breaking news
temple money
-
స్వామికే శఠగోపం.. అయినోళ్లకు ‘కోట్లు’ ప్రసాదం
సాక్షి, అమరావతి: భక్తులు గుళ్లలో కానుకలుగా సమర్పించే కోట్ల రూపాయలను తమకు కావాల్సిన వారికి దోచి పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిరంతరం ఆలోచన చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా అధికారంలోకి రాగానే దేవదాయ శాఖలో టెండరు నిబంధనలను పూర్తిగా మార్చేసి, రాష్ట్రంలో ఏటా అధిక ఆదాయం వచ్చే ఏడు ప్రధాన ఆలయాల్లో క్లీనింగ్ పనుల నిర్వహణ, ఔట్ సోర్సింగ్ సిబ్బంది సరఫరా కాంట్రాక్టుకు ఉమ్మడిగా టెండర్లు నిర్వహించింది. ప్రభుత్వ ముఖ్య నేతకు బంధువుగా ప్రచారంలో ఉన్న భాస్కరనాయుడికి సంబం«ధించిన పద్మావతి హాస్పిటాలిటీస్ సంస్థకు ఆ పనులు కట్టబెట్టింది. ఇప్పుడు మరో 15 పెద్ద ఆలయాల్లో క్లీనింగ్ పనులను కూడా అదే తరహాలో ఆ సంస్థకు అప్పగించేందుకు సిద్ధమైంది. ఆ 15 ఆలయాలకు కూడా ఉమ్మడిగా టెండర్లు పిలిచేందుకు రెండు రోజుల క్రితం దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఆలయాల ఈవోలతో సమావేశం నిర్వహించారు. తొలి విడతలో ఏడు గుళ్లలో క్లీనింగ్ పనుల కోసం ఉమ్మడిగా టెండర్లు నిర్వహించడం ద్వారా రెండేళ్ల కాలానికి దాదాపు రూ.100 కోట్ల విలువైన పనులను దక్కించుకున్న ఆ సంస్థకు సగానికి సగం మిగులుతుందని అధికార వర్గాల్లో చర్చ ఉంది. తాజాగా 15 గుళ్లకు కూడా ఉమ్మడి టెండర్లు ద్వారా మరో రూ.వంద కోట్లకు పైబడి పనులను ఆ సంస్థకే కట్టబెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. నాడు నిబంధనలు మార్చి కట్టబెట్టేశారు – గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ గుడిలో క్లీనింగ్ పనుల టెండర్లు ఆ గుడి స్థాయిలో వేర్వేరుగా జరిగేవి. చంద్రబాబు ప్రభుత్వం రాగానే ఆ విధానాన్ని మార్చి.. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ దుర్గగుడి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలకు ఉమ్మడిగా టెండర్లు నిర్వహించాలని నిర్ణయించింది. – ఈ ఏడు ప్రధాన ఆలయాలు రూ.60 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు వార్షికాదాయం కలిగి, జాయింట్ కమిషనర్ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఉన్నాయి. ఇప్పుడు ఉమ్మడిగా టెండర్ల నిర్వహణకు కసరత్తు చేస్తున్న 15 ఆలయాలకు ఏటా రూ.10 కోట్లకు పైబడి ఆదాయం ఉంటోంది. ఇవి డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఉన్నాయి. ఒకే సంస్థకు ఇలా ముఖ్యమైన ఆలయాల క్లీనింగ్ పనులు అప్పగించడం చూస్తుంటే ఇది ప్రభుత్వ పెద్దల పనే అని స్పష్టమవుతోంది. – తొలుత ఏడు ఆలయాలను అప్పగించేందుకు గత ఏడాది మే నెలలో దేవదాయ శాఖ టెండర్లు నిర్వహించింది. ఆ టెండర్లలో పేర్కొన్న నిబంధనలు ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన ఆ సంస్థకు అనుకూలంగా లేవని తేలడంతో ఏకంగా ఆ టెండరునే రద్దు చేశారు. తిరిగి నిబంధనలు సవరించి, జూన్‌లో మళ్లీ టెండర్లు పిలిచారు. అందులో పద్మావతి హాస్పిటాలిటీస్ సంస్థనే ఎల్–1గా నిలిచింది. – మరోవైపు.. అప్పుడు ఏడు గుళ్లకు కలిపి ఉమ్మడిగా టెండర్లు నిర్వహించే ప్రక్రియలో కేవలం పెద్ద సంస్థలు మాత్రమే టెండరులో పాల్గొనే అవకాశం ఉండేలా నిబంధనలు మార్చడంతో అంతకు ముందు ఆయా గుళ్లలో వేర్వేరుగా క్లీనింగ్ పనులు నిర్వహించిన సంస్థలు పోటీలో పాల్గొనే అర్హత కోల్పోయాయి. ఉమ్మడి టెండర్ల విధానంలో పోటీ తగ్గడం వల్ల పెద్ద సంస్థలు అధిక ధరకు పనులు పొందేలా ప్రభుత్వమే మార్గ నిర్దేశం చేస్తోంది. – గుళ్లలో పారిశుద్ధ్య పనుల్లో నాణ్యత పెంచేందుకే ఉమ్మడి టెండర్లు నిర్వహించినట్టు ప్రభుత్వం చెప్పుకుంటుండగా.. వాస్తవానికి పనుల నాణ్యత తగ్గిపోయిందని దేవదాయ శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. 20 రోజుల క్రితం విజయవాడ దుర్గ గుడి పరిధిలోని వాష్‌రూంలో ఒక వ్యక్తి చనిపోతే నాలుగు రోజుల తర్వాత ఆ విషయం గుర్తించడం గమనార్హం. అంటే నాలుగు రోజుల పాటు అక్కడ పారిశుధ్య పనులే చేపట్టలేదని స్పష్టమవుతోంది. సరైన పర్యవేక్షణ ఉండి ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టి ఉంటే వెంటనే ఆ ఘటన వెలుగు చూసేదని భక్తులు చెబుతున్నారు. – ఇప్పటికే కట్టబెట్టిన ఏడు ఆలయాలతో పాటు కొత్తగా మరో 15 ఆలయాల్లో పారిశుద్ధ్య పనులను ఒకే సంస్థకు అప్పగిస్తే పనుల పర్యవేక్షణ తగ్గిపోతుందని అధికార వర్గాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ప్రభుత్వ పెద్దల ఆదేశాలను కాదనలేక ఈ విషయంలో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
హుండీ డబ్బులకు లెక్క చెప్పనక్కర్లేదు
న్యూఢిల్లీ: దేవాలయాల హుండీల్లో జమైన డబ్బుల డిపాజిట్లపై ఎలాంటి నిఘా ఉండదని, అది పన్ను పరిశీలన అంశంగా ఉండబోదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ గురువారం ఒక ప్రకటన చేసింది. 'దేవాలయాల్లోని హుండీల్లోకి వచ్చిన సొమ్ము జమ చేసే సమయంలో ఎలాంటి ప్రశ్నలు తలెత్తబోవు. ఈ డబ్బు డిపాజిట్‌కు పరిమితులు లేవు. హుండీల సొమ్ముకు మాత్రమే ఈ మినహాయింపు ఇస్తున్నాం' అని రెవెన్యూ సెక్రటరీ హాస్ముఖ్ అధియా మీడియాకు చెప్పారు. అయితే, ఆలయాల కింద నడుస్తున్న స్వచ్చంద సేవా సంస్థలకు మాత్రం ఈ మినహాయింపు ఉండదన్నారు. వారు డబ్బు జమ చేసే సమయంలో కచ్చితంగా రికార్డులు చూపించాల్సి ఉంటుందని తెలిపారు. దేశంలో రూ.500, రూ.1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న నోట్లను కొత్తగా డిపాజిట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. నల్లధనాన్ని, అవినీతిని అరికట్టే చర్యల్లో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. -
నరసన్న నిధులకు రెక్కలు
బ్యాంకు అకౌంట్ నుంచి రూ.59 లక్షలు విత్‌డ్రా మళ్లీ జమచేయాలని కోరుతున్న భక్తులు రాజానగరం / కోరుకొండ : కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి సొమ్ములకే భద్రత కరువైంది. బ్యాంకులో వేసిన సొమ్ములకు రెక్కలు వచ్చాయి. రూ. 76.37 లక్షలు ఉండవలసిన నిల్వలు రూ. 17 లక్షలకు తరిగిపోయాయి. దేవుడి మాన్యం ఉన్నా కాలక్రమంలో తరిగిపోవడంతో ఆదాయం కూడా తగ్గిపోయింది. దీంతో 2010లో అన్నవరం దేవస్థానం నరసన్న ఆలయాన్ని దత్తత తీసుకుంది. కళ్యాణాలు ఇతర ఉత్సవాల నిర్వహణకు తమ నిధులు వెచ్చించేలా అన్నవరం ఆలయ అధికారులు నిర్ణయించారు. అలాగే రాష్ట్రంలో ఆదాయం తక్కువగా ఉన్న ప్రసిద్ధి చెందిన 25 ఆలయాలను ప్రభుత్వం దత్తత తీసుకుంది. అనంతరం ఈ ఆలయం ద్వారా వచ్చే ఆదాయాన్ని స్వామి పేరున కోరుకొండ ఆంధ్రాబ్యాంకులో డిపాజిట్ చేసేలా అప్పటి అన్నవరం ఈఓ కె.రామచంద్రమోహన్, బోర్డు సభ్యులు నిర్ణయించారు. దీంతో రూ.9 లక్షల నిల్వతో అకౌంట్ ప్రారంభించి ఆలయాన్ని అప్పగించారు. గడిచిన నాలుగేళ్లలో నిధులు రూ.76.37 లక్షలకు చేరినట్టు గత మార్చి నెలలో జరిగిన సమావేశంలో అధికారులు తెలిపారు. కాగా వివిధ ఖర్చుల నిమిత్తం రూ.59 లక్షలను విత్‌డ్రా చేసినట్టు పలువురు భక్తులు పేర్కొన్నారు. కోరుకొండ ఖర్చులన్నీ తామే భరిస్తామన్న తరువాత నిధులు ఎందుకు విత్‌డ్రా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. కోరుకొండ ఆలయానికి పాలకమండలి లేకపోవడమూ ఇందుకు కారణమని వారు ఆరోపిస్తున్నారు. సొమ్ము విత్‌డ్రాలో ఈఓకూ భాగం ఉందని వారు ఆరోపిస్తున్నారు. ఈఓ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు ఈ విషయమై ఈఓను వివరణ కోరగా నేను ఎవరికీ చెప్పనక్కరలేదు, ఎమ్మెల్యేకి కానీ, కమిషనర్‌కు గానీ వివరిస్తానని నిర్లక్ష్యంగా సమాధానమి స్తున్నారు. మీకు కూడా కావాలంటే అన్నవరం రావాలంటున్నారు. ఆలయ దత్తత సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఖర్చులు అన్నవరం దేవస్థానమే భరించాలి. – నీరుకొండ యుధిష్టర నాగేశ్వరావు, భక్తుడు, కోరుకొండ.


