breaking news
telangana clp leader
-
తెలంగాణ 'సీఎం రేవంత్'
వన్ మ్యాన్ షో ఉండదు తెలంగాణ సీఎల్పీ సమావేశంలో చేసిన మూడు తీర్మానాలను పరిశీలకులు పార్టీ అధ్యక్షుడికి అందించారు. తెలంగాణలో అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపే తీర్మానం మొదటిది. అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకలకు ధన్యవాదాలు తెలిపేది రెండో తీర్మానం. సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను అధిష్టానానికే అప్పగిస్తూ మూడో తీర్మానం చేశారు. పార్టీ పరిశీలకులు ఇచ్చిన నివేదికను పరిశీలించిన అనంతరం సీనియర్లతో చర్చించాం. రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని పార్టీ నిర్ణయించింది. ప్రభుత్వంలో వన్‌మ్యాన్ షో ఉండదు. అందరినీ కలుపుకొంటూ కలసి టీమ్‌గా ముందుకు వెళ్తాం. సీనియర్లు అందరికీ సముచిత గౌరవం ఉంటుంది. – కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్, కొడంగల్ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. గురువారం ఉదయం 10.28 గంటలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎంలు, మంత్రులుగా ఎవరెవరు ఉంటారన్న దానిపై బుధవారం నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక రెండు రోజుల పాటు అనేక తర్జనభర్జనలు, సంప్రదింపులు జరిపి, నేతల అభిప్రాయాలు తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం.. పార్టీ శాసనసభాపక్ష (సీఎల్పి) నేతగా రేవంత్‌రెడ్డిని ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం సాయంత్రం ఢిల్లీలో ప్రకటించారు. ఖర్గే తెలంగాణ సీఎల్పీ భేటీ చేసిన తీర్మానాన్ని పరిశీలించిన తర్వాత రేవంత్‌రెడ్డిని సీఎంగా నియమించాలని నిర్ణయించారని చెప్పారు. గురువారం రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. డిప్యూటీ సీఎం సహా ఇతర మంత్రి పదవుల అంశంపై బుధవారం నిర్ణయం తీసుకోనున్నట్టు వివరించారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ సుపరిపాలన అందించబోతోందని.. తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేరుస్తామని చెప్పారు. తీర్మానాలను అధిష్టానానికి అందజేసి.. రాష్ట్ర ఎన్నికల్లో జయకేతనం అనంతరం సోమవారం కొత్త ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అధిష్టానం దూతలు, ఏఐసీసీ పరిశీలకులు సమావేశం నిర్వహించి అభిప్రాయాలను సేకరించిన విషయం తెలిసిందే. సీఎం ఎంపిక నిర్ణయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ ఆ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఆ తీర్మానం, ఎమ్మెల్యే అభిప్రాయాల నివేదికలతో ఢిల్లీకి వచ్చిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఇతర నేతలు మంగళవారం రోజంతా బిజీబిజీగా గడిపారు. సీఎంతోపాటు ఇతర కీలక పదవులపై రాష్ట్ర, జాతీయ నేతలతో విస్తృతంగా చర్చలు జరిపారు. మరోవైపు సాయంత్రానికల్లా సీఎంను ఖరారు చేస్తామని ఖర్గే ప్రకటించారు. వరుసగా భేటీలు.. విస్తృతంగా సంప్రదింపులు.. మంగళవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదితరులు కొద్దిసేపు పదవుల అంశంపై చర్చించుకున్నారు. 10.45 గంటలకు ఉత్తమ్ డీకే శివకుమార్‌తో భేటీ అయి.. సీఎం, డిప్యూటీ సీఎం పదవులు, పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపిక, కీలక శాఖలకు మంత్రులు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తనకు సీఎం పదవికి అర్హత ఉందని నొక్కి చెప్పినట్టు తెలుస్తోంది. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశానని.. తనకు మెజార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ల మద్దతు ఉందని వివరించినట్టు సమాచారం. అయితే ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఉత్తమ్.. అధిష్టానం సీఎంగా ఎవరిని ఎంపిక చేసినా తనకు ఆమోదమేనని ప్రకటించారు. డీకేతో ఉత్తమ్ భేటీ జరుగుతున్న సమయంలోనే.. భట్టి విక్రమార్క రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రేతో భేటీ అయ్యారు. సీఎం పదవి కోసం తన అర్హతను పరిశీలించాలని కోరారు. ఈ భేటీలు సాగుతున్న సమయంలోనే ఖర్గే నివాసంలో మరో కీలక భేటీ జరిగింది. రేవంత్‌రెడ్డి వైపే మొగ్గు మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఖర్గే నివాసానికి పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాం«దీ, కేసీ వేణుగోపాల్ తదితరులు చేరుకుని.. సీఎల్పీ నేత ఎంపికపై చర్చించారు. పదవికి పోటీ పడుతున్న రేవంత్, ఉత్తమ్, భట్టి పేర్లను పరిశీలించారు. పారీ్టకి పనిచేసిన అనుభవంతోపాటు రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, రానున్న పార్లమెంట్ ఎన్నికలు, మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు, ప్రజల్లో ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని రేవంత్‌రెడ్డి వైపే అంతా మొగ్గుచూపినట్టు తెలిసింది. ఈ భేటీ మొదలైన అరగంటకు డీకే శివకుమార్, ఠాక్రే కూడా ఖర్గే నివాసానికి చేరుకుని.. ఎమ్మెల్యేల తీర్మానం కాపీ, వారి అభిప్రాయాల నివేదికను అగ్రనేతలకు అందించారు. ఈ సందర్భంగా అంతా కలసి.. పార్టీ సీనియర్ నేతల నుంచి వస్తున్న డిమాండ్లు, కీలక శాఖల అప్పగింత, పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై చర్చించారు. రేవంత్ ఎంపికను ఖరారు చేసి, ఈ విషయాన్ని అగ్రనేత సోనియాగాం«దీకి తెలిపి ఆమోదం తీసుకున్నారు. భట్టి విక్రమార్కకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఇదే సమయంలో ఉత్తమ్, దామోదర, శ్రీధర్‌బాబు, సీతక్కలకు కీలక శాఖలు ఇవ్వాలన్న ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. డిప్యూటీ సీఎం, మంత్రులకు శాఖలపై నేడు స్పష్టత సీఎం ఎంపిక కసరత్తు కొలిక్కి వచ్చిన తర్వాత సాయంత్రం 5 గంటల సమయంలో కేసీ వేణుగోపాల్‌తో డీకే, ఠాక్రే, భట్టి, ఉత్తమ్ భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం పదవులతోపాటు మంత్రివర్గ కూర్పు, శాఖల కేటాయింపులపై వారు సుమారు గంట పాటు చర్చించారు. అనంతరం డీకే, ఠాక్రే, ఉత్తమ్, భట్టిలను వెంట పెట్టుకొని ఏఐసీసీ కార్యాలయానికి వచ్చిన కేసీ వేణుగోపాల్.. సీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డిని ఎంపిక చేసినట్టు ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రులు ఎందరు ఉండాలి, మంత్రి పదవులు ఎవరికి అన్న దానిపై బుధవారం రేవంత్‌రెడ్డితో కలసి నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. సోనియాతో జి.వినోద్ భేటీ మరోవైపు మాజీ మంత్రి జి.వినోద్ ఢిల్లీలో సోనియాగాంధీతో విడిగా భేటీ అయ్యారు. తాను గతంలో మంత్రిగా పనిచేశానని, ఈసారి తనకు మంత్రి పదవి ఇవ్వాలని సోనియాను కోరానని భేటీ అనంతరం వినోద్ తెలిపారు. తన విజ్ఞప్తిపై ఆమె సానుకూలత వ్యక్తం చేశారని చెప్పారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా: ఉత్తమ్ సీఎల్పీ నేత ప్రకటనకు ముందు ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. సీఎం పదవి కోసం తనకు అన్ని అర్హతలు ఉన్నాయని, ఈ విషయాన్ని పరిశీలించాలని హైకమాండ్‌ను కోరానని చెప్పారు. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే సీఎం ఎంపిక జరుగుతోందని, మిగతా పార్టీ అంతర్గత విషయాలను బయటికి వెల్లడించలేనని చెప్పారు. కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన కాంగ్రెస్ కొత్త ఎమ్మెల్యేలంతా మంగళవారం హైదరాబాద్‌లోని ఎల్లా హోటల్లోనే గడిపారు. ఓవైపు ఢిల్లీలో సీఎల్పీ నాయకుడి ఎంపికపై చర్చలు, సంప్రదింపులు జరుగుతుండగా.. అదే సమయంలో రేవంత్‌రెడ్డి హోటల్లో కొత్త ఎమ్మెల్యేలతో ఉండి చర్చలు జరుపుతూ గడిపారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రొఫెసర్ నాగేశ్వర్, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి తదితరులు అసెంబ్లీ వ్యవహారాలు, ప్రభుత్వ పనితీరు, ఇతర అంశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించారు. అధిష్టానం నుంచి పిలుపు రావడంతో రేవంత్ మంగళవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. ఆయన ప్రయాణంలో ఉండగానే ఢిల్లీలో కేసీ వేణుగోపాల్, ఇతర నేతలు ప్రెస్‌మీట్ పెట్టి రేవంత్‌ను సీఎంగా ఎంపిక చేసినట్టు ప్రకటించారు. రేవంత్ వెళ్లాక ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరిగా హోటల్ నుంచి వెళ్లిపోయారు. వారంతా బుధవారం మళ్లీ ఎల్లా హోటల్లో సమావేశం కానున్నారని గాం«దీభవన్ వర్గాలు తెలిపాయి. సీఎంగా రేవంత్ ఎంపిక ప్రకటన వెలువడగానే.. ఎల్లా హోటల్ వద్ద కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోయారు. బాణసంచా కాలుస్తూ, జై రేవంత్, జై కాంగ్రెస్ నినాదాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణులు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నాయి. ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం – వేగంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎస్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు వెంటనే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై ఆమె మంగళవారం రాత్రి సచివాలయంలో సమీక్షించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. తగిన బందోబస్తు, ట్రాఫిక్, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు సూచించారు. పారిశుధ్యం, త్రాగునీరు, ఫాగింగ్ వంటి చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. ఎల్బీ స్టేడియం వద్దకు వెళ్లే రహదారుల మరమ్మతులు చేపట్టాలని.. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. సమావేశంలో డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సునీల్‌శర్మ, ముఖ్య కార్యదర్శులు రిజ్వీ, శైలజా రామయ్యర్, గవర్నర్ సెక్రెటరీ సురేంద్ర మోహన్, జీఏడీ సెక్రెటరీ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. -
'నాది మెతక వైఖరి అనడం సరికాదు'
హైదరాబాద్: తనది మెతక వైఖరి అనడం సరికాదని... ఎవరి శైలి వారిదేనని తెలంగాణ సీఎల్పీ నాయకుడు కె.జానారెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో హుందాగా తన శైలికి తగ్గట్లుగా వ్యవహరిస్తున్నాని తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎందుకు ఎండగట్టంలేదంటూ పార్టీ పెద్దలను కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వ వైఖరిపై మెతక వైఖరి సరికాదని పలువురు హస్తం నేతలు అభిప్రాయపడ్డారు. దీన్ని కాంగ్రెస్ అసమర్థగా ప్రజలు భావిస్తున్నారని సదరు పార్టీ పెద్దల వద్ద నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌లను టార్గెట్ చేయాల్సిందే నంటూ నేతలు పార్టీ పెద్దలకు సూచించారు. దీంతో అక్కడే ఉన్న కె.జానారెడ్డి.. నేతల వ్యాఖ్యాలపై పైవిధంగా స్పందించారు. అదికాక కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేతగా కె.జానారెడ్డి అసెంబ్లీలో అధికార టీఆర్ఎస్ పార్టీ విధానాలను ఎండగట్టకుండ... ఆ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహారిస్తున్నారంటూ సొంత పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న సంగతి తెలిసిందే. -
ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన రెడ్యానాయక్, యాదయ్యలపై వెంటనే అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నాయకుడు కె.జానారెడ్డి ... తెలంగాణ శాసన సభ స్పీకర్ ఎస్. మధుసూధనాచారిని డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం స్పీకర్ చాంబర్లో మధుసూధనాచారిని జానారెడ్డి కలిశారు. శాసనసభలో టీఆర్ఎస్ బ్లాక్‌లో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూర్చుంటున్నారని... ఆయన స్పీకర్‌కు గుర్తు చేశారు. మీ కళ్ల ఎదుటే జరుగుతున్న ఈ వ్యవహారానికి ఇంకా సాక్ష్యాలు కావాలా అంటూ స్పీకర్‌ను ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై వేటు వేయాలని జానారెడ్డి ఈ సందర్భంగా స్పీకర్‌ను కోరారు.