
వచ్చే వారం చైనాలో జరగనున్న ఎస్‌సీవో శిఖరాగ్రం
ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యతను చాటే యత్నం
హాజరుకానున్న బ్రిక్స్, ఆసియా దేశాల నేతలు
బీజింగ్: ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు చైనాలోని టియాంజిన్‌లో జరగనున్న షాంఘై సహకార సదస్సు(ఎస్‌సీవో) సందర్భంగా కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ శిఖరాగ్రానికి రావాలంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీలను రెడ్ కార్పెట్ పరిచి జిన్‌పింగ్ స్వయంగా ఆహా్వనం పలకనున్నారు.
బ్రిక్స్ దేశాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ వాణిజ్య యుద్ధం తీవ్రరూపం దాల్చిన వేళ అమెరికా ఆధిపత్యానికి గండికొట్టడంతోపాటు, ప్రత్యామ్నాయం తామేనని చూపేందుకు జిన్‌పింగ్ ప్రయత్నం చేయనున్నారు. ఈ సదస్సుకు మధ్య, పశ్చిమ, దక్షిణ, ఆగ్నేయ ఆసియా దేశాల నేతలు పాల్గొననున్నారు. మరో వారంలో మొదలయ్యే కీలక సదస్సులో ఎస్‌సీవోలో మరికొన్ని దేశాలను చేర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయని పరిశీలకులు అంటున్నారు.
‘అమెరికా నేతృత్వంలోని అంతర్జాతీయ క్రమం ఎలా దారుణంగా ఉంటుందో చెప్పడంతోపాటు, జనవరి నుంచి చైనా, ఇరాన్, రష్యా, తాజాగా భారత్‌ను కట్టడి చేసేందుకు వైట్ హౌస్ చేసిన ప్రయత్నాలు అంతగా ప్రభావం చూపలేదని చూపడానికి ఈ శిఖరాగ్ర సమావేశాన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలని జిన్‌పింగ్ భావిస్తున్నారు’అని ది చైనా–గ్లోబల్ సౌత్ ప్రాజెక్ట్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎరిక్ ఒలాండర్ విశ్లేషించారని రాయిటర్స్ పేర్కొంది.
అమెరికా విధానాలకు వ్యతిరేకంగా ఐక్య వేదికను చూపుకునేందుకు, బహుళ ధ్రువ క్రమం దిశగా ప్రపంచం సాగుతోందని తెలియజేయడమే చైనా లక్ష్యంగా కనిపిస్తోందని అంటున్నారు. అంతర్జాతీయంగా ఇటీవల చోటుచేసుకున్న దౌత్యపరమైన పరిణామాలు, బ్రిక్స్ దేశాల మధ్య బలోపేతమవుతున్న ఆర్థిక సంబంధాలను ప్రస్తావించిన ఒలాండర్..ఇవన్నీ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న అనూహ్య చర్యల ఫలితమేనన్నారు.
ఎస్‌సీవోలో ప్రస్తుతం 10 శాశ్వత సభ్య దేశాలు, మరో 16 దేశాలు పరిశీలక హోదాలో ఉన్నాయి. ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో సహకార దృక్పథానికి ఉన్న ప్రాముఖ్యాన్ని ఇవి తెలియజేస్తున్నాయని ఒలాండర్ పేర్కొన్నారు.
సభ్య దేశాల సంఖ్య పెరిగినప్పటికీ దేశాల మధ్య సహకారం పరంగా చూస్తే బ్రిక్స్ మంచి ఫలితాలను రాబట్టలేకపోతోందని తక్షశిల ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన మనోజ్ కేవల్‌రమణి రాయిటర్స్‌తో వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఎస్‌సీవో లక్ష్యం, ఆచరణాత్మక వైఖరి ఇప్పటికీ అస్పష్టంగానే ఉన్నాయని ఆయన తెలిపారు. మొత్తమ్మీద అమెరికా విధానాలకు వ్యతిరేకంగా ఉమ్మడి ప్రయోజనాలను సాధించుకోవడమనేదే ఎస్‌సీవో ప్రధాన లక్ష్యంగా ఉందని చెప్పారు.
సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడమే ఈ వేదిక లక్ష్యం అయినప్పటికీ, చైనా–భారత్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను సడలించేందుకు ఇది ఉపయోగపడనుందని తెలిపారు. భారత్ మంకుపట్టును వీడి చైనాతో సామరస్యంగా వ్యవహరిస్తుందని ఒలాండర్ అంచనా వేశారు. తద్వారా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ శిఖరాగ్రం సందర్భంగా భారత్–చైనాలు సరిహద్దుల్లోని ఉద్రిక్త ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణతోపాటు వీసా నియంత్రణలు, వాణిజ్య సంబంధాల బలోపేతానికి సంబంధించిన కీలకమైన ప్రకటనలు చేయవచ్చని తెలిపారు.
వాతావరణ మార్పుల వంటి అంశాల్లో రెండు దేశాల మధ్య సహకారం విస్తృతం కానుందన్నారు. భద్రతా పరమైన అంశాల్లో ఎస్‌సీవో సాధించే పురోగతి మాత్రం పరిమితంగానే ఉంటుందని కేవల్‌రమణి విశ్లేషించారు. 2001లో ఎస్‌సీవోను ప్రకటించాక జరుగుతున్న అతిపెద్ద శిఖరాగ్రం ఇదే. అంతర్జాతీయ వ్యవహారాల్లో పెరుగుతున్న ఈ కూటమి ప్రాధాన్యతను చెప్పకనే చెబుతుందని పరిశీలకులు అంటున్నారు. కొత్త ప్రపంచ క్రమతను చాటే ముఖ్యమైన వేదిక ఎస్‌సీవో శిఖరాగ్రమని చైనా విదేశాంగ శాఖ తాజాగా అభివర్ణించడం గమనార్హం.