breaking news
Tadepallygudem police
-
మత్తులో కత్తులతో వీరంగం!
సాక్షి, తాడేపల్లి(మంగళగిరి): పట్టణ పరిధిలోని నులకపేట ప్రాంతంలో స్థానికేతరులు కొంతమంది మద్యంతో పాటు వివిధ రకాల మత్తు పదార్థాలు తీసుకుని, స్థానికంగా నివసించే మహిళలు, విద్యార్థులను ఇబ్బందులకు గురిజేస్తున్నారు. స్థానికులు శనివారం రాత్రి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా కత్తులు చూపించి పరారయ్యారు. ఎవరిదారిన వారు వెళ్లిన అనంతరం తిరిగి మరలా ఆదివారం తెల్లవారుజామున ఘటనా స్థలానికి వచ్చి కొంతమందిని నిద్రలేపి దౌర్జన్యానికి పాల్పడ్డారు. మొదట యువకులు కత్తులు తీసుకొని నులకపేట వీధుల్లో వీరంగం వేయడంతో, స్థానికులు అడ్డుకున్నారు. వారు వేసుకొచ్చిన ద్విచక్రవాహనాన్ని, ఆటోను అక్కడే వదిలి పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత వదిలిపెట్టిన ఆటోను అక్కడ నుంచి తీసుకెళ్లారు. తిరిగి మరలా అదే వాహనంలో వచ్చి స్థానికంగా నివసించే వారిని భయభ్రాంతులకు గురిచేయడంతో, తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మత్తులో ఉండి ఓ ద్విచక్ర వాహనాన్ని కూడా అక్కడే వదిలివెళ్లారు. ఆ వాహనాన్ని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఆ వాహనానికి లైట్లు, వెనుక ముందు నంబరు ప్లేటు లేకపోవడం మరో ఎత్తు. ఈ వాహనంతో రాత్రి సమయంలో పెద్దపెద్ద శబ్దాలు చేసుకుంటూ మసీదు దగ్గర ఉన్న ఉర్దూ పాఠశాలలో కూర్చుని గంజాయి తాగి, వచ్చిపోయే ఆడవారిని, విద్యార్థినులను ఏడిపిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇదే యువకులు మసీదులో ప్రార్థన జరుగుతున్నప్పుడు ద్విచక్ర వాహనానికి సైలెన్సర్ తీసేసి, హడావుడి చేయడంతో, ముస్లిం పెద్దలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు అప్పట్లో జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి, నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజరు పరిచారు. మరలా బయటకు వచ్చిన తరువాత కొంతకాలం స్తబ్దుగా ఉన్న యువకులు మరలా అదే తరహాలో రోడ్లమీద తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టారు. మత్తులో గొడవ పడిన నలుగురు యువకులు పరారీలో ఉండటంతో వారి ఆచూకీ కోసం పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
ఘోర రోడ్డు ప్రమాదం..!
సాక్షి, పశ్చిమగోదావరి : పెద్ద తాడేపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో ప్రయాణిస్తున్న కారు.. హైవే పక్కన ఉన్న రైలింగ్‌ను ఢీకొట్టింది. ఇనుపరేకులు మెడలోకి చొచ్చుకుపోవడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో జూనియర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వారపరెడ్డి శ్రీనివాస్ అతని భార్య అన్నపూర్ణ(50), మనవడు ఆరుష్(1) ని తీసుకుని కృష్ణా జిల్లా గుంటుమిల్లికి వెళ్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవింగ్ చేస్తున్న శ్రీనివాస్‌కు స్వల్ప గాయాలు కాగా, అతని భార్య , మనవడు మృతి చెందారు. నిద్రమత్తులో వాహనాన్ని నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అదే ఆసుపత్రిలో గాయపడిన శ్రీనివాస్‌కు చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఫ్లెక్సీల వివాదంలో పోలీసుల అత్యుత్సాహం
ఏలూరు: ఫ్లెక్సీల వివాదంలో తాడేపల్లిగూడెం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ వివాదంలో మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సత్యనారాయణ అరెస్ట్‌ను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఒత్తిడి మేరకే సత్యనారాయణను అరెస్ట్ చేశారంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఐని బండ బూతులు తిట్టిన మంత్రి మాణిక్యాలరావును వదిలి.. సత్యనారాయణను అరెస్ట్ చేయడమేంటంటూ వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.