స్వామికే శఠగోపం.. అయినోళ్లకు ‘కోట్లు’ ప్రసాదం | Chandrababu Govt Looting Temple money with Tenders in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

స్వామికే శఠగోపం.. అయినోళ్లకు ‘కోట్లు’ ప్రసాదం

May 3 2026 4:44 AM | Updated on May 3 2026 4:44 AM

Chandrababu Govt Looting Temple money with Tenders in Andhra Pradesh

ఆలయాల సొమ్మును యథేచ్ఛగా కొల్లగొడుతున్న సర్కారు పెద్దలు

ప్రభుత్వ పెద్ద.. బంధువు సంస్థకు ఏడు ఆలయాల్లో పారిశుద్ధ్య పనులు 

రెండేళ్లలో రూ.100 కోట్లు చెల్లించేలా ఒప్పందం 

టెండర్‌ నిబంధనలు అనుకూలంగా మార్చి ఏడాది క్రితమే కట్టిబెట్టిన వైనం 

ఇప్పుడు అదే సంస్థకు మరో 15 ఆలయాలు అప్పగించేందుకు రంగం సిద్ధం 

త్వరలో ఉమ్మడిగా టెండర్లు నిర్వహించేందుకు కసరత్తు 

ఫలితంగా మరో రూ.100 కోట్లు ఆ సంస్థకు చెల్లించే దిశగా అడుగులు 

ఇందులో సగానికి సగం మిగులుతుందంటున్న అధికార వర్గాలు  

ఇటీవలే ఆయా ఆలయాల ఈవోలతో దేవదాయ శాఖ కమిషనర్‌ సమావేశం 

గత ప్రభుత్వం తరహాలో ఒక్కో ఆలయానికి ప్రత్యేకంగా టెండర్‌ పిలవడమే మేలంటున్న నిపుణులు.. పనుల పర్యవేక్షణ, నాణ్యత మెరుగవుతుందని సూచన  

చంద్రబాబు సర్కారు తీరుపై భక్తజనం మండిపాటు  

సాక్షి, అమరావతి:  భక్తులు గుళ్లలో కానుకలుగా సమర్పించే కోట్ల రూపాయలను తమకు కావాల్సిన వారికి దోచి పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిరంతరం ఆలోచన చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా అధికారంలోకి రాగానే దేవదాయ శాఖలో టెండరు నిబంధనలను పూర్తిగా మార్చేసి, రాష్ట్రంలో ఏటా అధిక ఆదాయం వచ్చే ఏడు ప్రధాన ఆలయాల్లో క్లీనింగ్‌ పనుల నిర్వహణ, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది సరఫరా కాంట్రాక్టుకు ఉమ్మడిగా టెండర్లు నిర్వహించింది. ప్రభుత్వ ముఖ్య నేతకు బంధువుగా ప్రచారంలో ఉన్న భాస్కరనాయుడికి సంబం«ధించిన పద్మావతి హాస్పిటాలిటీస్‌ సంస్థకు ఆ పనులు కట్టబెట్టింది. ఇప్పుడు మరో 15 పెద్ద ఆలయాల్లో క్లీనింగ్‌ పనులను కూడా అదే తరహాలో ఆ సంస్థకు అప్పగించేందుకు సిద్ధమైంది. ఆ 15 ఆలయాలకు కూడా 
 

ఉమ్మడిగా టెండర్లు పిలిచేందుకు రెండు రోజుల క్రితం దేవదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో ఆలయాల ఈవోలతో సమావేశం నిర్వహించారు. తొలి విడతలో ఏడు గుళ్లలో క్లీనింగ్‌ పనుల కోసం ఉమ్మడిగా టెండర్లు నిర్వహించడం ద్వారా రెండేళ్ల కాలానికి దాదాపు రూ.100 కోట్ల విలువైన పనులను దక్కించుకున్న ఆ సంస్థకు సగానికి సగం మిగులుతుందని అధికార వర్గాల్లో చర్చ ఉంది. తాజాగా 15 గుళ్లకు కూడా ఉమ్మడి టెండర్లు ద్వారా మరో రూ.వంద కోట్లకు పైబడి పనులను ఆ సంస్థకే కట్టబెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది.   

నాడు నిబంధనలు మార్చి కట్టబెట్టేశారు 
– గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏ గుడిలో క్లీనింగ్‌ పనుల టెండర్లు ఆ గుడి స్థాయిలో వేర్వేరుగా జరిగేవి. చంద్రబాబు ప్రభుత్వం రాగానే ఆ విధానాన్ని మార్చి.. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ దుర్గగుడి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలకు ఉమ్మడిగా టెండర్లు నిర్వహించాలని నిర్ణయించింది.  
– ఈ ఏడు ప్రధాన ఆలయాలు రూ.60 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు వార్షికాదాయం కలిగి, జాయింట్‌ కమిషనర్‌ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఉన్నాయి. ఇప్పుడు ఉమ్మడిగా టెండర్ల నిర్వహణకు కసరత్తు చేస్తున్న 15 ఆలయాలకు ఏటా రూ.10 కోట్లకు పైబడి ఆదాయం ఉంటోంది. ఇవి డిప్యూటీ కమిషనర్‌ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఉన్నాయి. ఒకే సంస్థకు ఇలా ముఖ్యమైన ఆలయాల క్లీనింగ్‌ పనులు అప్పగించడం చూస్తుంటే ఇది ప్రభుత్వ పెద్దల పనే అని స్పష్టమవుతోంది.  

– తొలుత ఏడు ఆలయాలను అప్పగించేందుకు గత ఏడాది మే నెలలో దేవదాయ శాఖ టెండర్లు నిర్వహించింది. ఆ టెండర్లలో పేర్కొన్న నిబంధనలు ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన ఆ సంస్థకు అనుకూలంగా లేవని  తేలడంతో ఏకంగా ఆ టెండరునే రద్దు చేశారు. తిరిగి నిబంధనలు సవరించి, జూన్‌లో మళ్లీ టెండర్లు పిలిచారు. అందులో పద్మావతి హాస్పిటాలిటీస్‌ సంస్థనే ఎల్‌–1గా నిలిచింది.  
– మరోవైపు.. అప్పుడు ఏడు గుళ్లకు కలిపి ఉమ్మడిగా టెండర్లు నిర్వహించే ప్రక్రియలో కేవలం పెద్ద సంస్థలు మాత్రమే టెండరులో పాల్గొనే అవకాశం ఉండేలా నిబంధనలు మార్చడంతో అంతకు ముందు ఆయా గుళ్లలో వేర్వేరుగా క్లీనింగ్‌ పనులు నిర్వహించిన సంస్థలు పోటీలో పాల్గొనే అర్హత కోల్పోయాయి. ఉమ్మడి టెండర్ల విధానంలో పోటీ తగ్గడం వల్ల పెద్ద సంస్థలు అధిక ధరకు పనులు పొందేలా ప్రభుత్వమే మార్గ నిర్దేశం చేస్తోంది. 

– గుళ్లలో పారిశుద్ధ్య పనుల్లో నాణ్యత పెంచేందుకే ఉమ్మడి టెండర్లు నిర్వహించినట్టు ప్రభుత్వం చెప్పుకుంటుండగా.. వాస్తవానికి పనుల నాణ్యత తగ్గిపోయిందని దేవదాయ శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. 20 రోజుల క్రితం విజయవాడ దుర్గ గుడి పరిధిలోని వాష్‌రూంలో ఒక వ్యక్తి చనిపోతే నాలుగు రోజుల తర్వాత ఆ విషయం గుర్తించడం గమనార్హం. అంటే నాలుగు రోజుల పాటు అక్కడ పారిశుధ్య పనులే చేపట్టలేదని స్పష్టమవుతోంది. సరైన పర్యవేక్షణ ఉండి ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టి ఉంటే వెంటనే ఆ ఘటన వెలుగు చూసేదని భక్తులు చెబుతున్నారు.  
– ఇప్పటికే కట్టబెట్టిన ఏడు ఆలయాలతో పాటు కొత్తగా మరో 15 ఆలయాల్లో పారిశుద్ధ్య పనులను ఒకే సంస్థకు అప్పగిస్తే పనుల పర్యవేక్షణ తగ్గిపోతుందని అధికార వర్గాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ప్రభుత్వ పెద్దల ఆదేశాలను కాదనలేక ఈ విషయంలో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం తీరుపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.    

Advertisement
 
Advertisement
Advertisement