breaking news
Stanza
-
Strandja Memorial Boxing Tournament 2023: భారత బాక్సర్లకు రజతాలు
సోపియా: స్ట్రాండ్జా మెమోరియల్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు అనామిక, అనుపమ, గోవింద్ కుమార్ సహాని రజత పతకాలు సాధించారు. మహిళల 50 కేజీల ఫైనల్లో జాతీయ చాంపియన్ అనామిక 1–4తో చైనాకు చెందిన హు మెయి చేతిలో ఓడింది. పురుషుల 48 కేజీల తుదిపోరులో గోవింద్ కుమార్ 1–4తో షోదియోర్జన్ మెలికుజీవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో పరాజయం చవిచూశాడు. మహిళల 81 కేజీల ఫైనల్లో అనుపమ 0–5తో ఆస్ట్రేలియన్ బాక్సర్ ఎమ్మా సూ గ్రీన్ట్రి చేతిలో ఓడిపోయింది. ఈ టోరీ్నలో భారత్ మొత్తం ఎనిమిది పతకాలు సాధించింది. ఇందులో మూడు రజతాలు కాగా... ఐదు కాంస్య పతకాలున్నాయి. పురుషుల కేటగిరీలో బిశ్వామిత్ర చొంగ్తమ్ (51 కేజీలు), సచిన్ (54 కేజీలు), మహిళల విభాగంలో కలైవాణి (48 కేజీలు), శ్రుతి యాదవ్ (70 కేజీలు), మోనిక (ప్లస్ 81 కేజీలు) కాంస్యాలు గెలిచారు. -
ఎవరి కన్న ఎవరు గొప్ప!
పద్యానవనం జగతి పుట్టించెడి వాడతడంటినా బ్రహ్మ తామరపువ్వు తనయుడాయె తామర ఘనమని తర్కించి చూచిన నలినాక్షి విష్ణు తా నాభినుండె విష్ణువు ఘనమని వివరించ చూచిన జలరాశి కొకతెప్ప చందమాయె జలరాశి ఘనమని తర్కించి చూచిన కుంభసంభవుచేత గ్రోలబడియె కుంభసంభవుండు ఘనమని చూచిన భూమిలోపలను పొత్తుబడెను భూమియె ఘనమని తర్కించి చూచిన శేషుండు మోసెనని చెప్పగలిగె శేషుండు ఘనమని తర్కించి చూచితె ఉమకన్నె కొకవేలి ఉంగరంబు ఉమకన్నె ఘనమని వూహించి చూచిన శివుని అర్థాంగమున చిక్కుబడెను శివుడె ఘనమని తర్కించి చూచిన... మానవ జీవితమే అనుసరణ, అనుకరణల మయం అంటారు పెద్దలు. ఈ ధర్మం ప్రకృతి సిద్దమయిందనీ చెబుతారు. ఏ విషయంలో ఎంత వరకు అనుసరిస్తాం/అనుకరిస్తాం, మిగతా ఏ మేరకు సృజనతో స్వతంత్రంగా చేస్తామనేది వ్యక్తుల్ని బట్టి, పరిస్థితులు, సమయ- సందర్భాల్ని బట్టి వేర్వేరుగా ఉంటుంది. మానవ పరిణామ క్రమంలో ఈ అనుకరణ వచ్చేటప్పటికి పూర్వీకులు, సమకాలికులు అని రెండు రకాల వారినీ అనుకరించడం సాధారణంగా జరిగేదే! అక్షరాలా అనుకరణే అయినా కూడ, అతి సమర్థంగా చేసే వాళ్లున్నట్టే, అధ్వాన్నంగా చేసే వారూ ఉంటారు. ఫలితంగా పోల్చుకోవడాలు, హెచ్చుతగ్గులు అనివార్యంగా వచ్చేస్తుంటాయి. కడకు పోరాటాలు, యుద్ధాలు సహితం ఇందులోంచి పుట్టినవే అన్నది కూడ ఓ చారిత్రక సత్యమే! ఎవరో సినీకవి వినోదం కోసం చెప్పినట్టు ‘నీ కంటె చవటను నేను...’ అని దర్జాగా ఒప్పుకునే వాళ్లు తక్కువే! ఎవరికి వాళ్లు, ఎదుటి వాళ్ల కన్నా ఎంతో కొంత తామే గొప్ప అనుకుంటారు. మరి ఎవరికన్నా ఎవరు తక్కువ, ఎవరి కన్నా ఎవరు గొప్ప అని నిర్దిష్టంగా తేల్చి చెప్పడానికి తూనికలు-కొలతలేమీ ఉండవా? అంటే, ఒక రకంగా ఉండవనే చెప్పాలేమో! అయినా, ఎవరికి తోచిన రీతిలో వారు హెచ్చుతగ్గుల లెక్కలు కడితే, అది ప్రామాణికం కావద్దూ! కావాలంటే మళ్లీ ఏదో ఒక పోలికతోనే నిర్ధారణ చేయాల్సి వస్తుంది. ఆ క్రమంలోనే, ఇదుగో! ఇక్కడ ఈ పద్యంలో వేమనంతటి వాడు ఎంత తంటాలు పడ్డాడో చూడండి. జగతిని పుట్టించిన వాడు కదా బ్రహ్మ గొప్పవాడనుకుందామంటే, ఆయనేమో తామర పువ్వులో పుట్టాడు! పోనీ, తామర పువ్వే గొప్పదనుకుందామన్నా, అదేమో విష్ణు నాభిలోంచి వచ్చిందాయె! సరే, విష్ణే గొప్పోడనుకుందామా అంటే, శేషశయ్యమీద పవళించిన ఆయన సముద్రంలో ఓ చిన్న తెప్ప మాదిరి. అయ్యో! అలాగని సముద్రుడు ఘనుడనుకుందామా, అగస్త్యుడు సాంతం తాగేశాడాయె! పోనీ, కుంభసంభవుడైన ఆ అగస్త్యుడే ఘనమనుకుందామా, అతడు భూమిలో ఓ భాగమే అయ్యాడు! అందుకని, భూమే గొప్పదనుకుందామా అంటే, ఆదిశేషుడు భూమిని అలవోకగా మోసాడంటారు! అద్సరే, ఆ శేషుడే ఘనుడని వాదిద్దామంటే, ఆయన ఉమాదేవి చేతి వేలికి ఉంగరమంత! సరే, ఆ ఉమనే గొప్ప అనుకుందామా అన్నా, ఆమె శివునిలో అర్ధభాగమైంది... ఇలా ఎందాక? ఇంతకు ఎవరు గొప్ప? ఇది ఎడతెగని శృంఖలం. ‘భూమి గుండ్రముగా ఉండు’అన్నట్టు ఎటెటో తిరిగి మళ్లీ మొదటికొచ్చే చక్రీయ ప్రక్రియలా సాగుతుంది తప్ప, అంతం ఉండదు. అందుకని, ఎవరికి వారు తామే గొప్ప అని సరిపెట్టుకోవడమో, లేదా ఎదుటి వాళ్లే తమ కన్నా గొప్ప అని సర్దుబాటు చేసుకోవడమో పేచీ లేని ఉత్తమ మార్గమనిపిస్తుంది. అంతిమంగా ఎవరు గొప్ప అని తేల్చలేకపోయినా... కొన్ని సార్లు కొంచెం హెచ్చు-తగ్గు లు గుర్తించాల్సి వస్తుంది. అది మరీ ముఖ్యంగా ఎన్నికలప్పుడు. ‘‘పోయినసారి ఎన్నికల్లో పోటీబడ్డ అభ్యర్థుల్లో ఎవడు తక్కువ నీచుడో తేల్చుకోలేక తెగ ఇబ్బందిపడ్డాడు మా వాడు...’’ అని ఆదుర్దాపడతాడు ‘మంచు’ కవితా ఖండిక (అమృతం కురిసిన రాత్రి)లో బాలగంగాధర తిలక్. అట్టడుగునుంచి అధమాధముల్నో, ఆ పైనుంచి గొప్పగొప్పోళ్లనో గుర్తించలేకపోయినా... పోటీ చేస్తున్నవాళ్లలో కాస్త మంచి వాళ్లనే ఎన్నుకోవడం మాత్రం ప్రజాస్వామ్యంలో మన ధర్మం. - దిలీప్‌రెడ్డి