దుర్ముఖి మంచే చేస్తుంది: గవర్నర్
రాజ్‌భవన్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
* సీఎంలు కేసీఆర్, చంద్రబాబు హాజరు
* ఇదే దుర్ముఖి గొప్పదనమన్న గవర్నర్
* రెండు రాష్ట్రాలూ అభివృద్ధి చెందాలి
* తెలుగు ప్రజలకు శాంతి సౌభాగ్యాలు కలగాలి: కేసీఆర్
* కష్టాలు తీరాలి, సుఖసంతోషాలు కలగాలి: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: దుర్ముఖి అనగానే భయమేస్తుంది గానీ, అది మంచే చేస్తుందని ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ వ్యాఖ్యానించారు. ‘‘దుర్ముఖి నరసింహావతారం. నరసింహుడు హిరణ్యకశిపుడిని సంహరించి లోకకల్యాణం చేశాడు. అలాగే దుర్ముఖినామ సంవత్సరంలో కూడా అన్ని మంచి పనులే జరుగుతాయి’’ అని అభిప్రాయపడ్డారు.
శ్రీ దుర్ముఖినామ ఉగాది వేడుకలు గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ సారథ్యంలో ఘనంగా జరిగాయి. సాయంత్రం ఆరింటి నుంచి రాత్రి ఎనిమిది గంటల దాకా జరిగిన ఈ అధికారిక వేడుకల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఏపీ సీఎం చంద్రబాబు, ఇరు రాష్ట్రాల మంత్రులు, పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ‘‘భిన్నత్వంలో ఏకత్వంలా ఈ ఉగాది వేడుకల్లో ఇరు రాష్ట్రాల వారూ పాల్గొన్నారు. అదే దుర్ముఖి గొప్పదనం’’ అని ఈ సందర్భంగా గవర్నర్ పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో రెండు రాష్ట్రాలూ ఎంతో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ‘‘రాజ్‌భవన్‌లో ఒకసారి ముందుకు పోతేనే మంచిదని ఒక రోజు ముందే వేడుకలు జరిపాం’’ అన్నారు. ఇద్దరు సీఎంలకు గవర్నర్ శాలువాలు కప్పి సత్కరించారు.
రాజ్‌భవన్‌లో వేడుకలు హర్షణీయం: సీఎం కేసీఆర్
తెలుగు సంప్రదాయాన్ని గౌరవిస్తూ రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలు నిర్వహించడం సంతోషదాయకమని కే సీఆర్ పేర్కొన్నారు. గవర్నర్ తమిళుడైనా ఉగాది వేడుకలను అధికారికంగా నిర్వహించడం గర్వకారణమన్నారు. ఈసారి కరువు పరిస్థితి ఉండదని, మంచి వర్షాలు కురుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పంచాంగమే గాక సైన్సు కూడా అదే చెబుతోందన్నారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి. వారికి శాంతి సౌభాగ్యాలు కలగాలి’’ అని ఆయన ఆకాంక్షించారు.
అచ్చం తెలుగువారిలా గవర్నర్: బాబు
తెలుగు వారందరికీ ఉగాది ప్రత్యేకమని చంద్రబాబు అన్నారు. ‘‘పంచాంగశ్రవణం ద్వారా మంచి చెడులను విశ్లేషించుకుని ముందుకెళ్లే అవకాశముంటుంది. మానసికంగా సిద్ధం కావడానికీ ఉపయోగపడుతుంది. ఒకరోజు ముందుగానే ఉగాది వేడుకలు జరిపిన గవర్నర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నా’’ అన్నారు. ఈ ఏడాది తెలుగువారందరికీ కష్టాలు తీరి, వారు సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. ‘‘కొత్త రాష్ట్రం అంటే కొత్త సంసారం లాంటిది. అనేక సమస్యలున్నా తెలుగు ప్రజల ఆశీస్సులతో మంచి రాష్ట్రంగా తయారు చేసుకునేందుకు కష్టపడతాం.
ఏపీ అభివృద్ధికి గవర్నర్ సహకారమందిస్తూ ప్రోత్సహిస్తున్నారు’’ అన్నారు. వేడుకల్లో ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి.బొసాలే, శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి, సీఎల్పీ నేత జానారె డ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతులు, ఏపీ మండలి చైర్మన్ చక్రపాణి, ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, సినీ నటుడు చిరంజీవి దంపతులు తదితరులు పాల్గొన్నారు. ఉగాది వేడుకల్లో జుగల్బందీ, భరతనాట్యంతో పాటు ఒగ్గు డోళ్ల నృత్యం తదితరాలు ఆకట్టుకున్నాయి.
ఈ ఏడాది శుభప్రదమే
దుర్ముఖి అనగానే చెడుగా, విపరీతార్థం తీసుకోవద్దని రాజ్‌భవన్ ఉగాది వేడుకల్లో పంచాంగశ్రవణం చేసిన కొండగడప శ్రీవిద్యా శ్రీధర్‌శర్మ చెప్పారు. ఈ ఏడాది శుభప్రదంగా ఉంటుందన్నారు. గతం కంటే భిన్నంగా లేకున్నా, ప్రమాదకరంగా కూడా లేదని చెప్పారు. ‘‘వాతావరణం విభిన్నంగా ఉంటుంది. స్త్రీల ఉత్పత్తి 15 శాతం, పురుష ఉత్పత్తి 9 శాతం ఉంటాయి. భ్రూణ హత్యలుండవు. స్త్రీలపై దాడులు తగ్గుతాయి.
మేఘాధిపతి బుధుడు కావడంతో వర్షాలు బాగా పడతాయి. వర్షాభావ పరిస్థితులుండవు. ఏడాది ద్వితీయార్ధంలో సెప్టెంబరు నుంచి వర్షాలు ఎక్కువ కురుస్తాయి. ఈ ఏడాది రెండు గ్రహణాలున్నా అవి తెలుగు రాష్ట్ర్రాల్లో కనిపించవు. ఈ ఏడాది ఆగస్టు 11న కృష్ణా పుష్కరాలు ప్రారంభమవుతాయి. విదేశాల్లో సామూహిక ఉపద్రవాలు సంభవిస్తాయి’’ అని చెప్పారు.