breaking news
suspension petition
-
రోజా పిటిషన్‌పై తీర్పు నేడు
హైకోర్టు ధర్మాసనంలో ముగిసిన వాదనలు ♦ సస్పెన్షన్ సహజన్యాయసూత్రాలకు విరుద్ధం ♦ పిటిషనర్ వాదన కూడా వినలేదు ♦ రోజా తరఫు న్యాయవాది వాదన ♦ 340(2) కాదు.. 194(3) కింద సస్పెన్షన్ ♦ అది శాసనసభ తీసుకున్న నిర్ణయం ♦ అదనపు అడ్వొకేట్ జనరల్ వాదన సాక్షి, హైదరాబాద్: ఏపీ శాసనసభ నిబంధనల్లోని రూల్ 340(2) ప్రకారం తనపై ఏడాదిపాటు సస్పెన్షన్ వేటు వేయడాన్ని సవాలు చేస్తూ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా సస్పెన్షన్.. అంతకు ముందు రోజా తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపిస్తూ, రూల్ 340 సబ్ రూల్ 2 ప్రకారం సస్పెన్షన్ కేవలం ఆ నిర్ధిష్ట సెషన్‌కు మాత్రమే పరిమితం అవుతుందని ఆమె వివరించారు. స్పీకర్ అధికారాలను తాము ప్రశ్నించడం లేదని, అయితే ఆ అధికారాన్ని సక్రమంగా ఉపయోగించారా?లేదా? అన్న దానిపైనే తమకు అభ్యంతరాలని ఆమె తెలిపారు. సస్పెన్షన్ ఆ నిర్ధిష్ట సెషన్‌కు మాత్రమే పరిమితమని రూల్ 340(2) స్పష్టంగా చెబుతుంటే, అందుకు విరుద్ధంగా ఏడాది పాటు సస్పెండ్ చేశారన్నారు. స్పీకర్ నిర్ణయం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని, ఇటువంటి పరిస్థితుల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చునని ఇటీవలే సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని ఆమె కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. న్యాయస్థానం జోక్యం చేసుకుంటే తప్ప తమకు రోజా సస్పెన్షన్ కాపీని ఇవ్వలేదని తెలిపారు. రోజా సస్పెన్షన్‌కు ప్రతిపాదించిన యనమల రామకృష్ణుడుకు రూల్ 340(2) కింద స్పీకర్‌కున్న అధికారాల గురించి స్పష్టంగా తెలుసునని, గతంలో ఆయన స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించారన్నారు. యనమల ఇచ్చిన వాయిదా తీర్మానం రూల్ 340(2)కి అనుగుణంగా లేదని, దానిని స్పీకర్ తిరస్కరించి ఉండాల్సిందని వివరించారు. అటు ఆ పనీ చేయకుండా, ఇటు సస్పెన్షన్‌కు ముందు వాదనలు వినిపించే అవకాశం రోజాకు ఇవ్వకుండా ఈ మొత్తం వ్యవహారంలో స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారని తెలిపారు. సస్పెన్షన్ విషయంలో రోజాకు జరిగిన అన్యాయం స్పష్టంగా కనబడుతోందన్నారు. కాల్‌మనీపై చర్చకు రోజా పట్టుపట్టారని, ఈ కారణంతోనే ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారని తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ, ఎవరిపై సస్పెన్షన్ వేటు వేస్తున్నారో ఆ వ్యక్తి పేరును స్పీకర్ ఎప్పుడు ప్రస్తావించాల్సి ఉంటుందని ప్రశ్నించారు. తీర్మానాన్ని ఆమోదిస్తున్నప్పుడు సస్పెన్షన్ ఎదుర్కొంటున్న వ్యక్తి పేరును స్పీకర్ ప్రస్తావించాల్సి ఉంటుందని, అయితే ఈ కేసులో స్పీకర్ ఏ పేరునూ ప్రస్తావించలేదన్నారు. ఇది కూడా నిబంధనలకు విరుద్దమని ఆమె తెలిపారు. రేపు ప్రతిపక్షం మొత్తాన్ని సస్పెండ్ చేసే అవకాశం.. అధికరణ 194(3) కింద స్పీకర్‌కున్న అధికారాలు వేరని, దాని ప్రకారం రోజాపై సస్పెన్షన్ వేటు వేయలేదని ఆమె ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఒకవేళ 194(3) కింద పిటిషనర్‌పై వేటు వేసి ఉంటే తాము మరో పిటిషన్ దాఖలు చేసి ఉండేవారమని ఆమె తెలిపారు. సభ రూపొందిం చిన నిబంధనలకు సభ కట్టుబడి ఉండాల్సిందేనని, వాటిని దాటి వ్యవహరించడానికి వీల్లేదని తెలిపారు. తమకు విస్తృత అధికారాలున్నాయని చెబుతున్న వ్యక్తులను సమర్థిస్తే వారు రేపు ప్రతిపక్షాన్ని మొత్తం సస్పెండ్ చేసి సభను తమకు కావాల్సిన విధంగా నడుపుకునే అవకాశం ఉందన్నారు. స్పీకర్ తన నిర్ణయాన్ని ఇప్పుడైనా సరిచేసుకోవచ్చునన్నారు. సభకు వెళ్లకుండా రోజాను అడ్డుకోవడం సరికాదని, ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయని, వాటికి రోజాను అనుమతినిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ఆమె కోర్టును కోరారు. శాసనసభ నిర్ణయమది.. తరువాత శాసనసభ కార్యదర్శి తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, రోజా సస్పెన్షన్ విషయంలో రాజ్యాంగంలోని అధికరణ 194(3) కింద సంక్రమించిన అధికారాల ప్రకారం స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సస్పెన్షన్ నిర్ణయం స్పీకర్ ఒక్కరిదే కాదని, మొత్తం శాసనసభ తీసుకున్న నిర్ణయమని వివరించారు. అధికరణ 208 శాసనసభ నియమ, నిబంధనలను చెబుతుంటే, అధికరణ 194 స్పీకర్ అధికారాలను, సభా హక్కులను చెబుతోందన్నారు. 194 కింద స్పీకర్‌కున్న అధికారాలను నియమ, నిబంధనలను కాలరాయలేవన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్త్తూ, అధికరణ 194 కింద మీకు (స్పీకర్) అధికారం ఉంటే, మరి తీర్మానం రూల్ 340 సబ్ రూల్ 2 కింద సస్పెండ్ చేస్తున్నట్లు ఎందుకు పేర్కొన్నారని ప్రశ్నించారు. దీంతో దమ్మాలపాటి తమిళనాడు ఎమ్మెల్యేల సస్పెన్షన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. శాసనసభ్యుడిని సభ నుంచి బహిష్కరించే అధికారం స్పీకర్‌కు ఉన్నప్పుడు, సస్పెండ్ చేసే అధికారం కూడా ఉందని సుప్రీంకోర్టు ఆ తీర్పులో చెప్పిందన్నారు. ఈ కేసులో కూడా స్పీకర్ స్థానాన్ని పిటిషనర్ అవమానించినందుకు రూల్ 340 సబ్ రూల్ 2తో నిమిత్తం లేకుండా అధికరణ 194 కింద ఉన్న అధికారం మేర స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, ఈ వాదనలతో తాను ఏకీభవించడం లేదని, నిబంధనలను కాదని స్పీకర్ తన అధికారం ఉపయోగించజాలరని అభిప్రాయపడ్డారు. దీనికి శ్రీనివాస్ స్పందిస్తూ, నిబంధనలతో సంబంధం లేదని, కేవలం అధికారాన్ని మాత్రమే చూడాలన్నారు. సుప్రీం ఆదేశాలు హైకోర్టు ధర్మాసనం దృష్టికి... అంతకు ముందు ఉదయం 10.30 గంటలకు ఇందిరా జైసింగ్ మంగళవారం సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రోజా పిటిషన్‌ను ఈ రోజు విచారించి ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పిందని ఆమె తెలిపారు. దీంతో ధర్మాసనం సుప్రీంకోర్టు ఉత్తర్వులను పరిశీలించింది. ఈ కేసును సింగిల్ జడ్జి జస్టిస్ రామలింగేశ్వరరావుకు నివేదిస్తున్నామని, అక్కడకు వెళ్లి సుప్రీంకోర్టు ఉత్తర్వులను, తమ నివేదనను చెప్పాలని ఇందిరాజైసింగ్కు ధర్మాసనం తెలిపింది. దీంతో ఆమె జస్టిస్ రామలింగేశ్వరరావు వద్దకు వచ్చి సుప్రీంకోర్టు ఉత్తర్వులను, ధర్మాసనం నివేదనను ప్రస్తావించింది. దీంతో ఆయన మధ్యాహ్నం 12 గంటలకు కేసు విచారణ ప్రారంభించారు. సాయంత్రం 4.30 గంటల వరకు ఈ కేసులో వాదనలు విన్నారు. -
అక్రమంగా ఏడాది సస్పెండ్ చేశారు
ఒక సెషన్ వరకు మాత్రమే సస్పెండ్ చేయాల్సి ఉన్నా, అన్యాయంగా ఏడాదిపాటు ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని హైకోర్టులో న్యాయవాది వాదించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తన సస్పెన్షన్‌పై దాఖలు చేసిన పిటిషన్ మీద హైకోర్టులో విచారణ బుధవారం ప్రారంభమైంది. ఈ కేసును ఎందుకు విచారణకు స్వీకరించలేదంటూ సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భొసాలే పరిశీలించారు. అనంతరం సీజే ఆదేశాల మేరకు పిటిషన్‌పై హైకోర్టు బెంచి విచారణ ప్రారంభించింది. సెక్షన్ 340 (2) కింద కేవలం ఒక సెషన్ వరకు మాత్రమే సభ్యులను సస్పెండ్ చేసే అధికారం ఉందని రోజా తరఫు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. విచారణ సమయంలో రోజా కూడా కోర్టులోనే ఉన్నారు. రోజా సస్పెన్షన్ వ్యవహారమంతా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. సభ్యుడి హక్కులకు భంగం కలిగినపుడు విచారించే అధికారం కోర్టుకు ఉంటుందని చెప్పారు. మధ్యాహ్నం 2 గంటలకు విచారణను వాయిదా వేసింది. అంతకుముందు ఉదయం ఈ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు మొదలయ్యాయి. గతంలో కేసు విచారణ పరిణామాలను హైకోర్టు అడిగి తెలుసుకుంది. హౌస్ మోషన్, లంచ్ మోషన్ పిటిషన్లకు అనుమతి నిరాకరణపై ఆరా తీసింది. రోజా తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించారు. సీజే చాలా క్లుప్తంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోజా పిటిషన్‌ను విచారించాలంటూ సుప్రీం కోర్టు హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
నాకు చాలా సంతోషంగా ఉంది: ఎమ్మెల్యే రోజా
ఢిల్లీ : శాసనసభనుంచి ఏడాది పాటు తనను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టాలని ఉన్నత ధర్మాసనం మంగళవారం హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు ఆదేశాలు ఇవ్వడంపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. తన పిటిషన్ పై విచారణ చేపట్టాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. హైకోర్టులో కచ్చితంగా తనకు న్యాయం జరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తనపై అన్యాయంగా సస్పెన్షన్ వేటు వేశారని, ప్రభుత్వ అవినీతిపై మాట్లాడుతున్నాననే తనపై కక్ష సాధిస్తున్నారని ఎమ్మెల్యే రోజా అన్నారు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న శాసనసబ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు తనకు అనుమతి ఇవ్వాలనే దానిపైనా రేపు హైకోర్టులో నిర్ణయం వస్తుందని అన్నారు. నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీ దృష్టికి తెచ్చేందుకు ప్రజలను తనను ఎన్నుకున్నారని, వారికి న్యాయం చేయాలంటే శాసనసభకు హాజరై వారి సమస్యలను వినిపించాల్సి ఉందన్నారు. న్యాయ వ్యవస్థను నమ్ముకుని వచ్చిన తనకు న్యాయం జరిగిందన్నారు. ఏపీలో రాక్షస పాలన నడుస్తోందని ఆమె ధ్వజమెత్తారు. -
రోజా పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా
న్యూఢిల్లీః తనను అన్యాయంగా ఏడాదిపాటు సస్పెండ్ చేశారంటూ వైఎస్సార్సీపీ శాసనసభ్యురాలు ఆర్కే రోజా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. జస్టిస్ జగదీష్ సింగ్ కెహర్, జస్టిస్ సి.నాగప్పన్‌తో కూడిన ధర్మాసనం వద్దకు ఈ పిటిషన్ విచారణకు రాగా రోజా తరపున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించేందుకు సంసిద్ధమయ్యారు. అయితే ఈ పిటిషన్‌ను తాను విచారించలేనని, తాను సభ్యుడిగా లేని మరో ధర్మాసనం ఈ కేసును విచారిస్తుందని జస్టిస్ కెహర్ పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రధాన న్యాయమూర్తి నుంచి తగిన సలహా తీసుకోవాలని రిజిస్ట్రార్‌ను ఆదేశిస్తూ ఉత్వర్వులు జారీచేశారు.