breaking news
Tadipatri Police station
-
పక్కా ప్లాన్.. ప్రియుడితో కలిసి సొంతింట్లో లూటీ, టైం చూసి జంప్
తాడిపత్రి : బంగారం అపహరణ కేసులో మిస్టరీని తాడిపత్రి పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం విలేకరుల సమావేశంలో తాడిపత్రి డీఎస్పీ వీఎన్కే చైతన్య వెల్లడించారు. తాడిపత్రి పట్టణంలోని నంద్యాల రోడ్డు సమీపంలో పక్కపక్క ఇళ్లలో సోదరులు హాజీవలి, షాజహాన్ నివాసముంటున్నారు. ఈ ఏడాది మే 22న ఈ రెండు ఇళ్లలో రూ.7.50లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు తాడిపత్రి రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సొంతింటికే కన్నం షాజహాన్ భార్య షాహీనా. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్థానికంగా ఉండే బాలబ్రహ్మయ్యతో ఆమెకు వివాహేతర సంబంధం ఉంది. ఇద్దరు శాశ్వతంగా కలిసి ఉండాలని నిర్ణయించుకుని పథకం ప్రకారం మే 22న తన ఇంటిలోని బంగారు, వెండి ఆభరణాలతో పాటు, పొరుగున ఉన్న తన బావ ఇంటిలోని బంగారు, వెండి ఆభరణాలను బ్రహ్మయ్యకు అందజేసి, ఏమీ తెలియని దానిలా ఇంటిలోనే ఉండిపోయింది. ఈ కేసు విచారణ దశలో ఉండగానే.. అదే నెల 28న కుమార్తెతో కలిసి షాహీనా అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. దీంతో భార్య కనిపించడం లేదంటూ షాజహాన్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడిన చిక్కుముడి షాహీనా కనిపించడం లేదంటూ భర్త షాజహాన్ ఇచ్చిన ఫిర్యాదుతో తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ జీటీ నాయుడు, ఎస్ఐ ఖాజాహుస్సేన్ అప్రమత్తమయ్యారు. గతంలో జరిగిన చోరీకి, ఆమె కనించకుండా పోవడానికి కారణాలను అన్వేషిస్తూ వెళ్లారు. ప్రకాశం జిల్లా మార్టూరులో ఆమె ఆచూకీ పసిగట్టారు. ఈ నెల 23న మార్టూరుకు చేరుకుని షాహీనాతో పాటు ఆమె ప్రియుడు బాలబ్రహ్మయ్యను అరెస్ట్ చేసి తాడిపత్రికి పిలుచుకువచ్చారు. చోరీ చేసుకెళ్లిన 16 తులాల బంగారు నగలతో పాటు 600 గ్రాముల వెండి ఆభరణాలను స్వాదీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.7.50 లక్షలుగా ఉంటుంది. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. కాగా, కేసులో మిస్టరీని ఛేదించిన సీఐ, ఎస్ఐతో పాటు కానిస్టేబుళ్లను ఈ సందర్భంగా ఎస్పీ ఫక్కీరప్ప అభినందించారు. -
తాడిపత్రి మండలంలో నెలకొన్న ఉద్రిక్తత
సాక్షి, అనంతపురం: జిల్లాలోని తాడిపత్రి మండలం ఊరుచింతలలో పెన్నా సిమెంట్స్ పరిశ్రమ ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత నెలకొంది. తమకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నకారణంతో మనస్తాపం చెందిన పెద్దిరాజు అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా గ్రామస్తులు అడ్డుకున్నారు. -
తాడిపత్రి పోలీసు స్టేషన్లో ఎమ్మెల్యే జేసీ వీరంగం!
అనంతపురం: తాడిపత్రి పోలీసు స్టేషన్లో టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వీరంగం సృష్టించారు. తన అనుచరుడు శివనాయుడు విడుదల చేయాలని పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని ఉద్దేశించి అనంతపురం మేయర్ స్వరూప బుధవారం తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇలా విమర్శించినందుకు మేయర్ స్వరూప, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిలకు జేసీ అనుచరుడు శివనాయుడు ఫోన్ చేసి బెదిరించారు. దీనిపై వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు శివనాయుడిని అరెస్టు చేశారు. అయితే, తన అనుచరుడినే అరెస్టు చేస్తారా అంటూ ఎమ్మెల్యే జేసీ పోలీసు స్టేషన్లో వీరంగం సృష్టించారు. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూపలను బెదిరించిన కేసులసో జేసీ వర్గీయుడు శివనాయుడిని అరెస్టుచేశామని, అయితే, స్టేషన్ బెయిల్ మీద ఆయనను విడుదల చేశామని తాడిపత్రి సీఐ మురళీకృష్ణ చెప్తున్నారు. ఈ వ్యవహారంలో తాడిపత్రి పోలీసులను జేసీ వర్గీయులు బండబూతులు తిట్టారు. -
ఓటెత్తిన చైతన్యం
సాక్షి ప్రతినిధి, అనంతపురం : సూరీడుతో ఓటర్లు పోటీపడ్డారు.. ఎండ మండే కొద్దీ ఓటర్లు అధికమయ్యారు.. సూర్యుడు మండుతున్న కొద్దీ ఓటర్లు రెట్టింపవుతూ పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.. ఓటు హక్కును వినియోగించుకున్నారు. మడకశిరలో సీఐ ఆరోహన్‌రావు దౌర్జన్యం.. తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వీరంగం వంటి చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తాడిపత్రి 12వ వార్డులో ఈవీఎం మొరాయించడంతో మంగళవారం రీ-పోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదీ ఆదివారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తీరు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం నగరపాలక సంస్థతోపాటు 11 మున్సిపాల్టీలు, నగర పంచాయతీలకు ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భారీ స్థాయిలో బారులు తీరారు. మండుతున్న ఎండను లెక్క చేయలేదు. ఉక్కపోతనూ ఖాతరు చేయలేదు. యువతీ యువకులతో వృద్ధులు కూడా పోటీపడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మడకశిర నగర పంచాయతీ పరిధిలో అత్యధికంగా 85.22 శాతం మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతపురం నగరంలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవడంపై పెద్దగా ఆసక్తి చూపలేదు. షరా మామూలే.. 2004 సార్వత్రిక ఎన్నికలు.. 2005 మున్సిపల్ ఎన్నికలు.. 2009 సార్వత్రిక ఎన్నికలు.. 2012 ఉప ఎన్నికలు తరహాలోనే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఈవీఎంలు పలు చోట్ల మొరాయించడంతో పోలింగ్ అర్ధగంట పాటు ఆగిపోయింది. అనంతపురం నగరంలో 21వ డివిజన్ పోలింగ్ బూత్‌లో, తాడిపత్రిలో 34వ వార్డు, గుంతకల్లులో 7వ వార్డు, గుత్తిలో 5, 21వ వార్డులు, కళ్యాణదుర్గంలో 1, 3వ వార్డులు, రాయదుర్గంలో 14వ వార్డు, ధర్మవరంలో 21వ వార్డు, పుట్టపర్తిలో 11, 18వ వార్డులు, హిందూపురంలో 12వ వార్డు, మడకశిరలో 15, 16, 19వ వార్డులు, కదిరిలో 5, 15, 25, 33వ వార్డుల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌కు కాసేపు అంతరాయం గలిగింది. ఆ తర్వాత ఈవీఎంలను సరిచేసి.. పోలింగ్‌ను నిర్వహించారు. తాడిపత్రిలో 12వ వార్డులో 20 ఓట్లు పోలైన తర్వాత ఈవీఎం మొరాయించింది. కేవలం పది ఓట్లు మాత్రమే పోలైనట్లు ఈవీఎంలో నమోదైంది. ఆ ఈవీఎం స్థానంలో కొత్తది ఏర్పాటుచేసి.. పోలింగ్ కొనసాగించడానికి అధికారులు ప్రయత్నించారు. కానీ.. అది కూడా మొరాయించడంతో పోలింగ్‌ను మంగళవారానికి వాయిదా వేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించాలని జిల్లా ఎన్నికల అధికారి డీఎస్ లోకేష్‌కుమార్ నివేదిక పంపారు. అందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అంగీకరించడంతో 12వ వార్డుకు మంగళవారం రీ-పోలింగ్ నిర్వహించనున్నారు. బీఎల్వోల నిర్లక్ష్యం.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు స్లిప్పుల పంపిణీని తొలి సారిగా బీఎల్వోలకు అప్పగించింది. పోలింగ్‌కు 24 గంటల ముందే ఓటర్లకు ఓటరు స్లిప్పులను పంపిణీ చేస్తామని పేర్కొంది. రాజకీయ పార్టీలు పంపిణీ చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించింది. కానీ.. ఎన్నికల సంఘం ఆదేశాలను బీఎల్వోలు నీరుగార్చారు. ఓటరు స్లిప్పుల పంపిణీని తీవ్రంగా నిర్లక్ష్యం చేశారు. స్లిప్పులేని వారిని ఓటు వేసేందుకు పోలింగ్ అధికారులు నిరాకరించడంతో వేలాది మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోకుండానే వెనుతిరిగారు. అనంతపురం నగరంలో అత్యల్ప పోలింగ్ నమోదు కావడానికి ఇదే ప్రధాన కారణమని అధికారులు అంగీకరిస్తుండటం గమనార్హం. గుంతకల్లు, తాడిపత్రి, రాయదుర్గం, హిందూపురం, కదిరి, ధర్మవరం మున్సిపాల్టీల్లోనూ ఇదే పరిస్థితి. తప్పుల తడకగా ఓటర్ల జాబితా.. మున్సిపల్ ఎన్నికల ఓటర్ల జాబితాలు తప్పులతడకగా మారాయి. ఓటరు గుర్తింపు కార్డు ఉన్న వారి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగించారు. ఇతర నియోజకవర్గాల్లోని ఓటరు జాబితాలో పేర్లున్న వారి పేర్లను కూడా మున్సిపాల్టీల ఓటర్ల జాబితాలో చేర్చారు. ఇది తీవ్ర గందరగోళానికి దారితీసింది. అనంతపురం నగరంలో 20వ డివిజన్లో టీడీపీ అభ్యర్థి స్వరూపకు మద్దతుగా ఓటు వేయించుకునే కుట్రతో పెరవలి గ్రామానికి చెందిన ఓటర్లను ఆ జాబితాలో చేర్పించారు. సుమారు 130 మంది ఓటర్లు పోలింగ్ కేంద్రానికి చేరుకోవడంతో ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇతర నియోజకవర్గాల్లోని ఓటర్లు ఇక్కడెలా ఓటు వేస్తారని నిలదీశారు. ఓటర్లను భయపెడుతున్నారంటూ స్వరూప ఆందోళనకు దిగడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. టీడీపీ నేతలను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది. హిందూపురం, ధర్మవరం, కదిరి మున్సిపాల్టీల్లోనూ ఇదే పరిస్థితి. మడకశిరలో సీఐ.. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ వీరంగం.. మడకశిరలో నడువలేని స్థితిలో ఉన్న ముగ్గురు వృద్ధులను ఓటు వేయించేందుకు కాంగ్రెస్ నేత, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి 16వ పోలింగ్ బూత్ వద్దకు తీసుకొచ్చారు. అక్కడే బందోబస్తును పర్యవేక్షిస్తోన్న సీఐ ఆరోహన్‌రావు ఓటర్లను వాహనాల్లో తరలిస్తావా అంటూ ప్రభాకర్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. లాఠీలతో కుళ్లబొడిచారు. సీఐ దెబ్బకు ప్రభాకర్‌రెడ్డి ఎడమ చేయి విరగడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహించాయి. ఎమ్మెల్యే సుధాకర్ నేతృత్వంలో పోలీసుస్టేషన్ ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో డీఎస్పీ సుబ్బారావు సంఘటనపై విచారణ జరిపి.. సీఐపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే సుధాకర్ ధర్నాను విరమించారు. పోలింగ్‌కు ఆటంకం కల్పిస్తారనే ఉద్దేశంతో తాడిపత్రిలో ఆదివారం ఉదయం ఏడు గంటలకే వైఎస్సార్సీపీ నేతలు పేరం నాగిరెడ్డి, వీఆర్ రామిరెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేసి జేసీ ప్రభాకర్‌రెడ్డి.. తాడిపత్రి పోలీసుస్టేషన్‌ను ముట్టడించి డీఎస్పీ నాగరాజు, సీఐ సుధాకర్‌రెడ్డిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కాసేపు హల్చల్ చేశారు. ఆ తర్వాత జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఆయన ఇంటికి తరలించిన పోలీసులు.. అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. రాయదుర్గంలో 12వ వార్డులో ఓ టీడీపీ నేత ఇంట్లో ఓటర్లకు భారీ ఎత్తున డబ్బులు పంపిణీ చేస్తోండటంతో.. ఆ ఇంటిని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నేతృత్వంలో వైఎస్సార్సీపీ శ్రేణులు ముట్టడించాయి. ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ దశలో పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. అనంతపురం, రాయదుర్గంలో ఓటర్లకు టీడీపీ నేతలు నకిలీ రూ.వెయ్యి నోట్లు పంపిణీ చేశారు. టీడీపీ నేతలు ఇచ్చిన కరెన్సీ నోట్లతో వస్తువులు కొనుగోలు చేసేందుకు దుకాణాలకు వెళ్లిన ఓటర్లకు.. అవి నకిలీ నోట్లని తేలడంతో లబోదిబోమన్నారు.