breaking news
Tianjin
-
టియాంజిన్ లో ల్యాండ్ అయిన ప్రధాని మోదీ
-
చైనాలో అడుగుపెట్టిన మోదీ
తియాంజిన్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏడేళ్ల తర్వాత చైనాలో అడుగుపెట్టారు. జపాన్‌లో రెండు రోజుల పర్యటన ముగించుకొని శనివారం సాయంత్రం చైనాకు చేరుకున్నారు. ఉత్తర చైనాలోని తియాంజిన్‌లో ఆదివారం, సోమవారం జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తోపాటు ఇతర దేశాల అధినేతలతో సమావేశమవుతారు. తియాంజిన్‌లో మోదీకి ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు సంప్రదాయ రీతిలో సంగీత, నృత్య కార్యక్రమాలతో స్వాగతం పలికారు. జిన్‌పింగ్‌తోపాటు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం భారత్, చైనా కలిసికట్టుగా పనిచేయాలని, పరస్పరం సహకరించుకోవాలని మోదీ పేర్కొన్న సంగతి తెలిసిందే. భారత ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం 50 శాతం టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో భారత్, చైనా మధ్య సంబంధాలు బలపడుతుండడం, మోదీ–జిన్‌పింగ్ భేటీ అవుతుండడాన్ని ప్రపంచదేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ప్రధాని మోదీ చివరిసారిగా 2018లో చైనాలో పర్యటించారు. ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. అలాగే చైనా అధినేత జిన్‌పింగ్ 2019 అక్టోబర్‌లో భారత్‌లో పర్యటించారు. గణనాథుడి చిత్రాన్ని షేర్ చేసిన చైనా ప్రధాని మోదీ చైనా పర్యటన నేపథ్యంలో భారత్‌లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూ జింగ్.. వినాయకుడి ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇరుదేశాలు కళలు, విశ్వాసం, సంస్కృతులను పంచుకున్నాయని వెల్లడించారు. ఇవి చైనాలోని టాంగ్ రాజవంశం కాలంలో, మొగావో గుహల్లోని గణనాథుడి ప్రతిమలు అని పేర్కొన్నారు. భారత్, చైనా మధ్య శతాబ్దాలుగా బలమైన సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని చెప్పడానికి ఇవి అద్భుతమైన ప్రతీకలు అని యూ జింగ్ స్పష్టంచేశారు. #WATCH | Prime Minister Narendra Modi receives a warm welcome as he arrives at a hotel in Tianjin, China. Chants of 'Bharat Mata ki jai' and 'Vande Mataram' raised by members of the Indian diaspora.(Video: ANI/DD) pic.twitter.com/hiXQYFqm07— ANI (@ANI) August 30, 2025 -
పుతిన్, మోదీలకు జిన్‌పింగ్ రెడ్ కార్పెట్
బీజింగ్: ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు చైనాలోని టియాంజిన్‌లో జరగనున్న షాంఘై సహకార సదస్సు(ఎస్సీవో) సందర్భంగా కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ శిఖరాగ్రానికి రావాలంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీలను రెడ్ కార్పెట్ పరిచి జిన్‌పింగ్ స్వయంగా ఆహా్వనం పలకనున్నారు. బ్రిక్స్ దేశాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ వాణిజ్య యుద్ధం తీవ్రరూపం దాల్చిన వేళ అమెరికా ఆధిపత్యానికి గండికొట్టడంతోపాటు, ప్రత్యామ్నాయం తామేనని చూపేందుకు జిన్‌పింగ్ ప్రయత్నం చేయనున్నారు. ఈ సదస్సుకు మధ్య, పశ్చిమ, దక్షిణ, ఆగ్నేయ ఆసియా దేశాల నేతలు పాల్గొననున్నారు. మరో వారంలో మొదలయ్యే కీలక సదస్సులో ఎస్సీవోలో మరికొన్ని దేశాలను చేర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయని పరిశీలకులు అంటున్నారు. ‘అమెరికా నేతృత్వంలోని అంతర్జాతీయ క్రమం ఎలా దారుణంగా ఉంటుందో చెప్పడంతోపాటు, జనవరి నుంచి చైనా, ఇరాన్, రష్యా, తాజాగా భారత్‌ను కట్టడి చేసేందుకు వైట్ హౌస్ చేసిన ప్రయత్నాలు అంతగా ప్రభావం చూపలేదని చూపడానికి ఈ శిఖరాగ్ర సమావేశాన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలని జిన్‌పింగ్ భావిస్తున్నారు’అని ది చైనా–గ్లోబల్ సౌత్ ప్రాజెక్ట్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎరిక్ ఒలాండర్ విశ్లేషించారని రాయిటర్స్ పేర్కొంది. అమెరికా విధానాలకు వ్యతిరేకంగా ఐక్య వేదికను చూపుకునేందుకు, బహుళ ధ్రువ క్రమం దిశగా ప్రపంచం సాగుతోందని తెలియజేయడమే చైనా లక్ష్యంగా కనిపిస్తోందని అంటున్నారు. అంతర్జాతీయంగా ఇటీవల చోటుచేసుకున్న దౌత్యపరమైన పరిణామాలు, బ్రిక్స్ దేశాల మధ్య బలోపేతమవుతున్న ఆర్థిక సంబంధాలను ప్రస్తావించిన ఒలాండర్..ఇవన్నీ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న అనూహ్య చర్యల ఫలితమేనన్నారు. ఎస్సీవోలో ప్రస్తుతం 10 శాశ్వత సభ్య దేశాలు, మరో 16 దేశాలు పరిశీలక హోదాలో ఉన్నాయి. ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో సహకార దృక్పథానికి ఉన్న ప్రాముఖ్యాన్ని ఇవి తెలియజేస్తున్నాయని ఒలాండర్ పేర్కొన్నారు. సభ్య దేశాల సంఖ్య పెరిగినప్పటికీ దేశాల మధ్య సహకారం పరంగా చూస్తే బ్రిక్స్ మంచి ఫలితాలను రాబట్టలేకపోతోందని తక్షశిల ఇన్స్టిట్యూట్కు చెందిన మనోజ్ కేవల్రమణి రాయిటర్స్‌తో వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఎస్సీవో లక్ష్యం, ఆచరణాత్మక వైఖరి ఇప్పటికీ అస్పష్టంగానే ఉన్నాయని ఆయన తెలిపారు. మొత్తమ్మీద అమెరికా విధానాలకు వ్యతిరేకంగా ఉమ్మడి ప్రయోజనాలను సాధించుకోవడమనేదే ఎస్సీవో ప్రధాన లక్ష్యంగా ఉందని చెప్పారు. సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడమే ఈ వేదిక లక్ష్యం అయినప్పటికీ, చైనా–భారత్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను సడలించేందుకు ఇది ఉపయోగపడనుందని తెలిపారు. భారత్ మంకుపట్టును వీడి చైనాతో సామరస్యంగా వ్యవహరిస్తుందని ఒలాండర్ అంచనా వేశారు. తద్వారా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ శిఖరాగ్రం సందర్భంగా భారత్–చైనాలు సరిహద్దుల్లోని ఉద్రిక్త ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణతోపాటు వీసా నియంత్రణలు, వాణిజ్య సంబంధాల బలోపేతానికి సంబంధించిన కీలకమైన ప్రకటనలు చేయవచ్చని తెలిపారు. వాతావరణ మార్పుల వంటి అంశాల్లో రెండు దేశాల మధ్య సహకారం విస్తృతం కానుందన్నారు. భద్రతా పరమైన అంశాల్లో ఎస్సీవో సాధించే పురోగతి మాత్రం పరిమితంగానే ఉంటుందని కేవల్రమణి విశ్లేషించారు. 2001లో ఎస్సీవోను ప్రకటించాక జరుగుతున్న అతిపెద్ద శిఖరాగ్రం ఇదే. అంతర్జాతీయ వ్యవహారాల్లో పెరుగుతున్న ఈ కూటమి ప్రాధాన్యతను చెప్పకనే చెబుతుందని పరిశీలకులు అంటున్నారు. కొత్త ప్రపంచ క్రమతను చాటే ముఖ్యమైన వేదిక ఎస్సీవో శిఖరాగ్రమని చైనా విదేశాంగ శాఖ తాజాగా అభివర్ణించడం గమనార్హం. -
ఐస్‌క్రీమ్ బాక్సుల్లో కరోనా
బీజింగ్: కరోనా వైరస్ జాడలున్న 4,800 ఐస్‌క్రీం బాక్సులను చైనా అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమై ఈ వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందరికి వ్యాపించింది? అనే విషయాలపై ఆరా తీసే పనిలో పడ్డారు. ఈ ఘటన చైనా ఈశాన్య ప్రాంతంలోని టియాన్జియాన్ మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. స్థానిక టియాన్జిన్ డకియావోడావో ఫుడ్ కంపెనీలో తయారైన ఐస్‌క్రీం శాంపిళ్లను పరీక్షించగా కరోనా వైరస్ ఆనవాళ్లు బయటపడ్డాయి. దీంతో బట్వాడా కాని 2,089 ఐస్‌క్రీం బాక్సులను కంపెనీ స్టోర్ రూంలోనే సీల్ వేసి ఉంచారు. మిగతా, 1,812 ఐస్‌క్రీం బాక్సులు వివిధ ప్రావిన్సులకు, 935 బాక్సులు స్థానిక మార్కెట్‌కు పంపిణీ కాగా అందులో 65 మాత్రం అమ్ముడు పోయినట్లు తేలింది. సరఫరా అయిన ప్రాంతాల్లో విచారణ చేపట్టి, వాటి ద్వారా ఎవరికైనా వైరస్ సోకిందా అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. దీంతోపాటు ఆ ఐస్‌క్రీం ఫ్యాక్టరీలోని 1,662 మంది ఉద్యోగులను సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉండాలని ఆదేశించారు. ఆ కంపెనీ ఐస్‌క్రీం తయారీలో వాడిన పాలపదార్థాలు ఉక్రెయిన్, న్యూజిల్యాండ్ నుంచి వచ్చినట్లు గుర్తించిన ఆరోగ్య శాఖ అధికారులు..అవి ఎలా వచ్చాయో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బాక్సుల్లో వైరస్ ఘటనపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని యూకేలోని లీడ్స్ యూనివర్సిటీ వైరాలజిస్టు గ్రిఫ్ఫిన్ అన్నారు. -
అచ్చు మనిషి లాగే.. వైరల్ వీడియో
బీజింగ్: ఓ విచిత్ర వానరం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మనుషులను పోలినట్లుగా వానరం తల ఉండటంతో జూలో ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నెటిజన్లు కామెంట్లు చేస్తూ వీడియోను షేర్ చేస్తున్నారు. ఐదు రోజుల్లోనే కోటి మందికి పైగా వ్యూస్ రావడం గమనార్హం. చైనాలోని టియాంజిన్ నగరంలోని జూలో ఈ కోతి ఉంది. 18 ఏళ్ల ఈ వానరం స్పెషాలిటీ ఏంటంటే.. మనుషుల తల మాదిరిగా దీని తల ఉండటమే. ముక్కు, కళ్లు, నోరు అలాగే ఉండటంతో నెటిజన్లు ఈ వీడియోపై భారీ స్థాయిలో స్పందిస్తున్నారు. కొందరమైతే మనిషికి కోతి వేషం వేశారా అని అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, మరికొందరు నెటిజన్లు మాత్రం జూ పర్యవేక్షకుడు కోతిలా వేషం వేయలేదు కదా అంటూ కామెంట్ చేశారు. మనిషి కోతి నుంచే వచ్చాడంటూ ఎక్కువ మంది నెటిజన్లు తమ అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. -
విచిత్ర వానరం...అచ్చు మనిషి లాగే!
-
ష్! ఇది లైబ్రరీ!
లైబ్రరీలో ఎవరైనా పుస్తకంలా ఉండాల్సిందే. అంటే... సైలెన్స్‌గా ఉండాల్సిందే. కానీ చైనాలోని ఈ అధునాతన గ్రంథాలయ భవంతిలోకి అడుగుపెడితే మాత్రం ఎవరూ సైలెంటుగా ఉండలేరు! వెళ్లీవెళ్లగానే ‘వావ్’ అని ఆశ్చర్యపోతారు. తర్వాత ‘అమేజింగ్’ అనేస్తారు. పుస్తకం ప్రపంచాన్ని మన కళ్ల ముందు ఉంచుతుంది అంటారు. ఈ మాట నెదర్లాండ్స్‌లోని ఆర్కిటెక్చర్ సంస్థ ఎంవీఆర్డీవీకి బాగా తెలుసు అనిపిస్తోంది ఫొటోలో ఉన్న బిల్డింగ్‌ను చూస్తే. చైనాలోని తియాన్జిన్లో ఉన్న ఈ భవనం ఓ లైబ్రరీ కావడం ఒక విశేషమైతే... దూరం నుంచి చూస్తే ఇది ఓ కంటిని తలపించడం మరో వినూత్నమైన విషయం. భవనం మధ్యభాగంలో కనుగుడ్డును పోలిన ఓ గోళాకారపు నిర్మాణం ఉంటుంది. పూర్తిగా అద్దాలతో కట్టిన ఈ గోళాకారం చుట్టూ పిల్లలు, వయసు మళ్లినవారు కూర్చొని చదువుకోడానికి వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. అద్దాల గోళం లోపలిభాగంలో ఓ ఆడిటోరియం ఉంటుంది. 34,200 చదరపు మీటర్ల వైశాల్యమున్న ఈ గ్రంథాలయంలో మొత్తం ఐదంతస్తులు ఉన్నాయి. సెల్లార్ ప్రాంతంలో పుస్తకాలు భద్రపరిచేందుకు అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయి. ఇక గ్రౌండ్ ఫ్లోర్లో చిన్నపిల్లలు, వయసుమళ్లిన వారి కోసం ఏర్పాట్లుంటే... ఒకటి, రెండవ అంతస్తుల్లో రీడింగ్ రూమ్స్, విశ్రాంతి గదులు ఉన్నాయి. పై అంతస్తులు రెండింట్లో కంప్యూటర్, ఆడియో గదులు, కార్యాలయాలు, మీటింగ్ రూమ్స్ ఉన్నాయి. 1,20,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో జర్మన్ సంస్థ జీఎంపీ నిర్మిస్తున్న కల్చరల్ సెంటర్లో ఒక భాగం ఈ లైబ్రరీ. బిన్హాయి ప్రాంతం ప్రజలకు ఒక మీటింగ్ పాయింట్‌గా రూపొందుతున్న ఈ కల్చరల్ సెంటర్లో మరో మూడు భవంతులుంటాయి. నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. వచ్చే ఏడాదికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని అంచనా. -
ఘోర రోడ్డు ప్రమాదం..26 మంది దుర్మరణం
బీజింగ్: ఉత్తర చైనాలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 26 మంది మరణించగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. టియాంజిన్ పట్టణానికి దగ్గరలోని హైవే మీద వేగంగా వెళుతున్న వాహనం అదుపుతప్పి ఎక్స్ ప్రెస్ వే రైలింగ్ ను ఢీ కొట్టి పక్కనే ఉన్న కాలువలో పడింది. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు తీవ్రంగా గాయపడిన నలుగురిని ఆసుపత్రికి తరలించారు. ఎక్స్ ప్రెస్ వేకు కిందవున్న కాలువలో నుంచి శవాలను వెలికితీస్తున్నారు. ఉత్తర హోబెయ్ ప్రావిన్సు నుంచి ఈశాన్యాన ఉన్న షెన్యాంగ్ నగరానికి 30మందితో బస్సు బయలుదేరింది. రోడ్డుకు ఓ వైపు అంచున్న నడుస్తున్న వాహనం టైరు ఒక్కసారిగా పంక్చర్ కావడంతో బస్సు అదుపు తప్పి ఎక్స్ ప్రెస్ వే రైలింగ్ ను ఢీకొని కాలువలో పడినట్లు గాయాలపాలైన నలుగురు ప్రయాణీకులు తెలిపారు. కాగా, యాక్సిడెంట్లలో ప్రతి ఏటా 2,50,000 మంది చైనీయులు మరణిస్తున్నారు. సుదూర ప్రయాణాలను తక్కువ ధరలకే అందిస్తూ అక్కడి రవాణా సంస్థలు పోటీపడుతుంటాయి. -
'నేను తిరిగి రాకుంటే మా డాడీ మీడాడీ అనుకో'
తియాంజిన్: భారీ స్థాయిలో ఎగిసిపడుతున్న మంటలు ఆ అగ్నిమాపక సిబ్బందిని భస్మం చేశాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు ముప్పై మందికి పైగా ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు వెళ్లి మృత్యువాత పడ్డారు. ఇది చైనాలో చోటుచేసుకున్న ఘటన. తియాంజిన్ పట్టణంలో రసాయన పదార్థాల పేలుళ్లు సంభవించి భారీ స్థాయిలో అగ్నికీలలు ఎగిసిపడిన విషయం తెలిసిందే. ఒక పెద్ద హైడ్రోజన్ బాంబు వేశారా ఆ ప్రాంతంలో అన్నంత పెద్దగా మంటలు వ్యాపించాయి. దీంతో వాటిని నిలువరించేందుకు చైనా అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. కానీ వారిలో కొందరు దురదృష్టవశాత్తు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. వారు చెప్తున్న అధికారిక లెక్కల ప్రకారం 21 మంది సిబ్బంది అగ్నికీలలకు ఆహుతి అయ్యారని చెప్తున్నా 36 మంది కనిపించడం లేదని వారంతా అందులోనే చిక్కుకుపోయారని మరికొందరు చెప్తున్నారు. ఇంతపెద్దమొత్తంలో అగ్నిమాపక సిబ్బంది చనిపోవడం చైనాలో 1949 తర్వాత ఇదే తొలిసారి. మంటల్లో చిక్కుకున్న కొందరు అగ్నిమాపక సిబ్బందిలో కొందరు 'నేను ప్రాణాలతో తిరిగి రాకుంటే మా డాడీ ఇక మీ డాడీ అనుకో.. నాకుటుంబం నీ కుటుంబం అనుకో.. నా స్నేహం మరో జన్మకు కూడా నీతోనే ఉండాలని కోరుకుంటున్నా' అంటూ వారి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు మెస్సేజ్‌లు పంపిచారు. -
చేపలతో విందు.. పసందు..
చూస్తేనే తెలియడం లేదా.. విశేషమేంటో.. చేపలతో కలిసి డిన్నర్.. చైనాలోని టియాన్జిన్లో ఉన్న పోలార్ ఓషియన్ వరల్డ్‌కు వెళ్తే.. మనమూ ఈ వినూత్న అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. ఓషియన్ వరల్డ్‌లో నీటి అడుగున ఈ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఓషియన్ వరల్డ్‌లో అన్ని రకాల చేపలతోపాటు తాబేళ్లు, మంచు ఎలుగుబంట్లు కూడా ఉన్నాయి. చేపలను చూస్తూ.. ప్లేట్లోని చేపలను లాగించేయొచ్చన్నమాట.