thimmamma marrimanu
-
దయనీయ స్థితిలో తిమ్మమ్మ మర్రిమాను
-
తిమ్మమ్మ మర్రిమాను.. చూసొద్దాం రండి
మండు వేసవిలో పచ్చని చెట్టు కింద కూర్చొని చుట్టూ ఉన్న కొండల నుంచి వీచే చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ఉంటే... ఆహా మజానే వేరు! ఔనని ఒప్పుకుంటారు కదూ... ఇలాంటి అనుభూతులను పంచుతోంది జిల్లాలోని తిమ్మమ్మ అమ్మవారు కొలువైన తిమ్మమ్మ మర్రిమాను. చుట్టూ ఈశ్వరమలై కొండల నడుమ సుమారు తొమ్మిది ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ మహా వృక్షం 1989లో గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించుకుంది. ఆరు శతాబ్ధాలకు పైగా చరిత్ర ఉన్న ఈ మహావృక్షం ఎన్పీకుంట మండలంలోని ఎదురొన పంచాయతీలోని గూటిబైలు గ్రామ సమీపంలో ఉంది. మండల కేంద్రం ఎన్పీ కుంటకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మర్రిమాను వద్దకు చేరుకోవాలంటే కదిరి నుంచి రాయచోటికి వెళ్లే మార్గంలోని రెక్కమాను వద్ద దిగి అక్కడి నుంచి ఆటోలో నాలుగు కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అలాగే కదిరి–మదనపల్లి జాతీయ రహదారిపై కొక్కంటి క్రాస్‌లో దిగి ఆటోలో ప్రయాణించినా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. చరిత్ర ఇలా.. 14వ శతాబ్దంలో పాలెగాళ్ల పాలనలో ఉన్న గంగరాజుల కోటలో ఉన్న బాలవీరయ్యకు బుక్కపట్నం గ్రామానికి చెందిన తిమ్మమ్మతో వివాహమైంది. కాలక్రమంలో కుష్టు వ్యాధి బారిన పడ్డ బాలవీరయ్య... ఊరి శివారులో చిన్న పూరిగుడెసె వేసుకుని జీవనం సాగించారు. ఆ సమయంలో తన భర్తకు తిమ్మమ్మ సేవలు చేస్తూ వచ్చింది. బాలవీరయ్య తనువు చాలిస్తే.. కొక్కటి పాలెగాళ్ల అనుమతితో తిమ్మమ్మ సతీసహగమనం చేసింది. ఆ సమయంలో ఆమె చెప్పిన మాట ప్రకారం అగ్నిగుండానికి ఈశాన్యంలో నాటిన మర్రికొమ్మ ఇగురు వేసి.. నేడు మహా వృక్షమైంది. అప్పటి నుంచి కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా తిమ్మమ్మను భక్తులు కొలుస్తూ వచ్చారు. కాగా, మర్రిమాను వద్ద అటవీశాఖ ఆధ్వర్యంలో జంతు ప్రదర్శనశాల ఏర్పాటు చేశారు. ఇందులో నెమళ్లు, పావురాలు, కుందేళ్లు, జింకలను చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతున్నారు. సందర్శకులు సేదతీరేందుకు పచ్చికబయళ్లు ఉన్నాయి. - ఎన్పీకుంట (కదిరి) -
పేరులో ప్రథమం.. సౌకర్యాలలో అధమం
ఎన్పీకుంట : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిమ్మమ్మమర్రిమాను ప్రాంతం పర్యాటకులకు సౌకర్యాలు కల్పించడంలో అధమంగా మారింది. దేశం నలుమూలల నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి ఎంతో మంది పర్యాటకులు నిత్యం ఇక్కడికి వస్తూనే ఉంటారు. విడిది సౌకర్యం లేకపోవడంతో పర్యాటకులకే కాకుండా తిమ్మమ్మ భక్తుల సైతం అసంతృప్తి చెందుతున్నారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి పర్యాటకులతో పాటు తిమ్మమ్మ భక్తులతో ఈ ప్రాంతం నిత్యం రద్దీగానే ఉంటుంది. అయితే తిమ్మమ్మ భక్తులు తలనీలాలు సమర్పించిన అనంతరం స్నానాలు చేసేందుకు గదులు లేకపోవడంతో ఆరుబయటే చేయాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో మహిళల ఇబ్బందులు వర్ణణాతీతం. తమ ఇంటిల్లిపాదీ భోజనం వండుకోవడానికి వంట గదుల లేకపోవడంతో చెట్లకిందే వంట చేసుకుంటున్నారు. తిమ్మమ్మమర్రిమాను దుకాణాలు ఉండే ప్రాంతంలో సిమెంటు రోడ్లు లేకపోవడంతో కొండల నుంచి వచ్చిన నీటితో నిల్వ ఉండి, మడుగుల్ని తలపిస్తుంటాయి. దీంతో పర్యాటకులు దుకాణాల వద్దకు రావడం లేదు. పర్యాటక శాఖ వారు విడిది గృహాన్ని నిర్మించి పదేళ్లయినా నేటికీ అది ప్రారంభానికి నోచుకోలేదు. జిల్లా అధికారులు వచ్చినప్పుడు మాత్రమే విడిది గృహం తలుపులు తెరుచుకుంటాయి. దీంతో ఒకసారి వచ్చిన పర్యాటకులు మరోసారి రావడానికి ఇష్టపడటం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిమ్మమ్మమర్రిమాను వద్ద మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, పర్యాటకులు కోరుతున్నారు. -
తిమ్మమ్మ మర్రిమానును సందర్శించిన పుంగనూరు జడ్జి
ఎన్పీకుంట (కదిరి) : ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిమ్మమ్మ మర్రిమానును పుంగనూరు జడ్జి మోతీలాల్‌నాయక్ కుటుంబ సమేతంగా ఆదివారం సందర్శించారు. ముందుగా అమ్మవారిని సందర్శించుకొని, ఆతర్వాత అమ్మవారి ఘాట్ చుట్టూ ప్రదక్షిణ చేశారు. చెట్టు వద్ద కూర్చొని అమ్మవారి చరిత్ర, మర్రిమాను ప్రత్యేకతను గైడ్ అనిల్‌తో తెలుసుకున్నారు. ఏఎస్ఐ దేవీశ్రీ రమణ, కానిస్టేబుల్ విజయ్‌నాయక్ తదితరులు ఉన్నారు.