Team championship
-
ఆశల పల్లకిలో...
నేటి నుంచి ప్రపంచ చెస్ టీమ్ చాంపియన్‌షిప్ న్యూఢిల్లీ: పతకాలే లక్ష్యంగా ఏకకాలంలో భారత పురుషుల, మహిళల చెస్ జట్లు ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగుతున్నాయి. పురుషుల టీమ్ చాంపియన్‌షిప్ ఆర్మేనియాలో... మహిళల టీమ్ చాంపియన్‌షిప్ చైనాలో ఆదివారం ప్రారంభం కానున్నాయి. తెలుగు గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ, కృష్ణన్ శశికిరణ్, సేతురామన్, విదిత్ షంతోష్ గుజరాతి, దీప్ సేన్‌గుప్తాలతో కూడిన భారత పురుషుల జట్టు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మొత్తం పది జట్లు రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో తలపడనున్న ఈ పోటీల్లో భారత్‌తోపాటు ఆర్మేనియా, చైనా, రష్యా, క్యూబా, ఈజిప్టు, హంగేరి, ఇజ్రాయెల్, ఉక్రెయిన్, అమెరికా జట్లు పాల్గొంటున్నాయి. గతేడాది చెస్ ఒలింపియాడ్‌లో కాంస్యం సాధించినందుకు భారత జట్టు ఈ టోర్నీకి అర్హత సాధించింది. తెలుగు గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, పద్మిని రౌత్, సౌమ్య స్వామినాథన్, మేరీ ఆన్‌గోమ్స్‌లతో కూడిన భారత మహిళల జట్టుకు ‘వైల్డ్ కార్డు’ కేటాయించడంతో ఈ టోర్నీలో బరిలోకి దిగనుంది. చైనా, రష్యా, ఆర్మేనియా, జార్జియా, అమెరికా, పోలండ్, ఈజిప్టు, ఉక్రెయిన్, కజకిస్థాన్ కూడా ఈ టోర్నీలో ఆడనున్నాయి. అత్యధిక పాయింట్లు సాధించిన తొలి మూడు జట్లకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు అందజేస్తారు. భారత మహిళలకు హాకీలో మరో ఓటమి న్యూఢిల్లీ: హాక్స్ బే కప్ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత జట్టుకు మరో ఓటమి ఎదురైంది. అమెరికాతో శనివారం జరిగిన క్లాసిఫికేషన్ మ్యాచ్‌లో టీమిండియా 0-3 గోల్స్ తేడాతో ఓడిపోయింది. దాంతో ఆదివారం భారత జట్టు ఏడు, ఎనిమిది స్థానాల కోసం జరిగే మ్యాచ్‌లో జపాన్‌తో ఆడుతుంది. -
ఆంధ్రపై హైదరాబాద్ గెలుపు
సౌత్‌జోన్ క్యారమ్ చాంపియన్‌షిప్ సాక్షి, హైదరాబాద్: సౌత్‌జోన్ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో తొలిరోజు హైదరాబాద్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. కొంపల్లిలోని శివ శివాని ఇన్స్టిట్యూట్లో శుక్రవారం ప్రారంభమైన ఈ పోటీల టీమ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ పురుషుల, మహిళల జట్లు తొలి రౌండ్లో ఆంధ్ర జట్లపై గెలుపొందగా, రెండో రౌండ్లో పురుషుల జట్టు కర్ణాటక చేతిలో ఓటమి పాలైంది. ఆంధ్రతో జరిగిన పురుషుల తొలి రౌండ్లో రవిందర్ గౌడ్ 25-0, 25-4తో మనోహర్‌పై, నవీన్ 25-0, 18-21, 25-4తో రమణపై గెలిచి హైదరాబాద్‌కు 2-0 ఆధిక్యాన్ని అందించారు. అయితే డబుల్స్‌లో ఎస్.సాయిబాబా-యు.నరేశ్ జోడి 10-25, 5-23తో వై.శ్రీనివాసరావు-టి.సురేశ్ జంట చేతిలో ఓటమి పాలవడంతో హైదరాబాద్ ఆధిక్యం 2-1కి తగ్గింది. అనంతరం కర్ణాటకతో జరిగిన రెండో రౌండ్లో హైదరాబాద్ 1-2తో ఓడింది. ఇక మహిళల తొలిరౌండ్ పోటీల్లో హైదరాబాద్ 2-1తో ఆంధ్రను ఓడించింది. జి.మాధవి 0-25, 7-22తో రాజ్యలక్ష్మి చేతిలో ఓడినా, సవితా దేవి 25-0, 25-0తో మాధురిపై, పద్మజ-శ్వేత జోడి 25-0, 25-1తో జ్యోత్స్నా రవళి-శ్రావణి జంటను ఓడించడంతో హైదరాబాద్ గెలుపొందింది. మహిళల తొలి రౌండ్‌లోని ఇతర మ్యాచ్‌ల్లో తమిళనాడు 3-0తో పాండిచ్చేరిపై, కర్ణాటక 3-0తో ఆంధ్రపై విజయం సాధించాయి. పురుషుల తొలి రౌండ్లో జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో తమిళనాడు 3-0తో పాండిచ్చేరిపై, కర్ణాటక 2-1తో కేరళపై గెలుపొందాయి. ఇక పురుషుల రెండో రౌండ్లో తమిళనాడు 3-0తో ఆంధ్రపై, కేరళ 2-1తో పాండిచ్చేరిపై గెలుపొందాయి. అంతకుముందు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ సీహెచ్.మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, శివ శివాని ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ ఆరతి సంపతి, అంతర్జాతీయ క్యారమ్ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్.కె.శర్మ పాల్గొన్నారు.