ఇకనైనా అధికారులు పర్యవేక్షించి చెరువులో మట్టి తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.