breaking news
Telugu Kala Vedika
-
సంక్రాంతి శోభ
దాదర్, న్యూస్‌లైన్: నవీముంబైలోని వాషి పట్టణంలో ఉన్న ‘తెలుగు కళా సమితి’ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఘనంగా జరిగిన ‘సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో తెలుగు ప్రజలంతా విశేషంగా పాల్గొన్నారు. రెండు రోజులపాటు ఏర్పాటుచేసిన ఈ సంబరాలలో మొదటిరోజు స్థానిక కళాకారులు, సమితి సభ్యులు, మహిళలు, బాల, బాలికలు పలు సాంస్కృతిక ప్రదర్శనలిచ్చారు. తొలుత గణేశుని వర్ణచిత్రాన్ని పూల మాలలతో అలంకరించి దీప ప్రజ్వలన చేశారు. సమితి అధ్యక్షుడు బండి నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి కొండారెడ్డి ఆహూతులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ సంబరాలకు ఆహ్వానం పలికారు. ఆలాగే, ‘చేబియం కౌశికి’ ప్రార్థనా గీతంతో సంబరాలు ప్రారంభించారు. మహిళా సభ్యులు సంక్రాంతి పాటలతో, వాణి శ్రీపాద తదితర గాయనీ గాయకులు భక్తి గీతాలను ఆలపించారు. సాంస్కృతిక కళా దర్శకురాలు కేతవరపు శోభారావు ఆధ్వర్యంలో రూపొందిన పలు నృత్యరూపకాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. మనదేశంలోని వివిధ రాష్ట్రాలలో జరిగే సంక్రాంతి పండుగ విశేషాలను తెలిపే విధంగా ఈ నృత్యాల ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. తమిళనాడు (పొంగల్), మహారాష్ట్ర (మకర సంక్రాంతి), అస్సాం (మాఘబిహు), గుజరాత్ (మకర సంక్రాం త్-ఉత్తరాయణ్), పంజాబ్ (లోధీ) రాష్ట్రాల్లో ఆచరిస్తున్న సంక్రాంతి పండుగ సంబరాలను ప్రతిబిం బించిన ఈ నృత్యరూపకాలపై తెలుగులో సరళారావు వ్యాఖ్యానం సభికులను ఆకట్టుకుంది. కూచిపూడి నాట్యకళాకారిణి సత్యా శ్రీనివాస్ (కొరియోగ్రాఫర్), వాణిశ్రీపాద, లక్ష్మీ రావు, పద్మా ప్రసాద్, మీనా, కాత్యాయని, డి.పద్మ, వైశాలి, విపు ల మహాజన్, పద్మాశేఖర్, విజయా మూర్తి, రేవతి, చంద్రకళారెడ్డి, శాంతిరెడ్డి, హరి ప్రియ, నిఖిత, నగపృథ్వి తదితరులు ఇందులో పాల్గొన్నారు. తెలుగు కళా సమితి తరఫున కేతవరపు శోభా రావు, కూచిపూడి నాట్యగురు శ్రీరామచంద్ర మూర్తి ముఖ్య అతిథులను, కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులను, గత విద్యా సంవత్సరంలో అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులను సత్కరించారు. టి.మంజులారెడ్డి వ్యాఖ్యానంతో తొలినాటి సంబరాలు ఘనంగా జరిగాయి. పద్మశాలీల ‘పసుపు-కుంకుమ’ సాక్షి, ముంబై: నాయిగావ్‌లోని పద్మశాలి యువక సంఘం మహిళా మండలి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా మంగళవారం సాయంత్రం పసుపు కుంకుమ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంఘం భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులు వివిధ వేషధారణల్లో సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు చేశారు. కాగా, ఈ నెల 5, 6 తేదీల్లో జరిగిన ముగ్గులు, ఇతర ఆటల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ముఖ్య అతిథులు తరిగొప్పు రాధిక ( శివసేన శాఖ ప్రముఖ్), గద్దె లలిత (ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ ప్రాథమిక విభాగం ప్రధానోపాధ్యాయురాలు), గిరిజ (స్వరమాధురి అధ్యక్షురాలు) పసుపు-కుంకుమ గురించి వివరించారు. కార్యక్రమానికి హాజరైన మహిళలందరినీ మహిళా మండలి తరఫున పసుపు-కుంకుమతోపాటు చిరు కానుకలను అందజేశారు. దాదాపు 720 మంది మహిళలు, 160 మంది చిన్నారులు పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు. నూతన సంఘ ధర్మకర్తలు, కార్యవర్గం, మహిళా మండలి సమితి సభ్యులను సభకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా మండలి అధ్యక్షురాలు భోగ కళావతి, కార్యదర్శి రాధ, కోశాధికారి సంగిశెట్టి భాగ్యలక్ష్మి, ట్రస్ట్ చైర్మన్ పావని సుదర్శన్, కార్యవర్గ అధ్యక్షుడు కోడి చంద్రమౌళి, సంఘం ప్రధాన కార్యదర్శి కస్తూరి సుధాకర్, మేనేజింగ్ ట్రస్టీ గాడిపెల్లి గణేష్, ట్రస్టీ సభ్యులు బుధారపు రాజారాం, ముశం నారాయణ, కార్యవర్గ సభ్యులు పొన్న శ్రీనివాస్, బోడ శ్రీనివాస్ పాల్గొన్నారు. సూరత్‌లో.. సాక్షి, ముంబై: సూరత్‌లో సంక్రాంతి వేడుకలు పల్లెటూరి వాతావరణాన్ని తలపించాయి. ప్రతాప్‌నగర్‌లోని శ్రీమార్కండేయ మందిరంలో మంగళవారం సాయంత్రం సంబరాలను నిర్వహించారు. ఎం.పి. సి.ఆర్.పాటిల్ ముగ్గుల పోటీలను ప్రారంభించా రు. పోటీల్లో 60 మంది మహిళలు పాల్గొన్నారు. సూరత్ తెలుగు వలస ప్రజల ఐక్య సమితి క్రీడాసాంస్కృతిక కమిటీ ఈ పోటీలను నిర్వహించింది. తెలంగాణ అంశం, ఆడశిశువులను కాపాడటం వంటి సందేశాత్మక ముగ్గులు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజేతలకు పవిత్ర శారీ హౌస్ అధిపతి గంగుల వెంకటేష్ బహుమతులను అందజేశారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సంగీతాపాటిల్, సాంఘిక సంక్షేమ శాఖ సూరత్ ఎస్సీ, బీసీ డిప్యూటీ డెరైక్టర్ ఆర్.బి.గోయిల్, తెలుగు కార్పొరేటర్లు రాపోలు లక్ష్మి, పీవీఎస్ శర్మ, అన్నపూర్ణ, ఆలయ కమిటీ అధ్యక్షుడు సిరిమల్లె గణేష్, కార్యదర్శి వడ్డెపెల్లి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అహ్మదాబాద్‌లో వైభవంగా.. స్థానిక శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో రంగవల్లుల పోటీలు నిర్వహించారు. ఎనిమిదేళ్ల బాలిక మనస్విని వేసిన ముగ్గు ప్రత్యేక బహుమతి పొందింది. జయ, లావణ్య ఆలపించిన కీర్తనలు అలరించాయి. పీవీపీసీ ప్రసాద్ సమన్వయంతో కొనసాగిన ఈ ఉత్సవాల్లో అహ్మదాబాద్ ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు ద్వారకనాథ్ గుప్తా, కార్యదర్శి కె.సుబ్బారాయుడు, సహ కార్యదర్శి పున్నా రావు, గాంధీనగర్ తెలుగు సంఘం అధ్యక్షుడు మారుతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఎంవీఎస్ రవికుమార్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. -
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
దాదర్, న్యూస్‌లైన్: సీబీడీ బేలాపూర్‌లోని ‘తెలుగు కళావేదిక’ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం కైరళి హాలు ప్రాంగణంలో ‘దాశరథీ కరుణాపయోనిధి’ పేరుతో జరిగిన శ్రీరామదాసు కీర్తనల కార్యక్రమానికి కళావేదిక సభ్యులతోపాటు శివారు ప్రాంతాల్లోని సంగీత అభిమానులు భారీగా తరలివచ్చారు. హనుమత్సమేత సీతారామ లక్ష్మణులు, అలాగే శ్రీరామదాసు చిత్రపటాలను పూలమాలలతో అలంకరించారు. దీపప్రజ్వలన, పూజాది కార్యక్రమాన్ని నిర్వహించారు. చిరంజీవి విశ్వక్ ఆలపించిన దాశరథీ శతక పద్యాలతో కార్యక్రమం ఆరంభమయింది. కళావేదిక సభ్యుల బృందం ఆలపించిన ‘శ్రీరామ నవరత్న కీర్తనలు’ శ్రోతలను ఆకట్టుకున్నాయి. ప్రముఖ సంగీత విద్వాంసురాలు శారదా సుబ్రహ్మణ్యం అత్యద్భుతంగా ఆలపించిన శ్రీ రామదాసు కీర్తనలు వీనులవిందు చేశాయి. అలాగే రమాసాయి, దార్గా భార్గవి సోదరిద్వయం ‘ఇదిగో భద్రాద్రి-గౌతమి అదిగో చూడండి..’ కీర్తనకు అభినయించిన భరతనాట్యం కనువిందు చేసింది. సి.పద్మావతి వ్యాఖ్యానం, శారదా మురళి (వయొలిన్), అనంతరాం లోకనాథ్ (మృదంగం) వాద్య సహకారం అందించారు. డోంబివలిలో.. ఈ సమితి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం డోంబివలిలోనూ సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ముగ్గుల పోటీలతో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. చిన్నారులకు భోగిపళ్లు, ఫ్యాన్సీ డ్రెస్, ఆటపాటల వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ‘స్వరమాధురి’ సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ సంగీత విద్వాంసురాలు పార్వతి త్యాగరాజ శాస్త్రీయ సంగీత కచేరి జరిగింది. శ్రీ ముత్తయ్య భాగవతార్ ‘వాతాపి గణపతిం భజే..’, ‘హిమగిరి తనయే హేమలతే..’ తదితర కీర్తనలతో వీనుల విందు చేశారు. అలాగే పద్మావతి శిష్యురాలు నందిత, రమ్య హారిక, వైదేహి ఆలపించిన ‘రంజని’ రాగమాలిక, తులసీదాస్ విరచిత ‘ఠుమక చలత రామచంద్ర’ భజనలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. స్వరమాధురి ఉపాధ్యక్షుడు పి.అశ్విన్ కుమార్ వ్యాఖ్యానం, నారాయణ నంబూద్రి (మృదంగం), సూరజ్ (వేణువు), రామచంద్ర శర్మ (మృదంగం) వాద్య సహకారం అందించారు. ఆంధ్ర కళాసమితి తమ వయోధిక సభ్యులను, కళాకారులను సత్కరించింది. అలాగే గత విద్యా సంవత్సరంలో అత్యున్నత శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకూ బహుమతులు అందించింది. ఘనంగా ‘ఆంధ్రజ్యోతి’ వార్షికోత్సవం దాదర్, న్యూస్‌లైన్: ప్రజాహిత సేవలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో నగరంలోని తెలుగు ప్రజల అభివృద్ధికి పాటుపడుతున్న ‘ఆంధ్రజ్యోతి సేవా మండలి’ ఎనిమిదో వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. నవీముంబైలోని వాషిలో ఉన్న తెలుగు కళాసమితి ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి వేలాది మంది తరలివచ్చారు. స్థానిక పార్లమెంట్ సభ్యుడు సంజీవ్ నాయక్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆయనతోపాటు శాసనసభ్యులు సందీప్ నాయక్, కిరణ్ పవాస్కర్, నగర ప్రముఖులు సాగర్ నాయక్, హరీష్ సనాస్, మాదిరెడ్డి కొండారెడ్డి (వైఎస్సార్సీపీ నేత-మహారాష్ట్ర) తదితర ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మండలి అధ్యక్షుడు మానవ్ వెంకటేష్ అతిథులకు స్వాగతం పలికి తమ సంస్థ సేవల గురించి తెలిపారు. దీపప్రజ్వలన తర్వాత వేదికపై ఉన్న అతిథులను శాలువా, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. కిరణ్ పవాస్కర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్థానిక మరాఠీ ప్రజలతో మమేకమై సఖ్యతతో మెలుగుతున్న తెలుగు ప్రజలందరినీ తమ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని అన్నారు. మండలి తరఫున ఇతర సంఘాల సభ్యులందరినీ కలుపుకొని అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న మానవ్ వెంకటేష్, కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. సంజీవ్ నాయక్ తనకు జరిగిన సత్కారానికి కృతజ్ఞతలు తెలుపుతూ.. ముంబై నగర నిర్మాణంలోనూ, అభివృద్ధిలోనూ తెలుగు వారి పాత్ర మరిచిపోలేనిదని వ్యాఖ్యానించారు. తెలుగు ప్రజల సౌకర్యం కోసం మరిన్ని రైళ్లను ఠాణే స్టేషన్లో నిలిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ఆంధ్రజ్యోతి సేవామండలి సొంతభవన నిర్మాణం కోసం ఘన్సోని లేక ఖార్గర్ పట్టణ ంలో స్థలాన్ని మంజూరు చేయిస్తానని హామీ ఇవ్వడంతో సభ కరతాళ ధ్వనులతో మార్మోగింది అలరించిన ‘స్వరమాధురి’.. మండలి వార్షికోత్సవాల సందర్భంగా ప్రముఖ కళాకారుడు చలపతి శెట్టి వ్యాఖ్యానాలతో స్వరమాధురి సాంస్కృతిక సంస్థ డెరైక్టర్, గాయని గిరిజా ద్విభాష్యం ఆధ్వర్యంలో జరిగిన సంగీత విభావరి శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంది. ‘సంగీత, సాహిత్య రచన ఝరి.. స్వరమాధురి’ అన్న ప్రారంభగీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో అలనాటి ఆణిముత్యాలతోబాటు నేటితరం మెచ్చే పాటలతో గాయకులు వీనులవిందు చేశారు. యువగాయకుడు చిరంజీవి ఆలపించిన అన్నమయ్య కీర్తన ‘అదివో-అల్లదివో.. శ్రీ హరివాసమూ’ ప్రతి ఒక్కరినీ అలరించింది. గిరిజ, భావన, శివప్రసాద్, పత్రి భరణి, ఎస్.వి.ఆర్.మూర్తి తదితరులు ఆర్.టి.రాజన్ బృందం వాద్య సహకారంతో పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. ప్రముఖ కళాకారుడు మాధవ్ మోఘే మిమిక్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చివరగా విందు భోజనాలతో మండలి వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి.