breaking news
third floor
-
Kuchipudi: మూడుతరాల నాట్యోత్సాహం
అది ఆదివారం సాయంత్రం. రవీంద్రభారతి ఆడిటోరియం. అందెలరవళి మధ్య శ్లోక ఆరంగేట్రం. కూచిపూడి సాధనలో మూడవతరం ఆమెది. పదహారేళ్ల నాట్యసాధనకు ప్రతీక ఆ అరంగేట్రం. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో మొన్నటి రోజున ఆరంగేట్రం చేసిన శ్లోకారెడ్డి కూచిపూడి నాట్యసాధనను తన ఆరవ ఏట మొదలు పెట్టింది. పదకొండవ ఏట ‘బాల చైతన్య అకాడమీ అవార్డు’ అందుకుంది. నాట్యమే శ్వాసగా అడుగులు వేస్తూ గడిచిన బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ‘భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నుంచి సీసీఆర్టీ స్కాలర్షిప్కు ఎంపిక కావడం గర్వకారణంగా భావిస్తున్నట్లు’ చెప్పారు. ఆరంగేట్రం సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. ‘‘నా నాట్యగురువు అమ్మే. అమ్మ దీపాంజలి నాట్యసంస్థను ప్రారంభించి నాట్యంలో శిక్షణతోపాటు నాట్య ప్రదర్శనలు ఇస్తోంది. అలా నాకు ఆ ప్రదర్శనల్లో నాట్యం చేసే అవకాశం దక్కింది. గోదాకల్యాణం, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రారంభోత్సవం సందర్భంగా నాట్య ప్రదర్శన, జీ ట్వంటీ సదస్సు, గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్, ప్రపంచ తెలుగు మహాసభలు, రాజ్‌భవన్, ఖజురహో, హంపి, నిశగంధి, కింకిణి డాన్స్ ఫెస్టివల్స్, త్యాగబ్రహ్మ గానసభ, దుబాయ్‌లో భారత పర్యాటక రంగం ప్రదర్శన, భారత 70వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకల సందర్భంగా టర్కీలోని ఇండియన్ ఎంబసీ నిర్వహించిన కార్యక్రమం, లెజెండరీ పర్సనాలిటీ మ్యాస్ట్రో పండిట్ బిర్జు మహారాజ్ డాన్స్ ఫెస్టివల్ ... ఇలా అమ్మతోపాటు, ఆమె ఆధ్వర్యంలో లెక్కలేనన్ని ప్రదర్శనల్లో నాట్యం చేయగలిగాను. అమ్మ ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రదర్శనల్లో నేను కూడా వేదికమీద ఉండడం వల్ల చాలా నేర్చుకున్నాను. శిక్షణ సమయంలో, వేదిక మీద ప్రదర్శనలిచ్చేటప్పుడు మాత్రమే గురువు. క్లాస్ నుంచి బయటకు వచ్చి ఇంట్లో అడుగుపెట్టగానే అమ్మలోని గురువు మాయమై అమ్మ బయటకు వస్తుంది. మేము ఏం తినాలి, హోమ్‌వర్క్ గురించి తెలుసుకుని మర్నాటి స్కూల్‌కి సిద్ధం చేయడంలో మునిగిపోయేది. అమ్మ బాగా గారం చేస్తుంది, కానీ నాకు నాన్న దగ్గరే ఎక్కువ చనువు. అమ్మమ్మ అడుగుజాడల్లో మా ఇంట్లో నాట్యసాధనకు అంకితమైన మూడవ తరం నాది. మా అమ్మమ్మ రాధిక, అమ్మ దీపిక, నేను. మేము ముగ్గురమూ ఒకే వేదిక మీద కనిపించడం సంతోషకరం. రుద్రమదేవి, భద్రకాళి అష్టకం, గోదాదేవి, కృష్ణలీలలు ప్రదర్శించాను. అమ్మమ్మ రవీంద్రభారతి ప్రారంభోత్సవ కార్యక్రమం(1961, మే, 11వ తేదీ) లో నాట్యప్రదర్శన ఇచ్చింది. ఇప్పుడు అదే వేదిక మీద నా ఆరంగేట్రం జరగడం నా అదృష్టం. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భరతనాట్య కళాకారిణి పద్మభూషణ్ గ్రహీత అలర్మేల్వల్లి గారు రావడం నా పూర్వజన్మ సుకృతం. మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే... నాకు సమాజం పట్ల శ్రద్ధ కలగడానికి కారణం కూడా నాట్యమే. నాట్యం గొప్ప మాధ్యమం. ఈ మాధ్యమం ద్వారా పౌరాణిక, ఇతిహాసాలతోపాటు జాతీయాంశాలు, సామాజికాంశాలను కూడా సామాన్యులకు చేరవేయగలుగుతాం. ఒక కొత్త ఇతివృత్తాన్ని రూపొందించడానికి సమాజాన్ని చదువుతాం. కాబట్టి సమాజంలో ఉండే సమస్యలు అవగతమవుతాయి. వాటి మీద నాట్య రూపకాన్ని ప్రదర్శించి అంతటితో మిన్నకుండిపోవడం స్వార్థమే అవుతుంది. కళాకారులుగా మేము సమాజానికి మా వంతుగా తిరిగి ఇవ్వాలి కూడా. మన సమాజంలో సాంస్కృతిక కళల పట్ల ఆసక్తి ఉండి కూడా ప్రోత్సాహం కరవైన వాళ్లెంతోమంది ఉన్నారు. వాళ్లలో కొందరికైనా నేను చేయగలిగిన సహాయం చేయాలనేది నా కోరిక. కోవిడ్ సమయంలో వైద్యరంగంలో పనిచేసే వారి పట్ల సానుకూలంగా వ్యవహరించడం మీద చేసిన నాట్యరూపకం యూ ట్యూబ్‌లో బాగా వైరల్ అయింది. ప్రకృతి పరిరక్షణ, ప్రపంచశాంతి కోసం నాట్య రూపకాలను రూపొందిస్తున్నాను. లలితకళల ఇతివృత్తంగా చిత్రీకరించిన మ్యూజిక్ స్కూల్ ద్విభాషా చిత్రానికి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా లండన్‌కు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆడమ్ మర్రేతో పనిచేయడం నా కెరీర్లో మరో ఆణిముత్యం అనే చెప్పాలి. ఆరంగేట్రంలో రుద్రమ పాత్రను ఎంచుకోవడానికి కారణం మహిళాసాధికారత పట్ల చైతన్యవంతం చేయడం కూడా. నా భవిష్యత్తు రూపకాలు కూడా సమాజం, ప్రకృతితోపాటు మహిళల భద్రత, మహిళాభ్యుదయం మీద ఉంటాయి’’ అని వివరించారు శ్లోకా రెడ్డి. సంగీతమూ ఇష్టమే! నేను పుట్టింది, పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే. పాఠశాల విద్య చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ తర్వాత లండన్‌లో క్వీన్ మేరీ యూనివర్సిటీ నుంచి డిజిటల్ మార్కెటింగ్‌లో మాస్టర్స్ చేశాను. మన కల్చర్ కోసం పనిచేయడం స్కూల్లోనే మొదలైంది. స్కూల్ కల్చరల్ కమిటీకి డిప్యూటీ హెడ్‌ని. డాన్స్, మ్యూజిక్ రెండూ ఇష్టమే. తమ్ముడితోపాటు ఏడేళ్లు కర్ణాటక సంగీతం కూడా సాధన చేశాను. కానీ నా స్ట్రెస్ బస్టర్ మాత్రం బుక్ రీడింగే. ‘స్పందన’ చిల్డ్రన్హోమ్లోని పిల్లలతో గడపడం కూడా నాకిష్టం. ‘యట్–రైజ్’ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ స్థాపించి కళాభిరుచి ఉన్నవారితోపాటు గ్రామాల్లో కనీస అవసరాల కోసం పోరాడుతున్న వాళ్లకు ఆసరాగా నిలుస్తున్నాను. క్లెన్లీనెస్ డ్రైవ్, మెడికల్ క్యాంపులు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో నా వంతుగా కొంతమేర సహకారం అందిస్తున్నాను. – శ్లోకారెడ్డి, కూచిపూడి నాట్యకారిణి – వాకా మంజులారెడ్డి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
చాటింగ్ చేస్తూ... భవనంపై నుంచి పడి..
శంషాబాద్: మూడంతస్తుల భవనంపై నుంచి కిందపడి ఓ ఎయిర్‌పోర్టు ఉద్యోగిని మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రంలోని ముదుళీ ప్రాంతానికి చెందిన సిమ్రాన్ (25) శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని కస్టమర్ సర్వీస్‌లో ఉద్యోగం చేస్తోంది. మంగళవారం సాయంత్రం ఆమె తాను నివసిస్తున్న మూడంతస్తుల భవనం బాల్కనీ పైనుంచి కిందపడింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందింది. అయితే, సిమ్రాన్ ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ రెండు కూడా ఆన్‌లోనే ఉండటంతో చాటింగ్ చేస్తూ కిందపడిందా..? తానే దూకి ఆత్మహత్యకు పాల్పడిందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆమె సోదరుడు మాలిక్ రెహాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పార్లమెంటులో అగ్నిప్రమాదం
దేశ రాజధాని న్యూఢిల్లీలోని పార్లమెంటు భవనంలో శుక్రవారం ఉదయం చిన్నపాటి అగ్నిప్రమాదం సంభవించింది. పార్లమెంటు భవనంలోని మూడో అంతస్థులో ఉదయం 8.40 గంటలకు మంటలు చెలరేగాయి. వెంటనే ఏడు అగ్నిమాపక వాహనాలను సంఘటన స్థలానికి హుటాహుటిన తరలించారు. అక్కడి ఎయిర్ కండిషనర్ల నుంచే మంటటు వచ్చినట్లు అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు తెలిపారు. అయితే, మంటలు కొద్దిస్థాయిలోనే ఉండటంతో సరిగ్గా పది నిమిషాల్లో వాటిని ఆర్పేశారు.