breaking news
Supernumerary Posts
-
డిగ్రీ కాలేజీల్లో 253 సూపర్ న్యూమరరీ పోస్టులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో విలీనమైన ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లోని బోధన, బోధనేతర సిబ్బందికి వేతనాల చెల్లింపు, ఇతర సర్దుబాటు చర్యల కోసం ప్రభుత్వం ఆయా కాలేజీల్లో 253 సూపర్ న్యూమరరీ పోస్టులను మంజూరు చేసింది. వీటిలో 23 ప్రిన్సిపాల్, 31 టీచింగ్, 199 నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జె.శ్యామలరావు బుధవారం జీవో 17 విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు చేసిన విధాన నిర్ణయం ప్రకారం ప్రభుత్వంలో తమ సిబ్బందిని విలీనం చేసేందుకు 125 ఎయిడెడ్ కాలేజీల యాజమాన్యాలు అంగీకారం తెలిపాయి. వీరిలో 895 మంది బోధన సిబ్బంది, 1,120 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. బోధన సిబ్బందిలో 864 మందిని వివిధ డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న క్లియర్ వేకెన్సీ పోస్టుల్లో సర్దుబాటు చేశారు. మిగతా 31 మందిని కొత్తగా మంజూరుచేసిన కాలేజీల్లోకి పంపారు. అయితే అక్కడ ఇంకా మంజూరు కాని పోస్టుల్లో వారిని నియమించారు. అలాగే ప్రభుత్వంలో విలీనమైన 23 మంది ప్రిన్సిపాళ్లకు ఖాళీలు లేనందున ఎవరికీ పోస్టింగ్ ఇవ్వలేదు. బోధనేతర సిబ్బందిలో 921 మందిని క్లియర్ వేకెన్సీల్లో సర్దుబాటు చేశారు. బోధనేతర సిబ్బందిలో మిగిలిన 199 మందితోపాటు 23 మంది ప్రిన్సిపాళ్లు, 31 మంది టీచింగ్ స్టాఫ్ కోసం సూపర్ న్యూమరరీ పోస్టులు అవసరమని కాలేజీ విద్యా కమిషనర్ ప్రతిపాదనలు ఇవ్వడంతో ప్రభుత్వం ఆమేరకు పోస్టులు మంజూరు చేసింది. -
‘ముంపు’ టీచర్లకు సూపర్ న్యూమరరీ పోస్టులు
* టీఎస్‌యూటీఎఫ్‌కు కమల్‌నాథన్ హామీ సాక్షి, హైదరాబాద్: పోలవరం ముంపు ప్రాంత ఉపాధ్యాయులు, ఉద్యోగులకు తెలంగాణలో సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి, సర్దుబాటు చేస్తామని ఉద్యోగుల విభజన సలహా కమిటీ చైర్మన్ కమల్‌నాథన్ హామీ ఇచ్చారని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (టీఎస్‌యూటీఎఫ్) నాయకులు అలుగుబెల్లి నర్సిరెడ్డి, చావ రవి, ఎం.ఎ.కె. దత్తు తెలిపారు వీరు సోమవారం సచివాలయంలో కమల్నాథన్ను కలసి వినతిపత్రం సమర్పించారు. ముంపు ప్రాంత ఉద్యోగులను ఖమ్మం జిల్లాలోనే సర్దుబాటు చేసేందుకు అనుమతివ్వాలని కోరారు. దీనిపై కమల్‌నాథన్ స్పందిస్తూ ముంపు ప్రాంత ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వాలని నిర్ణయించామని, అయితే తెలంగాణలోకి వచ్చే వారికోసం సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించాలని చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలను పంపి అనుమతి తీసుకోవాలని కమల్‌నాథన్ చెప్పారని టీఎస్‌యూటీఎఫ్ నాయకులు తెలిపారు. 17న నిర్వహించే కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారని వారు తెలిపారు.