మత్తులో కత్తులతో వీరంగం!

Drunk Young Men Terrorising People With Swords & By Making Unusual Noises In Tadepally - Sakshi

నులకపేటలో నానా హంగామా చేసిన యువకులు

స్థానికులు తిరగబడితే వాహనాలు వదిలి పరారైన వైనం

పోలీసులకు ఫిర్యాదు

సాక్షి, తాడేపల్లి(మంగళగిరి):  పట్టణ పరిధిలోని నులకపేట ప్రాంతంలో స్థానికేతరులు కొంతమంది మద్యంతో పాటు వివిధ రకాల మత్తు పదార్థాలు తీసుకుని, స్థానికంగా నివసించే మహిళలు, విద్యార్థులను ఇబ్బందులకు గురిజేస్తున్నారు. స్థానికులు శనివారం రాత్రి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా కత్తులు చూపించి పరారయ్యారు.

ఎవరిదారిన వారు వెళ్లిన అనంతరం తిరిగి మరలా ఆదివారం తెల్లవారుజామున ఘటనా స్థలానికి వచ్చి కొంతమందిని నిద్రలేపి దౌర్జన్యానికి పాల్పడ్డారు. మొదట యువకులు కత్తులు తీసుకొని నులకపేట వీధుల్లో వీరంగం వేయడంతో, స్థానికులు అడ్డుకున్నారు. వారు వేసుకొచ్చిన ద్విచక్రవాహనాన్ని, ఆటోను అక్కడే వదిలి పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత వదిలిపెట్టిన ఆటోను అక్కడ నుంచి తీసుకెళ్లారు. తిరిగి మరలా అదే వాహనంలో వచ్చి స్థానికంగా నివసించే వారిని భయభ్రాంతులకు గురిచేయడంతో, తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మత్తులో ఉండి ఓ ద్విచక్ర వాహనాన్ని కూడా అక్కడే వదిలివెళ్లారు. ఆ వాహనాన్ని స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఆ వాహనానికి లైట్లు, వెనుక ముందు నంబరు ప్లేటు లేకపోవడం మరో ఎత్తు. ఈ వాహనంతో రాత్రి సమయంలో పెద్దపెద్ద శబ్దాలు చేసుకుంటూ మసీదు దగ్గర ఉన్న ఉర్దూ పాఠశాలలో కూర్చుని గంజాయి తాగి, వచ్చిపోయే ఆడవారిని, విద్యార్థినులను ఏడిపిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

గతంలో కూడా ఇదే యువకులు మసీదులో ప్రార్థన జరుగుతున్నప్పుడు ద్విచక్ర వాహనానికి సైలెన్సర్‌ తీసేసి, హడావుడి చేయడంతో, ముస్లిం పెద్దలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు అప్పట్లో జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి, నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజరు పరిచారు. మరలా బయటకు వచ్చిన తరువాత కొంతకాలం స్తబ్దుగా ఉన్న యువకులు మరలా అదే తరహాలో రోడ్లమీద తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టారు. మత్తులో గొడవ పడిన నలుగురు యువకులు పరారీలో ఉండటంతో వారి ఆచూకీ కోసం పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top