breaking news
Tamil Nadu Congress Committee
-
హస్తంలో సారథి పోరు
జవసత్వాలు కోల్పోయిన త మిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) సారథిగా కొత్త వ్యక్తిని నియమించడం ద్వారా బలోపేతం చేయాలన్న ప్రయత్నాలు ఊపందుకున్నాయి. అధ్యక్షుడిని మార్చదలుచుకుంటే జీకే వాసన్‌కే పట్టం కట్టాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వెలిసిన పోస్టర్లు చర్చనీయాంశమయ్యూయి. చెన్నై, సాక్షి ప్రతినిధి:ప్రాంతీయ పార్టీల పొత్తులతోనే ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న టీఎన్‌సీసీ ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరి పోరుకు దిగింది. కాంగ్రెస్‌తో పొత్తుకు ఏ చిన్న ప్రాంతీయ పార్టీ కూడా ముందుకు రాకపోవడంతో ఏకాకిగానే పోటీచేసి అనేక స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. పార్టీ పరాజయం పాలుకాగానే ప్రస్తుత టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్‌ను బాధ్యతల నుంచి తొలగించాలనే నినాదాలు మొదలయ్యూయి. కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం వర్గీయులే ఈ నినాదాలకు నేతృత్వం వహించారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్‌లో బలమైన క్యాడర్ కలిగి ఉన్న జీకే వాసన్ మద్దతు ఉండడంతో అధిష్టానం తాత్కాలికంగా మిన్నకుండిపోయింది. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఆ తరువాత చూద్దాంలెమ్మని సర్దిచెప్పింది. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు ముగిసిపోయి ఆ రెండు రాష్ట్రాల్లో సైతం కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడంతో పార్టీ అధ్యక్షుల మార్పు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. దేశంలో నానాటికీ తరిగిపోతున్న కాంగ్రెస్ ప్రాభవాన్ని కాపాడుకునేందుకు అధ్యక్షుల మార్పు అనివార్యమనే ఆలోచనలో అధిష్టానం పడిపోయింది. జీకే వాసన్ పోస్టర్లు మరో రెండేళ్లలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఇతర రాష్ట్రాల్లోని ఫలితాలే తమిళనాడులో పునరావృతం కాకుండా కాంగ్రెస్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో టీఎన్‌సీసీ అధ్యక్షుని మార్పు అంశం అత్యంత ప్రాధాన్యమైంది. జీకే ముప్పనార్ కాంగ్రెస్‌ను వీడి తమిళ మానిల కాంగ్రెస్ పార్టీ స్థాపించినపుడు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఆయన వెంటనడిచారు. ముప్పనార్ మరణం తరువాత ఆయన కుమారుడు జీకే వాసన్ ఆ పార్టీని జాతీయ కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఈ కారణంగా రాష్ట్రంలో జీకే వాసన్‌కు బలమైన అనుచర వర్గం ఉంది. టీఎన్‌సీసీ అధ్యక్షుని మార్పు అనివార్యమని అధిష్టానం భావించినట్లయితే జీకే వాసన్‌కే అవకాశం ఇవ్వాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల పోస్టర్లు అంటించారు. ‘అయ్యానే కాంగ్రెస్..కాంగ్రెస్సే అయ్యా జీకే వాసన్’ అనే నినాదంతో పోస్టర్లు వెలిశాయి. పనిలోపనిగా ఆ పోస్టర్లలో దీపావళి శుభాకాంక్షలు సైతం పొందుపరిచారు. కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం కూడా తనకు లేదా తన అనుచరునికి టీఎన్‌సీసీ పగ్గాలు అప్పగించాలని కోరుతున్నారు. జీకే వాసన్ నాయకత్వాన్ని తీవ్రంగా విబేధించే పీ చిదంబరం గట్టి పోటీనే ఇచ్చే అవకాశం ఉంది. అయితే జీకే వాసన్‌ను విస్మరిస్తే తమిళ మానిల కాంగ్రెస్ ఎక్కడ మళ్లీ పుట్టుకొస్తుందోననే భయం అధిష్టానంలో ఉంది. టీఎన్‌సీసీ అధ్యక్షునిగా జ్ఞానదేశికన్‌ను కొనసాగించినా లేదా ఆయనను బలపరిచే జీకే వాసన్‌ను నియమించినా కొత్త సీసాలో పాత సారా మాదిరిగా తయరై అసలు ఉద్దేశం నీరుగారిపోతుందని కాంగ్రెస్ యోచిస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలను పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్వయంగా పర్యవేక్షిస్తుండగా ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోంటారోననే ఆసక్తి నెలకొంది. -
టీఎన్‌సీసీకి కొత్త కార్యవర్గం
రాష్ర్ట కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యవర్గం జాబితా సిద్ధమైంది. ఇది మరో మూడు రోజుల్లో వెలువడుతుందని టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ ప్రకటించారు. సాక్షి, చెన్నై: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కార్యవర్గం నియమించి పన్నెండేళ్లు అవుతోంది. ఎందరు అధ్యక్షులు వచ్చినా కార్యవర్గం ఏర్పాటుపై ఏ ఒక్కరూ దృష్టి పెట్టలేదు. దీంతో పార్టీ వర్గాల్లో అసంతృప్తి నెలకొంది. కార్యవర్గం నియూమకంపై దృష్టి పెట్టాలంటూ ఏఐసీసీకి పదేపదే విజ్ఞప్తులు వెళ్లాయి. ఈ క్రమంలో కేంద్ర నౌకాయూనశాఖ మంత్రి జీకేవాసన్ మద్దతుదారుడు జ్ఞానదేశికన్ టీఎన్‌సీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కొత్త కార్యవర్గం ఏర్పాటుపై ఆయన దృష్టి సారించారు. జ్ఞానదేశికన్ సిద్ధం చేసిన జాబితాలను పలుమార్లు పక్కన పెట్టారు. పార్టీలోని గ్రూపు రాజకీయాల పుణ్యమా అని ఆ జాబితాల్లో మార్చులు చేర్పులు చోటు చేసుకున్నాయి. అయితే కార్యవర్గం ప్రకటన మాత్రం వెలువడలేదు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్గా ముకుల్ వాస్నిక్ బాధ్యతలు చేపట్టడంతో కార్యవర్గం ఏర్పాటుపై ఒత్తిడి పెరిగింది. దీంతో వాస్నిక్ చకచకా పావులు కదిపారు. కొత్త జాబితాను సిద్ధం చేసి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌కు సమర్పించారు. ఈ జాబితా పది రోజుల క్రితం వెలువడుతుందని అందరూ భావించా రు. అయితే కొన్ని గ్రూపుల నేతలు మోకాలొడ్డడంతో వాయిదా పడింది. ఎట్టకేలకు అన్ని అడ్డంకులనూ అధిగమించి కొత్త జాబితాను ముకుల్ వాస్నిక్ సిద్ధం చేశా రు. రాహుల్ ఆమోదం పొందిన ఈ జాబితా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సంతకం కోసం ఎదురు చూస్తోంది. మూడు రోజుల్లో.. టీఎన్‌సీసీ కార్యవర్గం జాబితా మరో మూడు రోజుల్లో వెలువడుతుందని జ్ఞానదేశికన్ ధీమా వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు దీరర్ సత్యమూర్తి, కాంగ్రెస్ సీనియర్ నేత జీకే మూపనార్ జయంతి వేడుకలు సత్యమూర్తి భవన్లో సోమవారం జరిగాయి. ఈ సందర్భంగా జ్ఞానదేశికన్ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర కార్యవర్గం కమిటీ ఎంపిక ప్రక్రియ ముగిసిందని, మూడు రోజుల్లో జాబితా వెలువడుతుందని ప్రకటిం చారు. పార్టీ కోసం శ్రమిస్తున్న వారందరికీ పదవులు దక్కబోతున్నాయని పేర్కొన్నారు.