breaking news
Tiles shop
-
నా సంగతి మీకు తెలీదు.. తనిఖీలు ఆపి వెంటనే వెళ్లండి
చోడవరం: ‘ఎవరు మీరు? ఎందుకొచ్చారు? ఎవరు పంపిస్తే వచ్చారో నాకు తెలుసు. అసలు ఇలాంటి షాపుల్లో తనిఖీలు చేయాలని మీకు ఎవరు చెప్పారు? పెద్ద పెద్ద మాల్స్‌ను వదిలేసి ఇలాంటివాటిపై పడతారా? వెంటనే ఇక్కడి నుంచి వెళ్లకపోతే బాగుండదు. నా సంగతి మీకు తెలీదు’ అంటూ అనకాపల్లి టీడీపీ, బీజేపీ కూటమి ఎంపీ అభ్యర్థి సీ.ఎం. రమేష్ విధి నిర్వహణలో ఉన్న అధికారులపై తన అనుచరులతో కలసి దౌర్జన్యానికి దిగారు. వారి చేతిలో ఉన్న ఫైళ్లు లాక్కుని వారిపై విరుచుకుపడి అందరినీ భయభ్రాంతులకు గురిచేశారు. ఒక దశలో అధికారుల చేతులను తోసేసి గూండాయిజం చేశారు. ఏక వచనంతో సంబోధించి అధికారులపై బెదిరింపులకు తెగబడ్డారు. తానేంటో... తన సహజ ధోరణి ఏంటో ఈ సంఘటన ద్వారా ఆయన స్థానికులకు రుచిచూపించారు. ప్రశాంతమైన అనకాపల్లి జిల్లాలో ఇలాంటి సంఘటనలు గతంలో ఎన్నడూ చూడని అక్కడి ప్రజలు ఆయన రౌడీయిజం చూసి భయభ్రాంతులకు లోనయ్యారు. ఇప్పుడే ఈయన ప్రవర్తన ఇలా ఉంటే ఇక ఆయన్ని గెలిపిస్తే ఇక తమను బతకనిస్తారా అంటూ అక్కడివారు గుసగుసలాడుకోవడం వినిపించింది. చోడవరం మండలం గాంధీ గ్రామంలో గురువారం చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జీఎస్టీ రికార్డులు తనిఖీ చేస్తుండగా... గాంధీ గ్రామంలో బుచ్చిరాజు అనే టీడీపీ సానుభూతిపరుడు హోల్‌సేల్ టైల్స్, మార్బుల్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. దానిపై డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం(డీఆర్ఐ) అధికారి శ్రీధర్ ఆధ్వర్యంలో ఆరుగురితో కూడిన ఓ బృందం గురువారం తనిఖీలు నిర్వహిస్తోంది. జీఎస్టీ సక్రమంగా కట్టడం లేదంటూ షాపు రికార్డులన్నీ వారు తనిఖీ చేస్తుండగా టైల్స్ వ్యాపారి బుచ్చిరాజు స్థానిక టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజుకు, అనకాపల్లి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌కు ఫోన్ చేశారు. వెంటనే వారిద్దరూ తమ అనుచరులతో టైల్స్ షాపు దగ్గరకు చేరుకున్నారు. అధికారుల దగ్గర్నుంచి రికార్డులను సీఎం రమేష్ లాక్కున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా తనిఖీలు చేస్తారంటూ వారిపై దౌర్జన్యానికి దిగారు. అంతేనా అధికారులని కూడా చూడకుండా పరుషపదజాలంతో వారిపై విరుచుకుపడ్డారు. టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు తన వెంట తీసుకొచ్చిన కార్యకర్తలను రెచ్చగొట్టి, దౌర్జన్యానికి మరింత పురిగొల్పేలా ప్రవర్తించారు. రాష్ట్ర ప్రభుత్వంపైనా, స్థానిక ఎమ్మెల్యేపైనా విమర్శలు చేయడంతో అక్కడి వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. ఇంతలో సమాచారం అందుకున్న స్థానిక పోలీసు సీఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో వచ్చి పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు వచ్చాక కూడా సీఎం రమేష్ అధికారులను బెదిరించడం మానలేదు. దాడులు ఆపే వరకూ ఇక్కడే ధర్నా చేస్తామంటూ హెచ్చరించారు. తమ షాపు అద్దాలను అధికారులు పగలగొట్టారని, కౌంటర్లో ఉన్న రూ.25 లక్షలు నగదు తీసుకున్నారంటూ షాపు యజమాని బుచ్చిరాజు సీఎం రమే‹Ùకు చెప్పడం, ఆయన అధికారులపై మరింత రెచ్చిపోయి ఆ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. అధికారులు మాత్రం తనిఖీలు ఆపబోమని చెప్పగా.. పరిస్థితి అదుపు తప్పేట్టు వుందని స్థానిక పోలీసులు చెప్పడంతో డీఆర్ఐ అధికారుల బృందం అక్కడ నుంచి వెళ్లిపోయింది. పోలీసులకు ఫిర్యాదు జరిగిన సంఘటనపై డీఆర్ఐ అధికారులు చోడవరం పోలీసులకు గురువారం రాత్రి ఫిర్యాదు చేశారు. అనకాపల్లి డీఎస్పీ అప్పలరాజు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి, చోడవరం పోలీసు స్టేషన్లో డీఆర్ఐ అధికారులతో మాట్లాడారు. వారి ఫిర్యాదుపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. కాగా ఎన్నడూ ఇలాంటి దౌర్జన్యకర సంఘటనలు చూడని స్థానికులు సీఎం రమేష్ ప్రవర్తనపై ఏవగించుకున్నారు.డ్యూటీకి అడ్డురావద్దని కోరినా.. తమ డ్యూటీ తమను చేసుకోనివ్వాలని డీఆర్ఐ అధికారులు ఎంత చెప్పినా వినిపించుకోకుండా వారిపై గూండాగిరీ ప్రదర్శించారు. అసలు ‘మిమ్మల్ని ఎవరు పంపించారు’ అంటూ అధికారులపై రుబాబు చేశారు. ఒక దశలో డీఆర్ఐ అధికారి చేయిని సీఎం రమేష్ తోసేసి మరీ హెచ్చరించారు. దాడులు ఆపేసి వెనుదిరిగి వెళ్లే వరకూ తాము ఇక్కడ నుంచి వెళ్లబోమంటూ భీషి్మంచుకొని కూర్చున్నారు. అక్కడకు వచ్చిన టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడుతూ అధికారులను నానా దుర్భాషలాడారు. తమ డ్యూటీని అడ్డుకోవడం సరికాదని, ఎవరి ఒత్తిళ్లతో తాము తనిఖీలకు రాలేదని, తమ విధి నిర్వహణలో భాగంగానే వచ్చామని అధికారులు ఎంత చెబుతున్నా వినకుండా అధికారులను బెదిరించి పెద్దపెద్దగా అరుస్తూ వారిపై దౌర్జన్యానికి దిగారు. ఆయన ప్రవర్తనతో హతాశులైన అధికారులు భయబ్రాంతులకు గురయ్యారు. -
టైల్స్ దుకాణంలో చోరీ
రూ.2.60 లక్షల సొత్తు అపహరణ నెల్లూరు(క్రైమ్): డీఎస్ఆర్ ఆస్పత్రి సమీపంలోని ఓ టైల్స్ షాపు షట్టర్ తాళాలు పగులకొట్టి దుండగులు చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ.2.60 లక్షల సొత్తు అపహరించుకుపోయిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. నేతాజీనగర్ రెండో వీధికి చెందిన అయాజ్‌పూర్ భాస్కర్ ఐదేళ్లుగా దివ్యసాయి ఏజెన్సీ పేరుతో టైల్స్ విక్ర య దుకాణం నిర్వహిస్తున్నారు. రోజూ ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి వరకు షాపు తెరిచి ఉంటుంది. గురువారం రాత్రి టైల్స్ విక్రయం ద్వారా వచ్చిన నగదును బ్యాగ్‌లో పెట్టి క్యాష్‌కౌంటర్‌లో భద్రపర్చారు. టైల్స్ లోడ్ శుక్రవారం వస్తున్న నేపథ్యంలో వారికి చెల్లించేందుకు దుకాణంలోనే డబ్బు ఉంచి ఇంటికి వెళ్లారు. శుక్రవారం ఉదయం భాస్కర్ దుకాణానికి వచ్చి చూడగా షాపు తాళాలు తెరచి ఉన్నాయి. షట్టర్‌పైకిలేపి చూడగా క్యాష్‌కౌంటర్ బాక్స్ బల్లపై ఉంది. బ్యాగ్‌లో నగదు లేదు. అక్కడే ఉన్న వాచ్‌మన్‌ను అడిగారు. ఆయన తనకు తెలియదని చెప్పడంతో వెంటనే ఐదోనగర పోలీసులకు సమాచారం అందించారు. ఇన్స్పెక్టర్ పి. సుబ్బారావు, ఎస్సై వైవీ సోమయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం వేలిముద్రలను సేకరించింది. చోరీ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాగా తెలిసిన వారే చోరీ చేసి ఉంటారనే అనుమానంతో పోలీసులు విచారణ సాగిస్తున్నారు.