breaking news
Surgical procedure
-
మూలుగ మార్పిడి (బోన్ మ్యారో) చికిత్సలో సరికొత్త పురోగతులు!
Bone Marrow Transplantation New Procedures: మూలుగలోంచి మూలకణాలు పుడతాయి. అవే అటు తర్వాత ఎర్రరక్తకణాలుగా, తెల్లరక్తకణాలుగా, ప్లేట్‌లెట్స్‌గా రూపొందుతాయి. మూలుగలోనే తేడా ఉంటే ఏఎంఎల్, ఏఎల్ఎల్ వంటి కొన్ని రకాల బ్లడ్ క్యాన్సర్లు, పుట్టుకతోనే వచ్చే మరికొన్ని జన్యుపరమైన జబ్బులు, రక్తానికి సంబంధించిన థలసీమియా, సకిల్సెల్ అనీమియా వంటి వ్యాధులు వస్తాయి. ఇలాంటి వ్యాధులు ఉన్నవారికి మూలుగ మార్పిడి (బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్–బీఎంటీ) చికిత్స అవసరం. ఇందుకు మ్యాచింగ్ అవసరమవుతుంది. అసలు మ్యాచింగ్ అంటే ఏమిటి, ఎలా చేస్తారు, గతంలోలా ఎముకకు రంధ్రం చేయకుండా ఇప్పుడు నేరుగా రక్తం నుంచే మూలకణాలను సేకరించే ప్రక్రియలు... ఇలా బోన్ మ్యారోకు సంబంధించి... ప్రముఖ మెడికల్ అండ్ హెమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ నరేందర్‌కుమార్ తోట వివరిస్తున్న అంశాలను తెలుసుకుందాం. ప్రశ్న : అసలు ఎముక మూలుగ అంటే ఏమిటి? దాని ఉపయోగాలేమిటి? జ: ఎముక మధ్య భాగంలో మూలకణాలతో కూడిన ఎర్రటి చిక్కటి ద్రవంలా ఉండేదే ఎముక మూలుగ. ఇది చాలా కీలకమైనది. దీని నుంచి ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్లెట్స్... ఇలా రక్తానికి సంబంధించిన అనేక పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. ప్రశ్న : ఎముక మూలుగ (బోన్ మ్యారో) మార్పిడి చికిత్స ఎలాంటి సందర్భాల్లో చేస్తారు? జ: ∙జన్యుపరమైన వ్యాధుల వల్ల మూలుగ సరిగా పనిచేయక పోవడం ∙పుట్టుకతో వచ్చే (కంజెనిటల్) రక్తానికి సంబంధించిన వ్యాధులు (థలసీమియా, సికిల్‌సెల్ అనిమియా వంటివి). ∙రక్తంలో వచ్చే రకరకాల క్యాన్సర్లు (ఏఎంఎల్, ఏఎల్ఎల్ వంటి బ్లడ్‌క్యాన్సర్లు) మొదలైనవాటిల్లో. ప్రశ్న : 5/10, 10/10 మ్యాచింగ్ అంటే ఏమిటి? జ: హెచ్ఎల్ఏ అనేది ‘హ్యూమన్ ల్యూకోసైట్ ఏంటిజెన్’ అనే దానికి సంక్షిప్తరూపం. నిజానికి హెచ్ఎల్ఏ ఒక రకం ప్రోటీన్. యాంటిజెన్స్ అనేవి ఒక రకం కణాంశాలు. అవి తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వస్తుంటాయి. మళ్లీ ఈ హెచ్ఎల్ఏలో ఏ, బీ, సీ, డీ, డీఆర్, డీక్యూ అనే వివిధ భాగాలుంటాయి. ఈ విభాగాల మధ్య జరిగే మ్యాచింగ్‌ను పరీక్షల ద్వారా పరిశీలిస్తారు. ఇలాంటి మ్యాచింగ్‌లో పది అంశాలకు పది అంశాలు మ్యాచ్ అయితే.. దాన్ని 10/10 అనీ... సగం అంశాలు అయితే దాన్ని 5/10 అని అంటుంటారు. అయితే హెచ్ఎల్ఏ మ్యాచింగ్‌లో సగం అంశాలే... అంటే 5/10 మ్యాచ్ అయినప్పటికీ చేసే మూలుగ మార్పిడిని... ‘హ్యాప్లో ట్రాన్స్‌ప్లాంటేషన్’ అంటారు. ప్రశ్న : మరి ఈ హ్యాప్లో ట్రాన్స్ప్లాంటేషన్తోనూ అంతే మంచి ఫలితాలు వస్తాయా? జ: గతంలో ఈ తరహా ట్రాన్స్‌ప్లాంట్స్ ఎక్కువగా చేసేవారు కాదు. అయితే ఇప్పుడున్న అధునాతన సాంకేతికత, మంచి మందులు, నర్సింగ్ సిబ్బంది సహాయంతో, నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో ఈ ‘హ్యాప్లో’ ట్రాన్స్‌ప్లాంట్స్ చేస్తున్నారు. అంతేకాదు... వీటితో కూడా మంచి ఫలితాలే వస్తున్నాయి. ప్రశ్న : రక్తసంబంధీకుల్లో ఎవరూ మ్యాచ్ కాకపోతే ఏం చేస్తారు? జ: ఇప్పడు ధాత్రి, డీకేఎంఎస్ వంటి కొన్ని సంస్థలు ఉన్నాయి. వీళ్ల దగ్గర ప్రపంచంలోని అన్ని దేశాలకు చెందిన రకరకాల వారి హెచ్ఎల్ఏ వివరాలు ఉంటాయి. రక్తసంబంధీకుల్లో ఎవరిదీ మ్యాచ్ కానప్పుడు... బాధితుల హెచ్ఎల్ఏ వివరాలను ఈ సంస్థలకు తెలపాల్సి ఉంటుంది. ఇప్పుడా సంస్థలు... వారి వద్ద ఉన్న హెచ్ఎల్ఏలతో బాధితుల వివరాలను పోల్చి చూస్తారు. వారిలో ఎవరిదైనా మ్యాచ్ అయితే... వారి నుంచి మూలుగ సేకరించి, బీఎంటీ చికిత్స చేయవచ్చు. ప్రశ్న : ఎముక మూలుగ ఎలా సేకరిస్తారు? జ: గతంలో దాత(డోనర్)కు మత్తు మందు ఇచ్చి... అతడి ఎముక నుంచి చిన్న సూదుల సహాయంతో ఎముక మూలుగను సేకరించేవారు. అయితే ఇప్పుడు డోనర్ కు ‘గ్రోత్ఫ్యాక్టర్’ అనే ఇంజెక్షన్ ఇస్తారు. దాంతో ఎముక మూలుగలో ఉండే మూలకణాలు రక్తంలోకి వస్తాయి. ఆ తర్వాత ప్రత్యేక పరికరాల ద్వారా ఈ మూలకణాలను సేకరిస్తారు. అలా డోనర్‌కు ప్రత్యేకంగా ఎలాంటి ప్రొíసీజర్ చేయాల్సిన అవసరం ఉండదు. దానివల్ల ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. ప్రశ్న : డోనర్ నుంచి ఎముక మూలుగ సేకరించాక అతడికి ఏవైనా ఇబ్బందులు వస్తాయా? అలాగే డోనర్ రక్తంలోకి మూలకణాలు వచ్చేందుకు ఇచ్చే ఇంజెక్షన్ వల్ల ఏవైనా సైడ్ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందా? జ: అసలు ఇప్పుడు నేరుగా ఎముకలోంచి మూలుగ సేకరించడం లేదు కాబట్టి... ఇలాంటి ఇబ్బందీ ఉండదు. ఇక అతడినుంచి మూలుగ సేకరించాక కొంతకాలంలోనే అది మళ్లీ మునపటిలాగే పుట్టుకొస్తుంది. (రీజనరేట్ అవుతుంది). కాబట్టి ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. ఇక రక్తంలోకి మూలకణాలు వచ్చే ఇంజెక్షన్ వల్ల కూడా దాదాపు ఎలాంటి దుష్ప్రభావాలూ (సైడ్ఎఫెక్ట్స్) ఉండవు. కాకపోతే చాలా కొద్దిమందిలో మాత్రం ఒకటి, రెండురోజుల పాటు కొద్దిగా ఒళ్లునొప్పులు ఉంటే ఉండవచ్చు. ప్రశ్న : ఒకవేళ ఏవైనా కారణాల వల్ల ఇంజెక్షన్ ఇచ్చాక డోనర్ నుంచి మూలకణాలు సేకరించకపోతే ఏమైనా అవుతుందా? జ: ఏమీ కాదు... ఇలాంటి సందర్భాల్లో రక్తంలోకి వచ్చిన మూలకణాలు మళ్లీ యధావిధిగా కొన్ని మూలుగలోకి, మరికొన్ని ప్లీహం (స్పీ›్లన్)లోకి వెళ్లిపోతాయి. అంతేతప్ప... దానివల్ల డోనర్‌కు ఎలాంటి హానీ జరగదు. ప్రశ్న : డోనర్‌కు ఎలాంటి పరీక్షలు చేస్తారు? జ: దాతకు డాక్టర్లు రక్తానికి సంబంధించిన కొన్ని పరీక్షలు చేస్తారు. దాత నుంచి అసలు మూలకణాలను సేకరించగలరా లేదా అని తెలుసుకోడానికి మరికొన్ని పరీక్షలు కూడా చేస్తారు. ప్రశ్న : బాధితులకు ఈ మూలకణాలను ఎలా ఇస్తారు? ఇలా ఎక్కించిన మూల కణాలు ఏమవుతాయి? జ: మామూలుగా రక్తం ఎక్కించినట్టే... ఈ మూలకణాలను ఎక్కిస్తారు. అంటే రక్తనాళంలోకి వీటిని (సెంట్రల్ లైన్ ద్వారా) ఎక్కిస్తారన్నమాట. రక్తంలో కలిసిన మూలకణాలు వెళ్లి... ఎముక మూలుగలో స్థిరపడతాయి. అంతేతప్ప... బాధితులకు ఎలాంటి ఆపరేషన్ అవసరం పడదు. ప్రశ్న : బాధితులకు... వారి నుంచే సేకరించిన మూలకణాలనే ఎక్కించే అవకాశం ఉంటుందా? జ: కొన్ని సందర్భాల్లో అలా కూడా జరుగుతుంది. వ్యాధిగ్రస్తుడికి కొంచెం నయం అయిన తర్వాత వారి నుంచే మూలకణాలు సేకరించి, వారికే ఎక్కించే ప్రక్రియను ‘ఆటోలాగస్’ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటారు. అదే... ఇతరులనుంచి సేకరించి ఎక్కిస్తే దాన్ని... ‘అల్లోజెనిక్’ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటారు. ప్రశ్న : ఆటోలాగస్ ఎలాంటి సందర్భాల్లో చేస్తారు? జ: కొన్ని రకాల క్యాన్సర్లలో ఈ తరహా ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు. ఉదాహరణకు మల్టిపుల్మైలోమా, లింఫోమా, న్యూరోబ్లాస్టోమా వంటి క్యాన్సర్లలో ఈ మార్గం అనుసరిస్తారు. ప్రశ్న : బాధితులకు... వారి బంధువుల్లో ఎవరైనా మూలుగ ఇవ్వవచ్చా? జ: బాధితులతో పాటు, వారికి మూలుగ ఇవ్వదలచిన బంధువులకు / రక్తసంబంధీకులకు ‘హెచ్ఎల్ఏ’ అనే రక్త పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఇందులో 10 అంశాలకు కనీసం 5 అంశాలైనా మ్యాచ్ కావాల్సి ఉంటుంది. బాధితుల రక్తంలోని అంశాలతో దాత(డోనర్)కు చెందిన అంశాలు... పదికి పది మ్యాచ్ అయితే దాన్ని 10/10 అనీ, కనీసం ఐదు అయితే దాన్ని 5/10 అని సూచిస్తారు. అంటే 5/10 నుంచి 10/10 మ్యాచింగ్ అయితేనే దాత నుంచి మూలుగను స్వీకరిస్తారు. అప్పుడే వారిని డోనర్‌గా పరిగణించవచ్చు. సాధారణంగా బాధితుల సోదరులు, సోదరి, తల్లిదండ్రులు వంటివారిని... వారు డోనర్‌గా పనికివస్తారేమోనని పరీక్షిస్తారు. ప్రశ్న : ఎముక మూలుగ మార్పిడి తర్వాత ఏమైనా ఇబ్బందులు వస్తాయా? జ: మామూలుగా గతంలోలా చేసే సంప్రదాయ మూలుగ మార్పిడి ప్రక్రియలో బాధితుల్లో రోగనిరోధకశక్తి బాగా తగ్గిపోతుంది. దీనివల్ల చాలా తీవ్రమైన ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ప్లేట్లెట్స్ తగ్గిపోవడం వల్ల రక్తస్రావం / అంతర్గత రక్తస్రావం అయ్యే అవకాశం ఉండవచ్చు. అలాగే బాధితుల్లో ఆకలి తగ్గిపోవడం వంటి సమస్యలు మూలుగ మార్పిడి అయిన రెండు నుంచి మూడు వారాలప్పుడు కనిపిస్తాయి. ఇక చాలా చాలా తక్కువ మందదిలో దాత నుంచి స్వీకరించి ఎక్కించిన మూలకణాలు... బాధితుల్లో స్వాభావికంగా మళ్లీ పెరగకపోవచ్చు. ఇలా జరగడాన్ని ‘గ్రాఫ్ట్ ఫెయిల్యూర్’ అంటారు. దాత తాలూకు మూలకణాలు మరికొంతమందిలో చాలా తీవ్రంగా పరిణమిస్తాయి. అంటే రియాక్షన్‌లా రావచ్చు. ఇలా జరిగినప్పుడు బాధితుల్లో కొంతమందికి వాంతులు, విరేచనాలు, దురద, కామెర్లు వంటి సమస్యలు రావచ్చు. వీటిని జీవీహెచ్డీ సమస్యలుగా పేర్కొంటారు. అంటే... ‘గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్’ అని అర్థం. ప్రశ్న : ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఏవైనా ముందుజాగ్రత్తలు తీసుకునే అవకాశం లేదా? జ: ఉంది. ఇందుకోసం కొన్ని ప్రత్యేకమైన గదుల్లోనే మూలుగ మార్పిడి చికిత్స నిర్వహిస్తారు. ఈ గదుల్లో ‘హెపా ఫిల్టర్స్’, పాజిటివ్ ప్రెషర్స్’ వంటివి ఉపయోగిస్తారు. ‘హై ఎఫిషియెన్సీ పార్టిక్యులేట్ ఎయిర్ ఫిల్టర్స్ అనే దానికి సంక్షిప్తరూపమే ఈ ‘హెపా’. ఈ హెపా, పాజిటివ్ ప్రెషర్స్ ద్వారా గాలిలోని హానికరమైన పదార్థాలను 99.97 శాతం ఫిల్టర్ చేయవచ్చు. అంటే దాదాపుగా నూరు శాతమని చెప్పవచ్చు. అందువల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయి. జీవీహెచ్డీ, గ్రాఫ్ట్ ఫెయిల్యూర్ వంటి కాంప్లికేషన్లు రాకుండా ఉండేందుకు... ఎముక మూలుగ మార్పిడి చికిత్స తర్వాత కొన్ని మందులను సైతం ఇస్తారు. ప్రశ్న : ఎముక మూలుగ మార్పిడి చికిత్స తర్వాత బాధితులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జ: హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యాక వారు ఇంట్లో బాగా ఉడికించిన ఆహారపదార్థాలు మాత్రమే తీసుకోవాలి. వీలైనంతవరకు బయటివారిని కలవకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే వారి నుంచి ఏవైనా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉండవచ్చు. అలాగే డాక్టర్లు సూచించిన విధంగా మందులు వాడుతూ, రక్తపరీక్షల వంటివి క్రమం తప్పకుండా చేయించుకుని, ఫాలో అప్‌లో ఉండాలి. -డాక్టర్ నరేందర్‌కుమార్ తోట, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అండ్ హెమటో ఆంకాలజిస్ట్ అండ్ బీఎంటీ ఫిజీషియన్ -
అవ్వాతాతల కంటి పరీక్షలు వచ్చే ఏడాదికి పూర్తి
సాక్షి, అమరావతి: ఏపీలో తొలిసారిగా 60 ఏళ్లు దాటిన అవ్వాతాతలకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టింది. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలో 60 సంవత్సరాలు దాటిన 56.88 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేయాలని నిర్ణయించారు. మందులతో పాటు కంటి అద్దాలు, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు అన్నీ ఉచితంగానే చేస్తారు. ఇందులో ఇప్పటివరకు 13.58 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. మిగిలిన వారందరికీ వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి పరీక్షలు పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, కరోనా కారణంగా ఈ పరీక్షలకు అవరోధం ఏర్పడింది. కరోనా తగ్గడంతో తిరిగి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు 13.58 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించగా ఇందులో 4.71 లక్షల మందికి మందుల ద్వారా కంటిచూపు మెరుగుపరిచారు. 7.60 లక్షల మందికి కంటి అద్దాలు అవసరమని గుర్తించడమే కాకుండా ఉచితంగా కంటి అద్దాలు పంపిణీకి ఆర్డర్ ఇచ్చారు. ఇందులో ఇప్పటివరకు 4.69 లక్షల మంది అవ్వా తాతలకు ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే, ఇప్పటివరకు 1.26 లక్షల మందికి శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించగా.. వాటిని ఒక లక్ష మందికి పూర్తిచేశారు. అక్టోబర్ రెండు నుంచి మధ్య వయస్కులకు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి అవ్వా తాతలందరికీ కంటి పరీక్షలను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను అమలుచేస్తున్నాం. ఇప్పటికే స్కూలు పిల్లలకు పూర్తయ్యాయి. వచ్చే సెప్టెంబర్ నాటికి అవ్వాతాతల కార్యక్రమం పూర్తిచేసిన తరువాత మధ్య వయస్సుల వారికి కూడా ప్రపంచ దృష్టి దినోత్సవం అక్టోబర్ రెండు నుంచి ప్రారంభించేందుకు ప్రణాళికలను సిద్ధంచేస్తున్నాం. మొత్తం మీద అంధత్వ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను చేయాలనే ముఖ్యమంత్రి లక్ష్యాలను సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – డా. హైమావతి, ప్రజారోగ్య సంచాలకులు (నోడల్ అధికారి, వైఎస్సార్ కంటి వెలుగు) -
ఆపరేషన్ చేయాల్సిన చోట చేయకుండా..
జమ్మూకశ్మీర్: జమ్మూకాశ్మీర్‌లో వైద్యులు పెద్దతప్పిదం చేశారు. ఒక చోట చేయాల్సిన శస్త్ర చికిత్స మరోచోట చేసి అబాసుపాలయ్యారు. ఈ తప్పిదంతో ఆస్పత్రి యాజమాన్యం ఆపరేషన్ చేసిన ఐదుగురిని డిస్మిస్ చేసింది. షాలిమార్ బాగ్‌కు చెందిన రవి రాయ్ అనే 24 చార్టెడ్ ఎకౌంటెంట్కి ఇంట్లో మెట్లు జారీపడి కుడికాలి చీలమండలంలో గాయమైంది. దీంతో అతడిని కుటుంబ సభ్యులు ఫార్టిస్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రికి వెళ్లిన తర్వాత పరీక్షలు, స్కానింగ్ చేసిన వైద్యులు కుడి కాలి చీలమండలం జాయింట్లో గాయమైనట్లు గుర్తించారు. అనంతరం ఆపరేషన్ మాత్రం ఎడమకాలి చీలమండలానికి చేశారు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత అది చూసిన కుటుంబ సభ్యులు షాక్ తిన్నారు. కుడికాలికి అవసరం అయితే, ఎడమకాలికి చికిత్స ఎలా చేస్తారని నిలదీశారు. దానికి వైద్యులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ఎలాంటి సమస్య లేకుండా తిరిగి మరోసారి ఎడమకాలికి చికిత్స చేస్తామని అన్నారు. పరీక్షలు చేసి, స్కానింగ్ చేసి, ఆఖరికి ఆపరేషన్ మాత్రం చేయాల్సిన కాలికి కాకుండా వేరే కాలికి చేసి తిరిగి ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారా అని ఆగ్రహంతో అతడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీంతో ఆస్పత్రి యాజమాన్యం ఐదుగురు సిబ్బందిని విధుల నుంచి తప్పించింది. -
‘మరణించిన గుండె’ల మార్పిడి!
ప్రపంచంలోనే తొలిసారిగా ఈ తరహా శస్త్రచికిత్స హార్ట్ ఇన్ ఎ బాక్స్ పరికరం సాయంతో గుండెకు పునరుజ్జీవం సిడ్నీ: ప్రపంచ వైద్య చరిత్రలోకెల్లా అత్యుద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. అత్యంత సంక్లిష్టమైన గుండె మార్పిడి శస్త్ర చికిత్సా విధానంలో నూతనాధ్యాయానికి తెరలేచింది. మరణించిన రోగి శరీరం నుంచి ఇతరులకు అమర్చేందుకు పనికిరానిదిగా భావించే ఏకైక అవయవమైన గుండెకు సైతం మరణం లేదని తేలింది. నూతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో చలనంలేని గుండెను పునరుజ్జీవింపజేయడం సాధ్యమని నిరూపణ అయింది. ఇప్పటివరకూ బ్రెయిన్ డెడ్ రోగుల నుంచి ‘బతికున్న గుండె’లను (గుండెలు ఇంకా కొట్టుకుంటున్నప్పుడే) సేకరించి హృద్రోగులకు దాదాపు నాలుగు గంటల్లోగా అమర్చే పద్ధతి పలు దేశాల్లో అమల్లో ఉండగా అందుకు పూర్తి భిన్నంగా ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన ఓ వైద్య బృందం ప్రపంచంలోనే తొలిసారిగా ‘మరణించిన’ గుండెలను (కొట్టుకోవడం ఆగిపోయిన గుండెలను) ముగ్గురు హృద్రోగులకు విజయవంతంగా అమర్చింది. ముగ్గురు రోగులు మరణించి 20 నిమిషాలయ్యాక ఆ మృతదేహాల నుంచి సేకరించిన మూడు గుండెలను హృద్రోగులకు అమర్చి వారికి పునర్జన్మ ప్రసాదించింది. ఈ ఘనత సాధించిన వైద్య బృందంలో భారత సంతతి సర్జన్ కూడా ఉన్నారు. సిడ్నీలోని సెయిట్ విన్సెంట్ హాస్పిటల్‌కు వైద్యులు ఈ ఆపరేషన్ల కోసం ‘హార్ట్ ఇన్ ఎ బాక్స్’ పరికరం సాయం తీసుకున్నారు. మరణించిన రోగుల నుంచి సేకరించిన గుండెలను తొలుత ఈ పరికరంలో భద్రపరిచి అవి వెచ్చదనం కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పరికరంలో గుండెలు తిరిగి కొట్టుకోవడాన్ని పునరుద్ధరింపజేశారు. ఈ క్రమంలో గుండె కండరానికి నష్టాన్ని వీలైనంత తగ్గించేందుకు ఒక రకమైన పోషక ద్రావణాన్ని ఉపయోగించారు. ఆపై వాటిని ముగ్గురు రోగులకు శస్త్ర చికిత్సల ద్వారా అమర్చారు.