breaking news
Tippapur
-
మనసిచ్చిన మేనబావ.. మనువాడుతానని మరదలుకు చెప్పి
వేములవాడ అర్బన్: రెండేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని.. ఇప్పుడు మోసం చేశాడని యువతి మేనబావ ఇంటి ఎదుట బైఠాయించిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్‌కు చెందిన తన మేనబావ ఎదురుగట్ల రాము అదేకాలనీలో నివసిస్తున్న తన మేనమామ కూతురు గౌతమిని ప్రేమిస్తున్నానని చెప్పాడు. రెండేళ్లుగా ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసగించాడని ఆ యువతి వాపోయింది. తన తల్లిమాటలు విని తప్పించుకు తిరుగుతున్నాడని గౌతమి ఆవేదన చెందింది. చదవండి: హుజురాబాద్.. తుపాకులు అప్పగించాలె.. లేదంటే ఈ విషయమై నాలుగు రోజుల కిందట గౌతమి పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ వెంకటేశ్ ఇద్దరిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిపింది. అయినప్పటికీ రాము మారకపోవడంతో బుధవారం ఉదయం ఈ విషయమై గౌతమి అడిగేందుకు వెళ్లడంతో ఇంటికి తాళం వేసి తల్లికుమారుడు వెళ్లిపోయారని పేర్కొంది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు మేనబావ ఇంటి ఎదుట బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేసింది. చదవండి: పత్తి ఏరాల్సిన చోట.. చేనులో చేపల వేట -
మేఘా విద్యుత్ రికార్డు
ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లను విజయవంతంగా పూర్తి చేసిన ఎంఈఐఎల్ తాజాగా తెలంగాణకు ఎంతో ప్రాణాధారమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ అవసరాల కోసం 6 భారీ సబ్ స్టేషన్లను ప్రపంచంలోనే తొలిసారిగా త్వరితగతిన పూర్తిచేసి రికార్డ్ సాధించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు మొత్తం 4627 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా అందులో 3057 మెగావాట్ల విద్యుత్ సరఫరా వ్యవస్థను ఎంఈఐఎల్ యుద్ధప్రతిపాదికన పూర్తి చేసి తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకుంది. నీటిపారుదల రంగంలోనే అతిపెద్ద విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయడం ప్రపంచంలోని ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. ప్రైవేటు రంగంలో విద్యుత్ సరఫరా కోసం అతిపెద్దదైన WUPPTCL ఉత్తరప్రదేశ్‌లో ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. అయితే అది విద్యుత్ అవసరాలకోసం కాగా కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన విద్యుత్ వ్యవస్థ ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ అవసరాల కోసం ఏర్పాటు చేసింది. కేవలం రెండేళ్ల కాలంలోనే 6 భారీ సబ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది ఎంఈఐఎల్. ఇవన్నీ 400 కేవీ, 220 కేవీ సామర్థ్యం కలిగినవి. దాదాపు 260 కిలోమీటర్ల మేర ట్రాన్స్మిషన్ లైన్లను కూడా అతితక్కువ కాలంలోనే ఎంఈఐఎల్ పూర్తి చేసింది. 2017 ఫిబ్రవరిలో రామడుగు సబ్‌స్టేషన్‌తో పనులను ప్రారంభించి, ఒక్కో సబ్‌స్టేషన్‌ను పూర్తిచేస్తూ చివరగా ఆరో సబ్‌స్టేషన్‌ను 2019 మే నెలలో అందుబాటులోకి తీసుకొచ్చింది. అతిపెద్ద విద్యుత్ వ్యవస్థ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంఈఐఎల్ ఏర్పాటు చేసిన విద్యుత్ సరఫరా వ్యవస్థ ఎంత పెద్దదంటే మన దేశంలోని జమ్ము కాశ్మీర్ (3428 మెగావాట్లు), ఉత్తరాఖండ్ (3356 మెగావాట్లు), హిమాచల్ ప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల విద్యుత్ సరఫరా వ్యవస్థలకు దాదాపుగా సమానం. రికార్డు సమయంలో ఎంఈఐఎల్ ఆరు సబ్ స్టేషన్లు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ప్యాకేజీ 8, 10, 11 పంప్ హౌజ్ లలో ఏర్పాటు చేసిన మొత్తం 43 పంపుమోటార్లకు విద్యుత్ ను అందించేందుకు అవసరమైన ఆరు విద్యుత్ సబ్స్టేషన్లను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్యాకేజీ 6, 12, 14 సబ్ స్టేషన్ లు మినహా మిగతా అన్ని సబ్ స్టేషన్ లను, విద్యుత్ సరఫరా లైన్లను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. అతిపెద్ద భూగర్భ పంపింగ్ స్టేషన్‌కు విద్యుత్‌వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ పంపింగ్ స్టేషన్ కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ 8లో భాగంగా ఎంఈఐఎల్ నిర్మించింది. ఈ పంప్ హౌజ్ లో ఒక్కోటి 139 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఏడు భారీ పంప్ మోటార్లకు విద్యుత్ ను అందించేందుకు 400/13.8/11 కేవీ సబ్ స్టేషన్ ను ఎంఈఐఎల్ రామడుగు వద్ద ఏర్పాటు చేసింది. దీని కోసం 18 కిలోమీటర్ల 400 కేవీ క్యూఎండీసీ ట్రాన్స్ మిషన్ లైన్‌ను కూడా ఏర్పాటు చేసింది. రామడుగు సబ్ స్టేషన్, ట్రాన్స్ మిషన్ లైన్ పనులను 2017 ఫిబ్రవరి 22న ప్రారంభించి, కేవలం ఏడాది కాలంలో పనులను పూర్తిచేసి, 2018 మే 6న చార్జ్ చేసి అందుబాటులోకి తెచ్చింది. తొమ్మిది యూనిట్లతో 360 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సుందిళ్ల పంప్ హౌజ్ కు విద్యుత్ ను అందించే 400/220/11 కేవీ సుందిళ్ల సబ్ స్టేషన్ ను ఎంఈఐఎల్ గడువులోగా పూర్తి చేసింది. ఈ సబ్ స్టేషన్ నుంచే 220 కేవీ అన్నారం, 220 కేవీ మేడిగడ్డ సబ్ స్టేషన్లకు విద్యుత్ అందుతుంది. 320 మెగావాట్ల సామర్థ్యం కలిగిన అన్నారం పంప్ హౌజ్ కు విద్యుత్ ను అందించేందుకు 220 కేవీ అన్నారం సబ్ స్టేషన్, సుందిళ్ల నుంచి 28 కిలోమీటర్ల టీఎండీసీ ట్రాన్స్ మిషన్ లైన్ ను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. ఈ సబ్ స్టేషన్ పనులను 2017 ఏప్రిల్ 1న ప్రారంభించి, 2018 సెప్టెంబర్ 14న చార్జింగ్ ప్రక్రియను పూర్తి చేసింది. 440 మెగావాట్ల సామర్థ్యంతో 11 యూనిట్లను కలిగిన మేడిగడ్డ పంప్ హౌజ్ కు విద్యుత్ అందించేందుకు 220 కేవీ మేడిగడ్డ సబ్ స్టేషన్ తోపాటు సుందిళ్ల నుంచి 80 కిలోమీటర్ల టీఎండీసీ ట్రాన్స్ మిషన్ లైన్ ఏర్పాటు చేశారు. దీని పనులను 2017 ఏప్రిల్ లో ప్రారంభించి, 2018 సెప్టెంబర్ 29న చార్జింగ్ ప్రక్రియను నిర్దేశిత గడువు కన్నా ముందే పూర్తి చేసింది. తిప్పాపూర్ సబ్ స్టేషన్ తో ప్యాకేజీ 10కు విద్యుత్ సిరిసిల్ల జిల్లా తిప్పాపూర్ వద్ద ఏర్పాటు చేసిన ప్యాకేజీ 10 పంప్ హౌజ్ లోని మొత్తం 425 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్లకు విద్యుత్ ను అందించేందుకు 400/11 కేవీ తిప్పాపూర్ సబ్ స్టేషన్ ను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. రామడుగు సబ్ స్టేషన్ నుంచి 46.115 కిలోమీటర్ల లైన్ తోపాటు చందులాపూర్ నుంచి 19.096 కిలోమీటర్ల క్యూఎండీసీ లైన్ ను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. ఈ సబ్ స్టేషన్, లైన్ల పనులను 2017 నవంబర్ 8న ప్రారంభించి, 2019 ఏప్రిల్ 29న అందుబాటులోకి తెచ్చారు. సిద్ధిపేట వద్ద ఏర్పాటు చేస్తున్న ప్యాకేజీ 11 రంగనాయకసాగర్ పంప్ హౌజ్ లోని 541 మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు యూనిట్లకు విద్యుత్ ను అందించేందుకు చందులాపూర్ వద్ద 400/13.8/11 కేవీ సబ్ స్టేషన్ ను ఎంఈఐఎల్ ఏర్పాటు చేసింది. భూపాలపల్లి కేటీపీపీ నుంచి గజ్వేల్ సబ్ స్టేషన్ అక్కడి నుంచి చందులాపూర్ వరకు 54.18 కిలోమీటర్ల ట్రాన్స్ మిషన్ లైన్ ను ఏర్పాటు చేశారు. ఈ పనులను మే 2017లో ప్రారంభించగా, 2019 మే 6న చార్జింగ్ చేశారు. -
కూలిందా..? పేలిందా..?
♦ తిప్పాపూర్ మృతులంతా స్థానికేతరులే ♦ ఏడు ప్రాణాలు పోయినా ఏడుపే లేదు ♦ సొరంగంలో చిక్కి ముక్కలైన శరీరాలు ♦ అంతా గోప్యం.. రక్షణ శూన్యం ♦ సబ్ కాంట్రాక్టుల చేతిలో పనులు ♦ నీటిపారుదల శాఖ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం సిరిసిల్ల/ఇల్లంతకుంట : బతుకుదెరువు వెతుక్కుంటూ పొట్టచేత పట్టుకుని వచ్చిన కూలీ బతుకుకూలిపోయింది. ఏడు నిండు ప్రాణాలు పోయినా.. ఏడ్చేందుకు ఒక్కరైనా లేని దయనీయం. మృతులంతా 35 ఏళ్లలోపు యువకులే. నా అనేవారే లేని గుట్టల మధ్య కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ప్రాణాలను ఎత్తిపోశారు. శవాలను బట్టల్లో చుట్టి అంబులెన్స్‌లో కరీంనగర్‌కు తరలించారు. అయినవారు ఎవరూ లేక ఏడ్చేవారు లేకపోవడం బాధాకరం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ వద్ద సాగుతున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్యాకేజీ–10లో బుధవారం ఏడుగురు కూలీలు బలయ్యారు. ఒక్కసారిగా కూలిన బండరాళ్లతో కూలీల శరీర భాగాలు ముక్కలయ్యాయి. ఏం జరిగిందో ఊహించేలోపే ఏడు ప్రాణాలు గాలిలో కలిసిన ఘటన విషాదాన్ని నింపింది. సొరంగం మృత్యుకుహరం.. మధ్యమానేరు జలాశయం నుంచి మల్లన్నసాగర్‌కు సాగునీటిని పంపింగ్ చేసే సొరంగం పనులు మృత్యుకుహారంగా మారింది. బుధవారం ఎప్పటిలాగే పనుల్లోకి వెళ్లిన 27 మందిలో భూపాలపల్లి జిల్లా ములుగుకు చెందిన ఎలక్ట్రిషియన్ సందీప్(25), జార్ఖండ్‌కు చెందిన గౌట్మా(24), హకీం(26), బీహార్‌కు చెందిన పురమ్సింగ్(32), జిలిటెన్స్ బ్లాస్టర్ జితేందర్(25), ఒడిశాకు చెందిన సూపర్వైజర్ హరి(35), ఛత్తీస్‌గఢ్‌కు చెందిన హరిరామ్ (35) మృతిచెందారు. బీహార్‌కు చెందిన గోధన్ (30) చికిత్స పొందుతున్నాడు. సొరంగంలో పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా.. ఈ ఘటన జరిగింది. సొరంగంలో పనులు ముగింపుదశకు చేరాయని, బుధవారం గడిస్తే.. మళ్లీ యంత్రాలతోనే పనులు చేసేది ఉందని నీటిపారుదలశాఖ ఈఈ ఆనంద్ తెలిపారు. నీటి పంపింగ్ మోటార్లు బిగింపు పనులు సాగుతున్నాయని పేర్కొన్నారు. సొరంగమార్గం భూఉపరితలం నుంచి 150 మీటర్ల లోతులో.. మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. రెండు కిలోమీటర్ల జంక్షన్ వద్దనే ఈ ఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సొరంగం చీకటితో నిండి మసక మసక వెలుతురు ఉంది. ఉబికివచ్చే నీటి ఊటలను దాటుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుందని సొరంగంలో పనిచేసిన కూలీలు వివరించారు. ఆక్సిజన్ లభించక ఇబ్బందులు పడిన సందర్భాలు అనేకమున్నాయని తెలిపారు. దినదినగండంగా.. నిత్యప్రమాదాల మధ్య పనిచేసినట్లు కూలీలు తెలిపారు. అనూహ్యంగా ఏడుగురు బలి కావడంతో ఆ సొరంగాన్ని చూస్తేనే భయమేస్తోందని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కార్మికుడు ఒకరు చెప్పారు. మృతులంతా యువకులే.. సొరంగంలో మరణించిన వారంతా 35 ఏళ్లలోపు యువకులు కావడం మరో విషాదం. ఇందులో చాలామందికి పెళ్లికూడా కాలేదు. జార్ఖండ్‌కు చెందిన గౌట్మా(24) మూడు నెలల కిందట తిప్పాపూర్ సైట్‌కు పనికి వచ్చాడని అతని సోదరుడు దేవినీస్ తెలిపారు. డ్రిల్లింగ్ పనిచేసే గౌట్మాకు ఇంకా పెళ్లికాలేదు. ఇలా ఏడుగురు మృతుల్లో చాలామందికి వివాహం కాలేదు. కుటుంబపోషణ కోసం వచ్చి బలికావడం బాధాకరం. తిప్పాపూర్ సొరంగం పనులు చేసే కార్మికులకు నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు పనిని బట్టి కాంట్రాక్టర్ చెల్లిస్తారని సమాచారం. ప్రమాదకరమైన పని కావడంతో స్థానికులు ఎవరూ ఈ పని చేయరనే భావంతో కాంట్రాక్టర్లు పొరుగు రాష్ట్రాల కూలీలను తెచ్చారు. కనీస మౌలిక వసతులు లేకున్నా..రేకుల శిబిరంలో తలదాచుకుంటూ.. అక్కడే తింటూ.. అక్కడే పనిచేస్తూ.. కాలం వెల్లదీయడం కూలీల పని. ఈ క్రమంలో విధి ఇలా కాటేయడంతో విగతజీవులగా వారివారి స్వస్థలాలకు చేరుకోవాల్సి రావడం విషాదం. సబ్ కాంట్రాక్టర్ చేతిలో పనులు.. కాళేశ్వరం ప్యాకేజీ–10ను హెచ్‌సీసీ అనే సంస్థ కాంట్రాక్టు పొందగా.. ప్రతిమ ఇన్ఫ్రా అనే సబ్ కాంట్రాక్టు సంస్థ పనులు చేస్తోంది. క్షేత్రస్థాయిలో సబ్ కాంట్రాక్టు సంస్థ సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందనే అనుమానాలున్నాయి. సంఘటన సమాచారాన్ని ఎందుకు సకాలంలో అందించలేదని కలెక్టర్ కృష్ణభాస్కర్ నీటిపారుదలశాఖ ఈఈ ఆనంద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు డీఐజీ రవివర్మ, ఎస్పీ విశ్వజిత్ సొరంగంలోకి వెళ్లి వచ్చారు. గుట్టల వద్ద ఏడుగురు మరణించారని తెలియడంతో తిప్పాపూర్ వాసులు సొరంగం వద్దకు తరలివచ్చారు. ఘటనా స్థలానికి సిరిసిల్ల ఆర్డీవో ఎన్.పాండురంగ, తహసీల్దార్ శ్రీనివాస్, ఇల్లంతకుంట ఎంపీపీ గుడిసె అయిలయ్య, ‘సెస్’ డైరెక్టర్ వెంకటరమణారెడ్డి, సిరిసిల్ల రూరల్ సీఐ అనిల్‌కుమార్, ఎస్సైలు లక్ష్మారెడ్డి, ప్రవీణ్, వెంకటకృష్ణ, నరేశ్‌కుమార్, సురేందర్‌రెడ్డి వచ్చారు. సాయుధ పోలీసుల పికెటింగ్ ఘటనా స్థలంలో సాయుధ పోలీసుల పికెటింగ్‌ను ఏర్పాటు చేశారు. డిస్ట్రిక్ట్గార్డ్స్ పోలీసులతో పాటు ఇల్లంతకుంట పోలీస్‌స్టేషన్‌కు చెందిన సాయుధ పోలీసులను రక్షణగా ఉంచారు. శవాలను షిఫ్ట్ చేసిన అనంతరం సొరంగంలోకి ఎవరినీ అనుమతించకుండా కట్టడి చేశారు. స్థానికులు చూసేందుకు వచ్చినా వారిని అక్కడి నుంచి పంపించారు. అంతా గోప్యం.. రక్షణ శూన్యం.. సొరంగం తవ్వే క్రమంలో సింగరేణి తరహాలో రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిజం (ఎన్ఐఆర్ఎం) పర్యవేక్షణలో పనులు చేయాల్సి ఉంది. కానీ రక్షణ చర్యలు తీసుకోకుండా సొరంగం తవ్వకాలు సాగించడంతో ఈ ప్రమాదం జరిగిందనే అనుమానాలున్నాయి. సొరంగం తవ్వేందుకు మిషన్ బూమర్ ఉండగా.. బండలను పేల్చేందుకు జిలిటెన్లు వినియోగిస్తారు. జిలిటెన్ పేలినప్పుడు భారీ శబ్దం రావడంతో భూమి కంపించి పైకప్పు కూలిందా..? లేక రాతిపొరల్లోకి గాలి చేరడంతో ప్రమాదవశాత్తు పడిపోయిందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన జరిగిన తరువాత పోలీసు అధికారులు చేరుకుని శవాలను బట్టల్లో చుట్టి తరలించారు. రెవెన్యూ, ఇతర శాఖల అధికారులను ఎవరినీ సొరంగంలోకి అనుమతించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రమాద ఘటనపై అంతా గోప్యంగానే ఉంచారు. మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రమాదం జరిగిందని చెబుతున్న అధికారులు.. సాయంత్రంవరకూ ఎందుకు బయటపెట్టలేదో అంతుచిక్కడం లేదు. రెవెన్యూ అధికారులకు సైతం సాయంత్రంవరకూ సమాచారం లేకపోవడం గమనార్హం. కలెక్టర్ కృష్ణభాస్కర్ సిరిసిల్ల నుంచి బయల్దేరగా.. దారి తప్పిపోయి అరగంట ఆలస్యంగా తిప్పాపూర్ సొరంగం వద్దకు చేరారు. మొత్తంగా ఏడుగురిని బలి తీసుకున్న ఘటనపై పొంతన లేని కథనాలు పలు అనుమానాలకు తావిస్తోంది. మృతులు వీరే.. ప్రమాదంలో మృతిచెందినవారిలో జార్ఖండ్ రాష్ట్రం తూర్పుసింగ్భమ్ జిల్లా జందా గ్రామానికి చెందిన హికిమ్ హండ్సా (26), సిందేగా జిల్లా రాంజోల్ గ్రామానికి చెందిన గాట్మాటోప్నో, ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బగ్‌బన్‌పూర్‌కు చెందిన రామకష్ణన్ సాహు(35), ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లా సౌత్పూర్కు చెందిన హరిచంద్ నేతన్(35), పశ్చిమ్‌బంగ రాష్ట్రం బురద్ద్వాన్ జిల్లాకు చెందిన జితేందర్‌కుమార్(25), జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగుకు చెందిన యాసం సందీప్ (25), జార్ఖండ్ రాష్ట్రం రాంగడ్ జిల్లా బర్ఖాంగ గ్రామానికి చెందిన పూరన్‌సింగ్(40) ఉన్నారు. జార్ఖండ్ జిల్లా ముస్బాని గ్రామానికి చెందిన బుడాన్ సోరెన్ (38)కు కరీంనగర్ ప్రతిమ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు.