breaking news
Summer excursion
-
సాహసం... సుందర వీక్షణం...
మబ్బులను చేత్తో అందుకోవాలి.. మంచులో జారుతూ సాగిపోవాలి.. ఎత్తై కొండలను అధిరోహించాలి.. లోతైన లోయల సౌందర్యాన్ని వీక్షించాలి.. వాహనమే లేని చోట గుర్రపు స్వారీ చేయాలి.. తేయాకు తోటల్లో విహరించాలి. ఈ వేసవి విహారంలో ఓ కొత్త అనుభూతిని పొందడానికి మన దేశంలోనే ఎన్నో అరుదైన, అద్భుతమైన ప్రాంతాలు ఉన్నాయి... ముస్సోరీలో ట్రెక్కింగ్ కొండ ప్రాంతాలలో సుదీర్ఘమైన నడకను ఓ సాహసకృత్యంగా పర్యాటకులు భావిస్తారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లా ముస్సోరీలో ట్రెక్కింగ్‌కు వెళ్ళిన పర్యాటకులు మర్చిపోలేని అనుభూతిని వెంటమోసుకెళతారు. హిమాలయ పర్వతాల్లో ఎత్తై హిల్ స్టేషన్ ముస్సోరీ. మీ వేసవి సెలవులకు ఇది సరైన వేదిక. ఎంతోమంది ప్రముఖ రాజకీయవేత్తలు సైతం తమ కుటుంబా లతో ఇక్కడ ఆనందపుటంచుల్లో విహరించినవారే! భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకు ఈ ప్రాంతం రెండవ ఇల్లుగా ఉండేది. రస్కిన్ బాండ్ అనే ప్రసిద్ధ ఆంగ్ల రచయిత ఇక్కడ ప్రకృతి సౌందర్యాన్ని తన రచనల్లో కళ్లకు కట్టారు. దారి పొడవునా పైన్ వృక్షాలు, పెద్ద పెద్ద జలపాతాలు, సుగంధాలను వెదజల్లే చందనపు వృక్షాలు.. ఇక్కడ ప్రకృతి సోయగానికి చూపుతిప్పుకోలేరు. ఈ పొడవైన దారిలో ట్రెక్కింగ్‌కి వెళ్లేవారు 400 ఎకరాలలో వన్యప్రాణులకు నిలయమైన ‘క్లౌడ్ ఎండ్ ఎస్టేట్’ను కూడా సందర్శించవచ్చు. ఇదో ప్రైవేట్ ఎస్టేట్. ఇక్కడ అరుదైన పక్షులను తిలకించవచ్చు. వసతి సౌకర్యం పొందాలంటే మాత్రం ‘వెర్మొంట్ ఎస్టేట్’లో పాత విల్లాలున్నాయి. ఇందులో ఇద్దరికి (రోజుకు) రూ.8,500కు వసతి లభిస్తుంది.ఢిల్లీ నుంచి 8 గంటలు ప్రయాణించి ఉత్తరాఖండ్‌లోని గఢ్వాల్ పట్టణానికి చేరుకొని, అక్కడ నుంచి కొండలలో రాణిగా పిలవబడే ముస్సోరీకి వెళ్లాలి. ఢిల్లీ నుంచి ముస్సోరీకి రెండు గంటలు పట్టే ఈ దూరానికి టాక్సీలో బయల్దేరాలంటే (ఒకరికి) రూ.4,700 లు ఖర్చు అవుతుంది. సాహసవీరులకు గుల్మార్గ్... హిమాలయ పర్వతాల్లో నునుపైన మంచుకొండల మీదనుంచి జారిపోతూ, గాలిలో తేలిపోతూ ఆకాశమే హద్దుగా ప్రపంచ పర్యాటకులు రెచ్చిపోయే ప్రదేశం గుల్మార్గ్. కాశ్మీర్ లోయల్లోని గుల్మార్గ్ గగనవీధుల్లో ఒకరోజంతా రోప్‌వేలో తేలిపోవాలంటే (ఒకరికి) రూ.2,500 ఖర్చు అవుతుంది. మొదటిసారి ‘స్కయింగ్’ కోర్సు తీసుకోవాలనుకుంటే మాత్రం రూ.5,000 చెల్లించాలి. ఇక్కడ పర్యాటకుల వసతి కోసం కొత్త కొత్త హోటళ్లు వెలిశాయి. గుల్మార్గ్లో ముందస్తు వసతి సదుపాయం పొందాలంటే జెకెటిడిసి (జమ్ముకాశ్మీర్) పర్యాటకశాఖ వారి ఫోన్ నెంబర్లు: +91 09419708180, +9101 954254487, 254439. గుల్మార్గ్లోని హె ఖైబర్ హిమాలయన్ రిసార్ట్, స్పా ఫోన్ నెంబర్: +91-1954254666.Email : reservations@khyberhotels.com శ్రీనగర్ నుంచి గుల్మార్గ్ చేరుకోవడానికి రెండు గంటల సమయం పడుతుంది. షాహ్ ట్రావెల్స్‌లో ఒకరికి, ఒక వైపు ప్రయాణానికి రూ.2,500 ఖర్చు అవుతుంది. గైడ్స్ కూడా అందుబాటులో ఉంటారు. బిర్‌లో గగన విహారం... మబ్బులను అందుకునేంత ఎత్తులో విహరించాలని ఉందా! అయితే, హిమాచల్ ప్రదేశ్‌లోని దౌలధర్ కొండల్లోని ‘బిర్’ ప్రాంతానికి వెళ్లాలి. జీవావరణ, సాహసవిన్యాసాల పర్యటనకు ఈ ప్రాంతం పెట్టింది పేరు. ఇక్కడ భూమి నుంచి 11,500 అడుగుల ఎత్తులో పారాచూట్ (పారాగ్లైడింగ్)లో విహరిస్తూ మబ్బులను అందుకోవచ్చు. సుశిక్షితులైన నిపుణుల పర్యవేక్షణలో ఈ గగన విహారపు అనుభూతిని ఆసాంతం పొందవచ్చు. అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని, కొండల అంచులను, లోయలనూ వీక్షించవచ్చు. పశ్చిమ హిమాచల్ ప్రదేశ్‌లోని కంగ్రా జిల్లాలో ‘బిర్’ ఒక గ్రామం. ఇక్క టిబెట్ దేశ శరణార్థులు, బౌద్ధ స్థూపాలను చూడవచ్చు. పారాచూట్ విహారానికి తగిన సామాగ్రిని పిజి-గురుకుల్ వారు అమర్చుతున్నారు. ఒకసారి విహరించడానికి రూ.2,000 ఖర్చు అవుతుంది. దీనికి తగిన శిక్షణ ముందుగానే తీసుకోవాల్సి ఉంటుంది. బిర్బిల్లింగ్ నుంచి చండీగడ్‌కు పారాచూట్లో నాలుగు గంటల్లో చేరుకోవచ్చు. ఈ ప్రాంతంలోనే ‘కొలనెల్స్ రిసార్ట్’ ఉంది. ఇందులో ఇద్దరు బస చేయడానికి రూ.2,500 ఖర్చు అవుతుంది. ఈ ప్రాంతంలో టిబెటన్ కాలనీలో ఇళ్లతో పాటు, స్థానిక సంస్కృతి, టిబెటన్ హస్తకళల కేంద్రం, టిబెటన్ పిల్లల గ్రామీణ పాఠశాల, వైద్య, జ్యోతిశ్శాస్త్ర కేంద్రాలను సందర్శించవచ్చు.ఢిల్లీ నుంచి కంగ్రా వ్యాలీ.. అటు నుంచి అహ్జుకు టాయ్ ట్రైన్ సౌకర్యం ఉంది. అక్కడి నుంచి బిర్ గ్రామానికి 3 కిలోమీటర్ల దూరం. ప్రకృతి ప్రేమికులకు కూనూరు... నీలగిరి పర్వతశ్రేణులు, తేయాకు తోటలు, దగ్గరలో ఊటీ పచ్చ సోయగం కూనూరుకు వెళ్లినవారి కనులకు విందుచేస్తాయి. సేంద్రీయ పద్ధతులతో పండించిన తాజా ఆహారపదార్థాలను ఇక్కడ కడుపారా ఆరగించవచ్చు. కూనూరు నుంచి ఊటీ వెళ్లేదారిలో నీలగిరి మౌంటెయిన్ రైల్వేలో విహరిస్తూ ఆ ఆహ్లాదాన్ని పొందవచ్చు. కూనూరుకు దగ్గరలో అతిపెద్ద తేయాకు పరిశ్రమ, డాల్ఫిన్స్ నోస్, లాంబ్స్ రాక్, టైగర్ హిల్, డ్రూగ్ ఫోర్ట్, సిమ్స్ పార్ట్, ర్యాలీ డ్యామ్, లాస్ జలపాతం, గోల్ఫ్‌కోర్స్.. వంటివెన్నో సందర్శించదగ్గవి. ► కోయంబత్తూరులో విమానాశ్రయం ఉంది. హైదరాబాద్ నుంచి నేరుగా కోయంబత్తూర్‌కు చేరుకోవచ్చు. ► కోయంబత్తూర్, చెన్నైలకు హైదరాబాద్ నుంచి రైలు సదుపాయం ఉంది. ► రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి బెంగళూర్ 870 కి.మీ., అటు నుంచి కొడెకైనాల్ 256 కి.మీ., అటునుంచి కోయంబత్తూరు 104 కి.మీ. విదేశాలకు వెళుతున్నారా? ట్రావెల్ ఇన్స్యూరెన్స్, క్రెడిట్ కార్డ్స్, ప్రీపెయిడ్ కార్డ్స్, ట్రావెలర్స్ చెక్... ఇవి ఉన్నాయా అనేది తప్పనిసరిగా సరిచూసుకోండి. ♦ ట్రావెలర్స్ చెక్స్ ఎందుకంటే... నగదు రూపంలో డబ్బు వెంట ఉంటే దారిలో పోవచ్చు. దొంగిలించబడవచ్చు. ఈ సమస్య ఎదురుకాకుండా విదేశాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ‘ట్రావెల్స్ చెక్స్’ అందుబాటులోకి వచ్చాయి. ఎక్కడైనా ఈ చెక్స్ పోయినా, సదరు సంస్థకు ఫోన్ చేసి నెంబర్‌ను రద్దు చేసుకోవచ్చు. ట్రావెల్చెక్స్ ప్రపంచవ్యాప్తంగా వినియోగించుకునే సదుపాయముంది. క్రెడిట్ కార్డ్స్, ప్రీపెయిడ్ కార్డ్స్ తీసుకోండి... విదేశాలలో క్రెడి ట్ కార్డ్‌ను నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ప్రీపెయిడ్ ట్రావెల్ కార్డులు కూడా ఎంతో సౌలభ్యంగా ఉంటాయి. అంతర్జాతీయంగా ఉపయోగించుకోవడానికి వీలుండే కార్డులు (పరిమితులను బట్టి) ఈ రెండూ. ఈ ప్రీపెయిడ్ కార్డు వినిమయానికి బ్యాంక్ ఛార్జీలు వర్తించవు. ఈ కార్డ్‌ను వెంట తీసుకెళ్లడం సులువు, సురక్షితం కూడా! ♦ ట్రావెల్ బీమా తప్పనిసరి... కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రయాణికుల కోసం బీమా భద్రత కల్పిస్తుంటాయి. వీటిని ఉపయోగించుకోవడం మేలు. లగేజీ పోయినా, అత్యవసర వైద్యసాయం పొందాలన్నా, ఊహించని ప్రమాదాలు జరిగినా... ఈ బీమా మీకు ధీమా కల్పిస్తుంది. -
ఆ గాలిలో... ఆ నేలలో
టర్కీ వేసవి విహారం వేసవి విహారంలో ఇప్పటి వరకు మారిషస్, మాల్దీవులకు వెళ్లేవారి సంఖ్య అధికంగా ఉండేది. ఆనందపు అంచులను తాకేందుకు ఇవే సరైన ప్రాంతాలుగా పర్యాటకుల మనసుల్లో బాగా నిలిచిపోయాయి. అయితే, ఈ స్థానాన్ని ఇప్పుడు టర్కీ కొట్టేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి టర్కీ వెళ్లే పర్యాటకుల సంఖ్య ఈ వేసవిలో పెరగడమే దీనికి అసలైన ఉదాహరణ. టర్కీ తన దౌత్యకార్యాలయాన్ని ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభించడంతో ఈ విషయం తేటతెల్లమైంది. టర్కీలోని చారిత్రాత్మక కట్టడాలు, బీచ్‌లలో రిసార్టులు, ముఖ్యంగా మధ్యధరా సముద్ర తీరప్రాంతాల సందర్శన, అక్కడి సంస్కృతిని తెలుసుకోవడానికి పర్యాటకులు అమితాసక్తి చూపుతున్నారు. అంతేకాదు, ఇతర దేశాలతో పోల్చితే టర్కీలో ఆరోగ్యసంరక్షణ, సౌందర్య పోషణ పద్ధతులు మెరుగ్గా ఉంటాయి. అందుకే స్పా వంటి సౌందర్యకేంద్రాలు ప్రపంచ దేశాల నుంచి వచ్చే పర్యాటకులతో నిండిపోయి ఉంటాయి. ప్రపంచంలో పేరెన్నికగన్న పది పర్యాటక స్థలాలూ ఈ దేశంలోనే ఉండి, పర్యాటకుల సంఖ్య పెరగడానికి దోహదం చేస్తున్నాయి. వేసవి ప్యాకేజీల హడావిడి... ‘‘ఇటీవల వేసవి టూర్ బుకింగ్స్ గమనిస్తే పదిరోజుల టర్కీ ప్యాకేజీని 30-40 శాతం మంది పర్యాటకులు ఇప్పటికే బుక్ చేసుకొని ఉన్నారు. ఇప్పటి వరకు టర్కీ వెళ్లడానికి వీసా బుకింగ్ కోసం ముంబయ్ కార్యాలయాన్ని సంప్రదించాల్సి వచ్చేది. ఇప్పుడు నేరుగా వీసా సదుపాయం కల్పిస్తూ హైదరాబాద్‌లో టర్కీ కాన్సులేట్‌ను ప్రారంభించడంతో పర్యాటకులకు మరింత సౌలభ్యంగా మారింది’’ అని బషీర్‌బాగ్‌లోని ట్రావెల్ ఏజెంట్ రషీద్ తెలిపారు. ‘‘ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి ప్రతి వేసవిలో టర్కీకి 150 బుకింగ్స్ ఉండేవి. ఈ వేసవికి ఇప్పటికే 500కు పైగా బుకింగ్స్ వచ్చాయి’’ అని కాక్స్ అండ్ కింగ్స్‌కు చెందిన శివమ్ శర్మ తెలిపారు. ‘‘టర్కీ ప్యాకేజీకి నాల్గు రాత్రులు, ఐదు పగళ్లకు గాను రూ.60,000. ప్రీమియమ్ ప్యాకేజ్ అయితే రూ.2 లక్షలు’’ అని శర్మ తెలిపారు. థామస్‌కుక్ ట్రావెల్ ఏజెన్సీ నాల్గు టర్కీ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. 6 రాత్రులు, 7 పగళ్లు టర్కీ సమ్మర్ ప్యాకేజీ ఒకరికి రూ.98,760లు ఉండగా, 8 రాత్రుళ్లు, 9 పగళ్లకు రూ.89,953లు, వారాంతపు ప్యాకేజీ అంటే 4 రాత్రులు, 5 పగళ్లకు రూ. 27,820లు, క్రూయిజ్ ప్యాకేజీ అయితే లక్షా యాభై వేల రూపాయలతో బుక్ చేసుకోవచ్చు. మేక్‌మై ట్రిప్.కామ్ రూ.45 వేల నుంచి లక్షా యాభైవేల రూపాయల వరకు ఈ నెల 23, 25 తేదీలలో, వచ్చే నెల 3, 7 తేదీలకు బుకింగ్స్‌ను అందుబాటులో ఉంచింది. ప్రధాన ఆకర్షణీయ స్థలాలు ఇవే... ఇటు ఆసియాలోనూ అటు యూరోప్‌లోనూ విస్తరించి ఉన్న దేశం టర్కీ. అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ టర్కీగా వ్యవహరిస్తారు. రెండు ఖండాల మధ్య ఉండటం వల్ల ఇరువైపుల సంస్కృతి టర్కీలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రకృతి సిద్ధ సందర్శనీయ స్థలాలు, చారిత్రక సౌరభాలు, విశాలమైన గడ్డి మైదానాలు, అబ్బురపరిచే సంస్కృతి, ఘుమఘుమల వంటకాలకు... టర్కీ పెట్టింది పేరు. సముద్ర తీరప్రాంతాలు, ఎత్తై పర్వత సానువులు ఈ ప్రాంతాన్ని హైలైట్‌గా నిలుపుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇస్తాంబుల్ పట్టణం ఒక్కటే ఈ దేశానికి ప్రధాన ఆకర్షణీయ కేంద్రంగా చెప్పవచ్చు. గగన విహారాన్ని అందించే కప్పడోసియా, పాముక్కలే కూడా ఈ దేశ పర్యాటకరంగాన్ని ముందంజలో ఉండేలా చేస్తున్నాయి. హగియా సోఫియా... ప్రపంచంలో అత్యంత అందమైన భవనాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది హగియా సోఫియా మ్యూజియం. టర్కీ రాజధాని అంకారా అయినా అతి పెద్ద నగరం మాత్రం ఇస్తాంబుల్. ఈ నగరంలో ప్రధాన పర్యాటక ప్రదేశాలలో హగియా సోఫియా మ్యూజియం చూసి తీరవల్సిన సందర్శనీయ ప్రాంతం. పాలరాతి వైభవం... ఎఫెసుస్... పాలరాతి స్తంభాలు, భారీ కట్టడాలు, రహదారులు గల నగరం ఎఫెసుస్. ఇక్కడ చారిత్రక కట్టడాలే కాదు రహదారులు కూడా మార్బుల్‌తో తళతళలాడుతుంటాయి. రోమన్ చక్రవర్తుల కాలంలో స్వర్ణయుగంగా ఈ నగరాన్ని పేర్కొంటారు. ఇప్పటికీ ఆ పేరును సార్థకం చేసుకుంటోంది ఎఫెసుస్. గగన విహారం... కప్పడోసియా... ఇదొక రాతి లోయ. కొండలు.. కోనలు, పర్వతప్రాంతాలు, వంపులు తిరిగిన రోడ్లు.. ఇక్కడ చూపు తిప్పుకోనివ్వవు. గాలి, నీటి చర్య వల్ల అపసవ్యంగా ఏర్పడిన కొండ పై భాగాలు, ఆవాసాలుగా మారిన వైనాలు ఆశ్చర్యానికి లోనుచేస్తుంటాయి. హాట్ ఎయిర్బెలూన్లో విహరిస్తూ, ఆ అద్భుతాలను కళ్లారా వీక్షించవచ్చు. సుల్తాన్ల స్వర్ణయుగం... టాప్ క్యాప్ ప్యాలెస్... సుల్తాన్ల సుసంపన్నమైన ప్రపంచాన్ని కన్నులారా వీక్షించాలంటే టాప్క్యాప్ ప్యాలెస్‌ను సందర్శించాల్సిందే! పశ్చిమ ఆఫ్రికా, ఐరోపాలలో తమ సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ఒట్టొమాన్ నాయకులు చేసిన కృషి ఈ భవనాలలో కనిపిస్తుంది. ఇక్కడ ఒట్టొమాన్ పవర్ బేస్ కూడా చూడదగినది. ఇవిగాక మరెన్నో... వీటితో పాటు... నల్లసముద్ర తీర ప్రాంతం పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. టర్కీ ఈశాన్య ప్రాంతంలో అతి పొడవైన ప్రయాణంగా ఈ తీరప్రాంతానికి పేరుంది. పురావస్తు పరిశోధనా స్థలంగా పేరుగాంచిన మౌంట్ నెమృత్ నాటి రోజుల్లో దేవతల ప్రాంతంగా పేరొందింది. నెమృత్ పర్వత శిఖరంపైన వాతావరణం, రాతి తలలు మనల్ని వింతలోకంలో విహరింపజేస్తాయి. ‘అనీ’ పట్టణానికి సిల్క్ రోడ్ సిటీ అనే పేరుంది. ఆధునిక టర్కీ సరిహద్దుల్లో గల ఆర్మేనియాకు ఈ పట్టణం 14వ శతాబ్దిలో రాజధానిగా వెలుగొందింది. ఇక్కడ ఎర్రటి ఇటుకతో నిర్మించిన ఇళ్లు ఆకట్టుకుంటాయి. గడ్డిమైదానాలు, సెయింట్ గ్రెగొరీ చర్చి చూసి తీరాల్సిన ప్రదేశాలు.