breaking news
tenth paper leakage issue
-
టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసు: మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు
సాక్షి, చిత్తూరు: పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణకు చుక్కెదురయ్యింది. చిత్తూరు కోర్టు బెయిల్ రద్దు చేసింది. నవంబర్ 30లోగా పోలీసులకు లొంగిపోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ రద్దు చేయాలని చిత్తూరు వన్ టౌన్ పోలీసులు పిటిషన్ వేశారు. ఈ కేసులో మొత్తం 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు ప్రభుత్వ టీచర్లు, మిగిలిన వారు నారాయణకు చెందిన స్కూల్ సిబ్బంది ఉన్నారు. చదవండి: కార్పొరేట్ విద్యా మాఫియా అధిపతి నారాయణ చరిత్ర ఇదే.. కాగా, నారాయణ విద్యా సంస్థలపై మొదటి నుంచి వివాదాలున్నాయి. విద్యార్థులపై అధిక ఒత్తిడి తెస్తారనే ఆరోపణలున్నాయి. తమ విద్యాసంస్థల్లో లక్షల మందిని జాయిన్ చేసుకుంటారు. కొంచెం బాగా చదివే వారిని ఎంచుకుంటారు. వారి కోసం పరీక్షల సమయంలో పేపర్ లీకేజీ చేయించి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు తెప్పించి పబ్లిసిటీ చేయించుకోవడం పరిపాటిగా మారిందని అనేకమంది చెబుతున్న మాట. ఆ విద్యాసంస్థల్లో నిర్భంద విద్యతో మానసిక ఒత్తిడికి లోనైన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలున్నాయి. గత టీడీపీ హయాంలోనే పదుల సంఖ్యలో విద్యార్థులు బలవన్మరాణానికి పాల్పడ్డారు. మంత్రిగా ఉన్న నారాయణపై ఎలాంటి కేసుల్లేకుండా చేసుకోవడంపై గత ప్రభుత్వంపై ఆరోపణలొచ్చాయి. -
అసెంబ్లీని కుదిపేసిన లీకేజి వ్యవహారం
పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజి వ్యవహారం ఏపీ అసెంబ్లీని కుదిపేసింది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణలను బర్తరఫ్ చేయాలంటూ వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. ఉదయమే ప్రశ్నపత్రాల లీకేజి వ్యవహారంపై అత్యవసరంగా చర్చించేందుకు మంగళవారం వాయిదా తీర్మానం ఇవ్వగా, దాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం చేపడదామని, ఆ తర్వాత వేరే ఫార్మాట్లో దానిపై చర్చిద్దామని అన్నారు. కానీ ఇది చాలా అత్యవసరమైన విషయం కాబట్టి దీనిపై వెంటనే చర్చించాలని ప్రతిపక్షం డిమాండ్ చేసింది. నెల్లూరులోని నారాయణ స్కూలు సెంటర్ నుంచే పదో తరగతి ప్రశ్నపత్రం లీకైనట్లుగా డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇచ్చిన నివేదికను ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సభలో బయటపెట్టారు. అందులో స్పష్టంగా 4238 నారాయణ స్కూలు సెంటర్లో పేపర్ లీకైనట్లు ఉందని, దాని ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది చాలా ముఖ్యమైన అంశమని, అందువల్ల దానిపై చర్చించాలని ప్రతిపక్ష సభ్యులంతా డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. లీకేజిల ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ మండిపడ్డారు. అయితే ప్రతిపక్ష సభ్యులను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు దీనిపై నోటికి వచ్చినట్లల్లా మాట్లాడారు. ఇదే సందర్భంలో టీడీపీ ఎమ్మెల్యే ఆదిత్య అయితే పూర్తిగా సంయమనం కోల్పోయి ప్రతిపక్ష సభ్యులను దెయ్యాలు, పిశాచులు అటూ వ్యాఖ్యానించారు. దానిపై వైఎస్ఆర్సీపీ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది.