breaking news
Srivari pavitrotsavam
-
రేపటి నుంచి శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 5 నుంచి 7వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఆగస్టు 4న అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికులు లేదా సిబ్బంది వల్ల తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం కలుగకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. కొన్ని ముఖ్యాంశాలు... ⇒ ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ⇒ సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ⇒ 5న పవిత్రాల ప్రతిష్ట, 6న పవిత్ర సమర్పణ, 7న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ⇒ పవిత్రోత్సవాల్లో భాగంగా సోమవారం సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. ⇒ అదేవిధంగా 5వతేదీన అష్టదళ పాద పద్మారాధన సేవ, 7న తిరుప్పావడ సేవతో పాటు 5 నుండి 7వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దయ్యాయి. -
పవిత్రోత్సవాలకు అంకురార్పణ
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు శుక్రవారం అంకురార్పణ జరిగింది. శనివారం నుంచి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు కనులపండువగా నిర్వహించనున్నారు. వైదిక సంప్రదాయం ప్రకారం జాతా శౌచం(పురిటిమైలు), మృతాశౌచం (మృతితో అంటు), స్త్రీల బహిష్టు కారణాలతో ఆలయంలో తెలిసీ తెలియక జరిగే దోషాల పరిహరణార్థం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. తిరుమల ఆలయంలో క్రీ.శ.1464కు పూర్వం నుంచే ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం స్వామి సేనాపతి విష్వక్సేనుడు పల్లకిపై తిరువీధుల్లో ఊరేగుతూ వసంత మంటపానికి చేరుకున్నారు. ఇక్కడే భూమిపూజ చేసి మృత్సంగ్రహణం(పుట్టమన్ను) చేసి ప్రదక్షిణగా ఆలయ ప్రవేశం చేసిన తర్వాత అంకురార్పణ మంటపంలో నవధాన్యాల బీజావాపం(అంకురార్పణం) చేశారు. ఉత్సవాలు నిర్వహించే మూడు రోజులూ ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఉత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని పుష్పాలతో అలంకరించారు.