breaking news
Telangana unemployed
-
నిరుద్యోగుల పక్షానే ఎమ్మెల్యే మాట్లాడారు
సూర్యాపేట మాతృశ్రీ కళాశాల నిర్వాహకులు వెల్లడి నకిరేకల్: నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలంగాణ నిరుద్యోగుల పక్షాన మాట్లాడారే తప్ప ఆయన సొంత పనుల కోసం కాదని సూర్యాపేటకు చెందిన మాతృశ్రీ కళాశాల నిర్వాహకులు ఆర్.సత్యనారాయణ, పి.రంజిత్, పి.అశ్వినికుమార్, జె.నాగరాజు, ఎండీ జానీపాషా చెప్పారు. వారు ఆదివారం నకిరేకల్‌లో ‘సాక్షి’ కథనంపై స్పందించారు. చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న తాము సూర్యాపేటలోని ఒక కళాశాలలో పనిచేసేందుకు వెళ్లగా... ఆ కళాశాల యాజమాన్యం, ఆంధ్రాకు చెందిన వీరయ్య తమను వాటా తీసుకొమ్మని కోరారని, వారికి డబ్బు కూడా ఇచ్చామని చెప్పారు. మూడేళ్ల కిందట వెళ్లిన వీరయ్య ఇటీవల తిరిగి వచ్చి కళాశాలపై తనకు హక్కు ఉందని వివాదానికి దిగాడన్నారు. నెలకు రూ.లక్ష ఇవ్వాలని కోరాడని, కళాశాలను వదిలి పెట్టకపోతే తమ ఐదుగురిని చంపుతానని బెదిరించారని ఆరోపించారు. తమను బెదిరించడంతోనే ఎమ్మెల్యేను ఆశ్రయించామని... ఎమ్మెల్యే కూడా వీరయ్యను చర్చలకు రావాలని పది సార్లు ఫోన్ చేసినా తప్పించుకుని తిరుగుతున్నాడని చెప్పారు. దాంతో తమ తరఫున ఎమ్మెల్యే గట్టిగా మాట్లాడారే తప్ప బెదిరించలేదని పేర్కొన్నారు. -
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీపీఎస్సీ) ఏర్పాటుకు గ వర్నర్ నరసింహన్ ఆమోదముద్ర వేశారు. దీంతో త్వరలోనే టీపీఎస్సీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. రాష్ట్ర విభజన చట్టంలో టీపీఎస్సీ ఏర్పాటయ్యేవరకు ఇక్కడ ఉద్యోగాలను భర్తీ చేయాలంటే ఆ బాధ్యతలను యూపీఎస్సీ చూస్తుందని పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వ తొలి కేబినెట్ భేటీలోనే రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులు ఫైలును రూపొందించి ముఖ్యమంత్రి, గవర్నర్ ఆమోదానికి ఇటీవలే పంపించారు. బుధవారంనాడే గవర్నర్ ఈ ఫైలుపై ఆమోద ముద్ర వేశారు. దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతోపాటు కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించనుంది. టీపీఎస్సీ ఏర్పాటుతో తెలంగాణ నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగం పుంజుకోనుంది. టీపీఎస్సీ ద్వారా దాదాపు 15 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంటుందని నిరుద్యోగులు భావిస్తున్నారు. ఇక కమిషన్ చైర్మన్‌గా ఘంటా చక్రపాణిని నియమిస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో దానిపైనా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గెజిటెడ్ అధికారుల సంఘం హర్షం టీపీఎస్సీకి గవర్నర్ ఆమోదముద్ర వేయడం పట్ల తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం చైర్మన్, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్, అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. సర్వీసు కమిషన్ విధి విధానాలను రూపొందించి, గవర్నర్ ఆమోదం పొందేలా చేయడంలో సీఎం కేసీఆర్ శ్రద్ధ చూపారన్నారు. త్వరలోనే నిరుద్యోగులకు మేలు చేసే ప్రకటన వస్తుందని, ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వస్తాయని వెల్లడించారు. కమిషన్‌లో సభ్యులుగా సమర్థులైన అధికారులను గౌరవ సభ్యులుగా నియమించాలని, మహిళా అధికారిని కార్యదర్శిగా నియమించాలని వారు కోరారు.